సనాతన ధర్మం గురించి పవన్‌ కంటే ఎవరికీ ఎక్కువ తెలియదు: అల్లు అరవింద్

Allu Aravind

హైదరాబాద్: కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ రూపొందించిన చిత్రం ‘మహావతార్ నరసింహా’. జూలై 25న విడుదలైన ఈ యానిమేషన్ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభించింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాని తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) విడుదల చేశారు. అయితే తాజాగీ ఈ సినిమా సక్సెస్ మీట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్‌తో పాటు అశ్విన్ కుమార్, ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి, గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పరిచయం ఉన్న వారిలో సనాతన ధర్మం గురించి ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని అల్లు అరవింద్ (Allu Aravind) అన్నారు. పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడితే.. అందరూ ముగ్ధులవుతారని పేర్కొన్నారు. ఈ సినిమాను పవన్ తప్పనిసరిగా చూడాలని ఆయన కోరుకున్నారు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. హోంబలే ఫిల్మ్స్‌తో తనకు మంచి అనుబంధం ఉందని.. నిర్మాత విజయ్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయాలని అడిగిన వెంటనే సరే అన్నానని అన్నారు.

‘‘సినిమా విడుదలైన రోజు మార్నింగ్ షోస్‌కి మంచి ఆదరణ వచ్చింది. దీంతో ఈవినింగ్ షోలు పెంచాము. మరుసటి రోజు నుంచి మరిన్ని స్క్రీన్స్ పెంచుకుంటూ పోతున్నాం. తాజాగా హైదరాబాద్‌లోని ఓ మల్టీఫ్లెక్స్‌లో 200 మంది స్వాములు ఈ చిత్రాన్ని చూశారు. ఈ సినిమాకు ప్రమోషన్స్ అవసరం లేదు అని అనిపించింది. సినిమా దర్శక, నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు. 2021లో బీజం పడిన ఈ సినిమా ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకొని చివరకు మన ముందుకు తీసుకొచ్చారు’’ అని అల్లు అరవింద్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *