అదరగొట్టిన సిరాజ్.. ఐదో టెస్ట్‌లో భారత్ విజయం.. సిరీస్ డ్రా

Team India

లండన్‌: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా కెన్నింగ్టన్ ఓవెల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ (Team India) ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 367 పరుగులకే ఆలౌట్ చేసి.. 6 పరుగుల తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సిరీస్‌ని 2-2 తేడాతో డ్రా చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసిన భారత్.. ఇంగ్లండ్‌కు 374 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. అయితే నాలుగో రోజు ఆటలో హ్యారీ బ్రూక్, జో రూట్‌లు శతకాలు సాధించి.. మ్యాచ్‌ని ఏక పక్షం చేసే ప్రయత్నం చేశారు. కానీ, భారత బౌలర్లు ఆ జోడీని ఔట్ చేయడంతో మ్యాచ్‌పై భారత్‌కు ఆశలు నిలిచాయి.

అయితే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 339/6 పరుగులు చేసింది. ఐదో రోజు విజయానికి ఇంగ్లండ్‌కి 35 పరుగులు అవసరం కాగా, భారత్ (Team India) మరో నాలుగు వికెట్లు తీయాల్సి ఉంది. ఐదో రోజు జెమీ ఓవర్టన్ బౌండరీలతో ఇన్నింగ్స్‌ని ప్రారంభించాడు. అయితే ఆ తర్వాత సిరాజ్‌ ఓవర్‌లో జెమీ స్మిత్(2) ఔట్ అయ్యాడు. అనంతరం జెమీ ఓవర్‌టన్‌(9)ను కూడా సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ, గస్ అట్కిన్సన్ మ్యాచ్‌ని ఉత్కంఠభరితంగా మార్చాడు. ముఖ్యంగా ప్రశిద్ధ్ బౌలింగ్‌లో టంగ్(0) ఔట్ కావడంతో క్రిస్ వోక్స్ గాయాన్ని సైతం లెక్క చేయకుండా బ్యాటింగ్‌కి వచ్చాడు.

ఈ క్రమంలో వోక్స్‌కి స్ట్రైక్ రానివ్వకుండా అట్కిన్సన్ అంతా తానై బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా సిరాజ్ బౌలింగ్‌లో సిక్సు కొట్టడంతో మ్యాచ్‌లో మరింత టెన్షన్ పెంచాడు. అలా రెండు ఓవర్లు చివరి బంతికి సింగిల్ తీస్తూ.. స్ట్రైక్‌ని తనవైపే ఉంచుకున్నాడు. అయితే చివరికి అతను సిరాజ్‌కే దొరికిపోయాడు. సిరాజ్ వేసిన 86వ ఓవర్ తొలి బంతికే అట్కిన్సన్(17) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో సిరాజ్ 5, ప్రశిద్ధ్ 4, ఆకాశ్‌దీప్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ 2-2 తేడాతో సిరీస్‌ను సమం చేసింది. ఐదో టెస్ట్‌లో మహ్మద్ సిరాజ్‌కి (రెండు ఇన్నింగ్స్‌లో కలిపి తొమ్మిది వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. శుభ్‌మాన్ గిల్, హ్యారీ బ్రూక్‌లకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *