ఆ ప్లాన్ ఫెయిలైంది.. అందుకే సిరాజ్‌కి కోపం వచ్చింది: గిల్

Mohammed Siraj

ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టెస్ట్‌లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ని భారత్ 2-2 తేడాతో సమం చేసింది. అయితే ఐదో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్ విజయానికి ఒక వికెట్ అవసరం ఉండగా.. ఇంగ్లండ్ బ్యాటర్ అట్కిన్సన్ కాసేపు టెన్షన్ పెట్టాడు. ఒక ఎండ్‌లో గాయంతో ఉన్న క్రిస్‌ వోక్స్ ఉండగా.. తానే స్ట్రైకింగ్ చేస్తూ.. ఇంగ్లండ్‌కి విజయాన్ని అందించేందుకు కృషి చేశాడు. కానీ, మొత్తానికి అతను సిరాజ్ (Mohammed Siraj) బౌలింగ్‌లో ఔట్ కావడంతో భారత ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే చివరి వికెట్ తీసేందుకు భారత పేసర్ సిరాజ్ (Mohammed Siraj) అన్ని విధాలుగా ప్రయత్నించాడు. ఒక సందర్భంలో భారత్‌కు వచ్చిన రనౌట్ అవకాశాన్ని కీపర్ ధృవ్ జురేల్ చేజార్చుకున్నాడు. అప్పుడు సిరాజ్ కాస్త కోపానికి గురయ్యాడు. అసలేం జరిగిందో కెప్టెన్ గిల్ మీడియాకు వివరించాడు. ‘‘వైడ్ యార్కర్ వేయాలని ముందే ప్లాన్ చేశాం. వోక్స్‌కి స్ట్రైక్ ఇవ్వకుండా అట్కిన్సన్ బ్యాటింగ్ చేస్తాడని తెలుసు. చివరి బంతికి సింగిల్ రాకుంటే వోక్స్ స్ట్రైక్‌కి వస్తాడు. కాబట్టి రన్ రాకుండా ఔట్ చేసేందుకు ముందే గ్లోవ్స్ తీసి ఉంచమని సిరాజ్, జురేల్‌తో చెప్పమన్నాడు. కానీ, నేను చెప్పేలోపే సిరాజ్ బౌలింగ్ వేయడం ప్రారంభించాడు. దాంతో రనౌట్ మిస్ అయింది. అందుకే అతనికి కోపం వచ్చింది. జురేల్‌కి ఎందుకు చెప్పలేదని సిరాజ్ ప్రశ్నించగా.. అక్కడ జరిగింది చెప్పాను. మాకు సిరాజ్‌పై పూర్తి నమ్మకం ఉంది. ఒక క్యాచ్ వదిలేసినంత మాత్రాన అతనిపై గౌరవం పోలేదు. అతను ఈ మ్యాచ్‌లో చేసిన కృషి అద్భుతం’’ అని గిల్ అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *