తప్పు ఒప్పుకున్న పంత్.. శిక్ష విధించిన ఐసిసి

Rishabh Pant

లీడ్స్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ సాధించి.. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తాజాగా ఐసిసి పంత్‌‌కు (Rishabh Pant) షాక్ ఇచ్చింది. అంపైర్లతో వాగ్వాదం చేసినందకు అతనికి ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. తొలి ఇన్నింగ్స్ 61 ఓవర్‌లో బంతిని మార్చాలని పంత్ ఫీల్డ్ అంపైర్ పాల్ రైఫిల్‌ని అడిగాడు. బంతి కండీషన్ బాలేదని.. ఇంకో బంతి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. కానీ, అంపైర్ బంతిని పరిశీలించి దాన్ని మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. దీంతో సహనం కోల్పోయిన పంత్ బంతిని నేలకేసి బలంగా కొట్టాడు.

దీంతో అంపైర్లు మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్‌కు ఫిర్యాదు చేశారు. పంత్‌ కూడా తన తప్పును అంగీకరించడంతో పంత్‌కు (Rishabh Pant) ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8ని ఉల్లంఘించినందుకు ఐసిసి ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. గత 24 నెలల్లో ఇదే తొలి తప్పిదం కావడంతో కేవలం ఒక డీమెరిట్ పాయింట్‌తో సరిపెట్టింది.

కాగా, రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్ (137), పంత్ (118) రాణించడంతో భారత్ 364 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 371 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బౌలర్లు నిలకడగా ఆడుతున్నారు. ఐదో రోజు 17 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేశారు. ఇంకా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. ఇంగ్లండ్ 315 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో డక్కెట్ (29), క్రాలీ (21) ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *