డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా నలుగురు మృతి చెందగా, పదుల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. దీంతో 50పైగా మంది గల్లంతైనట్లు సమాచారం. కుంభవృష్టితో ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలి గ్రామంలో ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ వరదల్లో 25 హోటళ్లు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ధరాలి సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండ పైనుంచి ఒక్కసారిగా ధరాలి గ్రామంపైకి వరద ప్రవాహం వచ్చింది. వరదలు ధరాలిలోని ఇళ్లను ముంచెత్తుతున్నాయి.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ (Uttarakhand) సిఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని పేర్కొన్నారు. దీంతో భద్రతా బలగాలు యుద్ధప్రాతిపదికన సహాయచర్యలు చేపట్టాయి. పోలీసులు, ఆర్మీ, 4 ఎస్‌డీఆర్ఎఫ్, 3 ఐటిబిపి బృందాలు ఈ సహాయచర్యల్లో పాల్గొంటున్నాయి. గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ మేరకు పుష్కర్ సింగ్ ధామితో.. అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. ధరాలిలో వరద పరిస్థితులపై షా అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్న పుష్కర్ సింగ్ ధామి.. వరదల గురించి తెలియగానే తన పర్యటనను రద్దు చేసుకున్నారు. వెంటనే తిరుపతి నుంచి ఉత్తరాఖండ్‌కు బయలుదేరారు. కాగా, ఉత్తరాఖండ్ వరద బీభత్సంపై ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద ఘటనపై ఉత్తరాఖండ్ సిఎంతో మాట్లాడానని.. ఘటనాస్థలంలో ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
Leave a Reply