హైదరాబాద్: మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అవమానం జరిగిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి పరిస్థితి విచిత్రంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఐఎఎస్ లు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, పదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదని ఐఎఎస్ లు చెబుతున్నారని అన్నారు. ఐఎఎస్ లు రాజకీయాలు మాట్లాడడం సరికాదని విమర్శించారు. రెండున్నర ఏళ్లలో బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, గతంలోమాజీ సిఎం కెసిఆర్ 24 గంటలు విద్యుత్ ఇచ్చారని తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ అధికారం లోకి వచ్చాక అందరి లెక్కలు సరిచేస్తామని కెటిఆర్ సూచించారు.
కెసిఆర్ పాలనలో అందరికి న్యాయం జరిగిందని అన్నారు. బిఆర్ఎస్ పాలనలో జరిగిన మంచి పనులు కార్యకర్తలు చెప్పలేక పోయారని అందుకే ఓడిపోయామని ఆవేదనను వ్యక్తం చేశారు. కెసిఆర్ ను మళ్లీ సిఎం (KCR CM again) చేయడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో భూముల విలువలు తగ్గిపోయాయని, యూరియా కోసం చెప్పులు లైన్లలో పెట్టాల్సి వస్తోందని కెటిఆర్ ఎద్దేవ చేశారు. రుణమాఫీ విషయంలో రాష్ట్రప్రభుత్వం విఫలం చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఓట్లు ఉన్నప్పుడు కాదని.. నాట్లు వేసేటప్పడు రైతుబంధు వేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక ప్రభుత్వం రైతుబంధు ఎత్తేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలో చాలా మంది మోసపోయారని కెటిఆర్ మండిపడ్డారు.
Leave a Reply