టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్ ఎవరంటే..

Ind VS Eng

లీడ్స్: భారత్, ఇంగ్లండ్ (Ind VS Eng) మధ్య క్రికెట్ సమరం ప్రారంభమైంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా హెడ్డింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా బరిలోకి దిగుతున్న టీం ఇండియాకు (Ind VS Eng) ఈ సిరీస్ ఓ పరీక్ష కానుంది. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. అతను మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తున్నట్లు కెప్టెన్ గిల్ తెలిపాడు. అంతేకాక.. సుదీర్ఘ సమయం తర్వాత కురుణ్ నాయర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

తుది జట్లు :
ఇండియా: యశస్వీ జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్, కురుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ధ్ కృష్ణ.

ఇంగ్లండ్: జాక్ క్రావ్లే, బెన్ డక్కెట్, ఒల్లే పోప్, జో రూట్, హారీ బ్రూక్, బెన్‌ స్టోక్స్, జెమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.

ఆ విషయంలో చరిత్ర సృష్టించిన ఐపిఎల్-2025 ఫైనల్

IPL 2025

ఈ ఏడాది జరిగిన zగ్ (IPL 2025) సర్వత్ర ఆసక్తికరంగా సాగింది. దాదాపు అన్ని మ్యాచ్‌లు ఉత్కంఠగా జరిగాయి. సిరీస్ ఆరంభం నుంచి అద్భుతమైన ప్రదర్శన చేసన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి ఐపిఎల్ ట్రోఫీని అందుకుంది. అయితే ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ ఫైనల్‌ మ్యాచ్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ వీక్షణ సమయం 31.7 బిలియన్ నిమిషాలు అని అధికారిక టివి మరియు డిజిటల్ ప్రసారకులు జియో హాట్‌స్టార్ వెల్లడించింది. టివి, డిజిటల్ వ్యూయర్షిప్‌లో ఇది సరికొత్త రికార్డు కావడం విశేషం.

టివి వ్యూయర్షిప్‌లో అత్యధిక రీచ్ (169 మిలియన్ వీక్షకులు, 15 బిలియన్ నిమిషాల వీక్షణ సమయం) నమోదు చేసిన టి-20 మ్యాచ్‌గా ఇది ప్రపంచరికార్డు సాధించింది. జియో హాట్‌స్టార్‌లోనూ ఈ మ్యాచ్ చరిత్రను తిరగరాసింది. 892 బిలియన్ వీడియో వ్యూస్, 55 మిలియన్ల పీక్ కంకరెన్సీ, 16.74 బిలియన్ నిమషాల వీక్షణ సమయంతో ఈ మ్యాచ్ సరికొత్త రికార్డు సాధించింది. సీజన్ మొత్తం కూడా రికార్డు స్థాయిలో వ్యూయర్షిప్ సాధించింది. కాగా, జూన్ 3వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగి ఐపిఎల్ ఫైనల్స్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుపై 6 పరుగుల తేడాతో ఆర్‌సిబి గెలిచి తొలిసారి ట్రోఫీని సొంతం చేసుకుంది.

వరంగల్ తూర్పులో మరో నాయకుడికి ఛాన్స్ లేదు: కొండా మురళి

coverts police department

హైదరాబాద్: బయట పార్టీ నుంచి వచ్చిన నేతలు.. పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ఎమ్మెల్సీ కొండా మురళి తెలిపారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో కోవర్టులు ఉన్నారని అన్నారు. వరంగల్ లో కొండా మురళి సంచలలన వ్యాఖ్యలు చేశారు. కొండా మురళి ఉన్నంతవరకు. వరంగల్ తూర్పులో (East Warangal) మరోనాయకుడికి ఛాన్స్ లేదని అన్నారు.  పరకాలలో 75 ఏళ్ల దరిద్రుడు ఎమ్మెల్యేగా గెలిచాడని విమర్శించారు. కనుబొమ్మలు లేని నాయకుడు టిడిపిని భ్రష్టు పట్టించాడని, మొన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదని అన్నారు. తనకు ఎస్కార్ట్ ఇచ్చిన వారిపై చర్యలు కాదని, డిపార్ట్ మెంట్ లో ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కొండా మురళి సూచించారు.

ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ లో మార్పు రాలేదు: పయ్యావుల

Payyavula Keshav comments jagan

అమరావతి: వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి రౌడీ రాజకీయాలు చేస్తున్నారని ఎపి మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.  జగన్ వ్యాఖ్యలకు (Jagan comments) పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. ఓటమి నుంచి తమరు పాఠం నేర్చుకున్నట్లు లేదని అన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ లో మార్పు రాలేదని విమర్శించారు. జగన్ అరాచకాలను సహించేది లేదని, జగన్ హింసను ప్రేరేపిస్తున్నారని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.

బనకచర్లపై ఆందోళనలను కేంద్ర మంత్రికి చెప్పాం: ఉత్తమ్

Concerns people farmers

అమరావతి: కేంద్ర మంత్రికి బనకచర్ల చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్టు అని వివరించామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బనకచర్లపై ఆందోళనలను కేంద్ర మంత్రికి చెప్పామని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్లపై రాష్ట్ర ప్రజల్లో, రైతుల్లో ఆందోళనలు ఉన్నాయని, తమ ఆందోళనను పరిగణలోకి తీసుకుంటామని కేంద్రమంత్రి చెప్పారని ఉత్తమ్ కుమార్ అన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ (Krishna Tribunal) తీర్పు త్వరగా వచ్చేలా చూడమని కోరామని చెప్పారు. ఇచ్చంపల్లి నాగార్జునసాగర్ లింకుతో పెన్నా బేసిన్ కు నీరు తీసుకెళ్ళొచ్చునని, ఇచ్చంపల్లి సాగర్ లింకు అంశంపై చర్చకు సిద్ధమని చెప్పామని తెలియజేశారు. అతిత్వరలో ఇరు తెలుగు రాష్ట్రాల సిఎంల భేటీ ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి పాటిల్ చెప్పారని పేర్కొన్నారు. అనేక తెలంగాణ ప్రాజెక్టులు కేంద్రం అనుమతి కోసం చూస్తున్నాయని, తమ ప్రాజెక్టుల కంటే ఎపి ప్రాజెక్టులకే త్వరగా అనుమతులిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

మరిపెడలో తల్లి, ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన కూతురు

Mahabubabad Maripeda

మహబూబాబాద్: ప్రేమకు అడ్డు చెప్పాడని తల్లి, ప్రియుడితో కలిసి కూతురు తండ్రిని చంపింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డిఎస్‌ఆర్ జెండాల్ తండాలో ధారావత్ కిషన్(40), కావ్య(35) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూతురు పల్లవి తన ప్రియుడు సురేష్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండగా తండ్రి ఆమెను మందలించాడు.

ప్రేమను తండ్రి అంగీకరించలేదని తల్లి కావ్య, చెల్లి, ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి కిషన్‌పై దాడి చేశారు. తండ్రి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కిషన్‌ను తల్లి సాంకి మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం జిల్లా కేంద్రానికి తీసుకెళ్లమని వైద్యులు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని ఓ ఆస్పత్రికి కిషన్‌ను తల్లి తీసుకెళ్లింది. అప్పటికే అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. సాంకి ఫిర్యాదు మేరకు ఇద్దరు కూతుళ్లు, భార్య, భూక్య సురేష్, బోడ చందు, దేవేందర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి: నారా లోకేష్

Sports City provide

అమరావతి: ప్రపంచస్థాయి శిక్షణ, సౌకర్యాల కల్పన స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యమని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వివిధ కీడల్లో అథ్లెట్లకు మద్దతు లక్ష్యమని అన్నారు. రెండో రోజు డిల్లీలో లోకేశ్ పర్యటించారు. టోనీ బ్లేయర్ తో ముందు కేంద్ర కార్మికశాఖ మంత్రి మాండవీయతో సమావేశమయ్యారు. విద్యారంగంలో అభివృద్ధి కోసం ‘టోనీ బ్లేయర్ ఇన్ స్టిట్యూట్ సహకారం కోరారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ (Sports City Amaravati) నిర్మాణానికి సహకారం అందించాలని, ఎపిని స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు చేయూత ఇవ్వాలని అన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు  శరవేగంగా కొనసాగుతున్నాయని లోకేష్ తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ హబ్ గా మార్చడానికి, రాష్ట్రంలోని పాఠశాలలు, క్రీడల అభివృద్ధికి చేయూత అందించాలని, 39 ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 39 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు జరగుతున్నాయని, రూ. 341.57 కోట్లతో ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలు ఆమోదించాలని సూచించారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజినల్ సెంటర్ ఏర్పాటుకు వినతి చేశారు. అథ్లెటిక్స్, రెజ్లింగ్ స్టేట్ లెవల్ సెంటర్ ను తిరుపతిలో నెలకొల్పాలని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.

ఇజ్రాయెల్-ఇరాన్ వార్.. ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల వాసి

Jagtial Person

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాలు మధ్య జరుగుతున్న దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యుద్ధం వల్ల జగిత్యాలకు (Jagtial Person) చెందిన రవీందర్ అనే వ్యక్తి మృతి చెందాడు. బతుకుదెరువు కోసం రెండు సంవత్సరాల క్రితం రవీందర్ ఇజ్రాయెల్‌కు వెళ్లాడు. అయితే యుద్ధం జరుగుతుండగా.. బాంబు శబ్ధం వల్ల రవీందర్ గుండెపోటుతో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రవీందర్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యుద్ధం కారణంగా విమాన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో రవీందర్ మృతదేహాన్ని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

6వ రోజు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు.. 609 మంది మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య సైనిక వివాదం బుధవారం మరింత తీవ్రమైంది. వరుసగా ఆరో రోజు ఇరుపక్షాలు ఒకదానిపై ఒకటి భీకర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. ఇరుదేశాల వైమానిక దాడుల్లో ఇప్పటివరకు మొత్తం 609 మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది పౌరులు గాయపడ్డారు. ఇరాన్‌లో 585 మంది మరణించగా.. ఇజ్రాయెల్‌లో 24 మంది వైమానిక దాడుల కారణంగా చనిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఇజ్రాయెల్‌పై ఫట్టా-1 హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ తో దాడుల్లో ఈ క్షిపణిని ఇరాన్ మొదటిసారి ఉపయోగించినట్లు అంతర్జాతీయ నివేదికలు తెలిపాయి. ఈరోజు తెల్లవారుజాము నుండి.. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై క్షిపణులతో ఇరాన్ విరచుకుపడింది. దాదాపు 400 క్షిపణులను ప్రయోగించిందని.. వాటిని ఇజ్రాయెల్ అడ్డుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, అనుమానిత సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ టెహ్రాన్ సమీపంలో వైమానిక దాడులు కొనసాగిస్తోంది.

కాగా, ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో చేరాలని డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారని అమెరికా మీడియా నివేదించింది. దాంతోపాటు G7 శిఖరాగ్ర సమావేశం నుండి ట్రంప్ ఆకస్మికత్తుగా తిరిగి అమెరికా రావడంతో అమెరికా ఇజ్రాయెల్‌తో చేతులు కలుపుతుందనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ మంగళవారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారని.. అమెరికన్ యుద్ధ విమానాలను రంగంలోకి దింపనున్నట్లు అమెరికా అధికారులు ధృవీకరించారు.  ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాకున్నాడో తమకు తెలుసని.. మర్యాదగా బయటకు వచ్చి లొంగిపోవాలని ట్రంప్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఖమేనీ.. యుద్ధం ప్రారంభమైందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇరాన్, ఇజ్రాయోల్ పై దాడులకు దిగింది.

 

టి-20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. ఇండియా మ్యాచ్‌ల లిస్ట్..

T-20 World Cup 2026

మహిళల టి-20 ప్రపంచకప్-2026 (T-20 World Cup 2026) షెడ్యూల్‌ను గురువారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) విడుదల చేసింది. ఇంగ్లండ్ వేదికగా 2026 జూన్ 12వ తేదీన ఈ టోర్నమెంట్ ప్రారంభంకానుంది. తొలిసారిగా ఈ టోర్నమెంట్‌లో 12 జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్‌లతో పాటు గ్లోబల్ క్వాలిఫయర్స్ ఫలితాల ఆధారంగా మరో నాలుగు జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తాయి. జూన్ 12వ తేదీన తొలి మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరగనుంది. టోర్నమెంట్‌లో (T-20 World Cup 2026) గ్రూప్‌-1లో ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్ ఉన్నాయి. గ్లోబల్ క్వాలిఫయర్‌లో అర్హత సాధించిన జట్లు ఈ గ్రూప్‌లో చోటు దక్కించుకుంటాయి.

లీగ్ దశలో జూన్ 14 నుంచి 28 వరకూ ఇండియా ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో తొలి మ్యాచ్‌లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఇక టోర్నమెంట్ సెమీఫైనల్స్ జూన్ 30, జూలై 2 తేదీల్లో ఓవెల్ వేదికగా జరుగుతాయి. లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

టి-20 ప్రపంచకప్-2026 ఇండియా షెడ్యూల్:
జూన్ 14 : ఇండియా వర్సెస్ పాకిస్థాన్, ఎడ్జ్‌బాస్టన్
జూన్ 17 : ఇండియా వర్సెస్ క్వాలిఫయర్, హెడ్డింగ్లే
జూన్ 21 : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా, ఓల్డ్ ట్రాఫర్డ్
జూన్ 25 : ఇండియా వర్సెస్ క్వాలిఫయర్, ఓల్డ్ ట్రాఫర్డ్
జూన్ 28 : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, లార్డ్స్.