ఆరోపణలపై దృష్టి పెట్టని ఇసి

Election Commission faces

మహారాష్ట్రలో 2024 అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో బయటపడిన లోపాలపై లోక్‌సభ విపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇబ్బందికరమైన ప్రశ్నలను లేవనెత్తారు. అవి నిర్దిష్టమైన అంశాలు సాధారణ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య ఓటర్ల జాబితాలో అసాధారణంగా ఓటర్లు పెరగడం, పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల తరువాత ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఓటు వేయడం, పోలింగ్ ప్రక్రియకు సిసిటివి అనుసంధానం నివారిస్తూ 1961నాటి ఎన్నికల నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించడం, ఈ అంశాలపై రాహుల్ ప్రశ్నలు లేవనెత్తారు. 2024 లోక్‌సభ, శాసనసభ ఎన్నికల మధ్య కేవలం ఐదు నెలల్లోనే మహారాష్ట్రలో 41 లక్షల మంది కొత్త ఓటర్లు చేరడంపై రాహుల్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇది అద్భుతమైన పెరుగుదల అని ఆయన పరిశీలనా పరంగా వ్యాఖ్యానించారు.

ఈ ప్రశ్నలకు ఎన్నికల కమిషన్ సూటిగా సమాధానం చెప్పలేక ప్రతివిమర్శలు చేస్తోంది. వాస్తవంగా పరిశీలిస్తే 2019 శాసనసభ ఎన్నికల్లో (assembly elections) మహారాష్ట్రలో నమోదైన ఓటర్ల సంఖ్య 8.98 కోట్లు అని, ఇది 2024 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల నాటికి 9.29 కోట్లకు పెరిగిందని ఎన్నికల కమిషన్ ధ్రువీకరించింది. 2024 నవంబర్ శాసనసభ ఎన్నికల నాటికి ఈ సంఖ్య 9.70 కోట్లకు పెరిగింది. ఐదేళ్లలో 31 లక్షలు పెరిగితే కేవలం ఐదు నెలల్లో 41 లక్షలు పెరగడం ఆలోచించాల్సిందే. 2024 లో మహారాష్ట్రలో సగటున గంటకు 58 లక్షల మంది ఓటర్లు తమ ఓట్లను వేశారని ఎన్నికల కమిషన్ పేర్కొంది. దీని ప్రకారం చివరి రెండు గంటల్లోనే 116 లక్షల మంది ఓటర్లు ఓటు వేసి ఉండేవారు. అప్పుడు 76 లక్షల మంది ఓటర్ల పెరుగుదలపై పూర్తిగా నమ్మకం కుదిరేది. కానీ ఓటర్ల సంఖ్య పెరుగుదల రాష్ట్ర వ్యాప్తంగా ఏకరీతిగా లేదు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఎక్కడైతే బలహీనంగా కనిపించిందో ఆ 85 నియోజకవర్గాల్లోని 12,000 బూత్‌ల్లో ఈ పెరుగుదల కేంద్రీకృతం కావడం అనుమానాలకు తావిస్తోంది. ఐదు నెలల్లో ఓటర్ల సంఖ్యలో ఈ అసాధారణ పెరుగుదల ఎలా జరిగిందో కనుగొనడం ఎన్నికల కమిషన్ బాధ్యత. ఇది ఎన్యూమరేటర్లు తమ పనిని అంకిత భావంతో చేయలేదని స్పష్టమవుతోంది. ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని కూడా రాహుల్ తప్పు పట్టారు. సెలెక్షన్ ప్యానెల్‌లో చీఫ్ జస్టిస్ కూడా భాగంగా ఉండాలని సిఫార్సు చేస్తూ 2023లో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును కేంద్రం బేఖాతరు చేయడం రాహుల్ ఆక్షేపించారు. గతంలో ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల పనితీరుపై బిజెపి, కాంగ్రెస్‌లతో సహా రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేశారు.

పరిపాలన, సాంకేతిక భద్రతా చర్యలకు సంబంధించి పరిగణనలోకి తీసుకుంటే చాలా ఫిర్యాదులు పరిశీలనకు నిలబడలేదు. కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికల ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించింది. ఎత్తి చూపించిన ప్రాథమిక సమస్యలను ఎన్నికల కమిషన్ పరిష్కరించవలసి ఉంది. సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో నమోదైన ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు ప్రాథమిక విశ్లేషణలో బయటపడింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త ఓటర్లు చాలా ఎక్కువగా నమోదయ్యారు. సాధారణ ఎన్నికల తరువాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేవలం ఆరు నెలల్లోనే 39 లక్షల మంది కన్నా ఎక్కువ సంఖ్యలో కొత్త ఓటర్లు నమోదయ్యారు. ఇదే విధంగా 2014 లోనూ కనిపించింది. దాదాపు 4 మిలియన్ ఓటర్లు పెరగడం భారీ సంఖ్యే. ఈ నేపథ్యంలో జాబితాల పరిశీలనకు ఎన్నికల కమిషన్ ముందస్తుగానే మెషిన్ రీడబుల్ డేటా విడుదల చేయాలి.

సాయంత్రం 5 గంటల తరువాత ఓటర్ల సంఖ్య అమాంతంగా, అసాధారణంగా పెరిగిపోయిందన్న వాదన వినిపిస్తుంటే, ఎలక్షన్ కమిషన్ డేటా మాత్రం మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల తరువాత ఓటర్ల సంఖ్య చెప్పుకోదగినంతా పెరగలేదని చెబుతోంది. ఎన్నికల కమిషన్ యాప్ నుంచి వెలువడిన ఈ తాత్కాలిక ఓటింగ్ సంఖ్య మొత్తం పూర్తిగా కచ్చితమని చెప్పలేం. మనుషులు నమోదు చేసిన సంఖ్యపైనే ఇవి ఆధారపడి ఉంటున్నాయి. మెషిన్ కచ్చితంగా లెక్కించిన సంఖ్యతో పోలిస్తే కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తాయి. కొంత ఆలస్యంగా ప్రతి ఎన్నికల బూత్ నుంచి 17సి డేటా ద్వారా వచ్చిన ఖరారైన గణాంకాలు తాత్కాలిక ఓటింగ్ శాతం గణాంకాలపై ఆధారపడడం తప్పు. ఓటింగ్ పూర్తయిన తరువాత పోలింగ్ అధికారి పోలైన మొత్తం ఓట్ల సంఖ్యను బూత్ లెవెల్ ఏజెంట్లకు తెలియజేయాలి. దీనివల్ల పారదర్శకత ఏర్పడుతుంది.

కానీ మహారాష్ట్ర విషయంలో పోలింగ్ మరుసటి రోజు ఉదయం మొత్తం పోలైన ఓట్ల సంఖ్యను తానే ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా బహిరంగంగా ప్రకటించడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ శాతం 58.22 శాతం ఉంటే మర్నాడు 66.05 శాతానికి ఎలా ఎగబాకిందని రాహుల్ ప్రశ్నించడం గమనించాల్సి ఉంది. ఏదేమైనా ఎన్నికల కమిషన్ స్పందించాల్సిన మరో వాదన ఉంది. ఫిర్యాదులను పరిశీలించడానికి సిసిటివి ఫుటేజీని, ఓటర్ల జాబితాలను పార్టీలకు, ప్రతినిధులకు అందుబాటులో ఉంచడం తప్పనిసరి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత వహించడం ఎన్నికల కమిషన్ బాధ్యత. కానీ ఎన్నికల కమిషన్ ఇవన్నీ పక్కనపెట్టి భారత్‌లో ఎన్నికల జాబితా రూపకల్పన అనేది ప్రపంచంలోనే అత్యంత పకడ్బందీ, పారదర్శకమైన ప్రక్రియల్లో ఒకటని స్వోత్కర్ష చేయడంలో పారదర్శకత ఏముంది? భారత ఎన్నికల నిర్వహణలో నిజాయితీ ఉంటోందని, అభ్యంతరాలను, అభ్యర్థనలను పరిశీలిస్తున్నామని ఎన్నికల కమిషన్ పదేపదే ప్రచారం చేసుకోంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *