Sirimalli

My WordPress Blog

IND vs PAK-Shivratri: శివరాత్రి జ్ఞాపకాలు.. సచిన్‌ మాస్టర్ క్లాసిక్, ఇషాన్ కిషన్‌ మెరుపు ఇన్నింగ్స్‌!

Ind Vs Pak From Sachins 2003 Masterclass To Ishan Kishans 2026 Heroics On Shivratri

IND vs PAK Shivratri Matches: శివరాత్రి రోజు భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే.. క్రికెట్ అభిమానులకు టక్కున గుర్తొచ్చేది 2003 వన్డే ప్రపంచకప్‌. ఆ వరల్డ్‌కప్‌లో ఇండో-పాక్ మ్యాచ్ మార్చి 1న శివరాత్రి రోజే జరిగింది. అప్పట్లో భారత్ ముందు పాకిస్థాన్ 274 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ రోజుల్లో ఇంత భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేయడం పెద్ద సవాలే. అయితే క్రికెట్ దేవుడు, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు.

సచిన్ టెండూల్కర్ కేవలం 75 బంతుల్లో 98 పరుగులు చేసి పాక్ బౌలింగ్ దళాన్ని పూర్తిగా కుదేలు చేశాడు. ముఖ్యంగా షోయబ్‌ అక్తర్, వకార్‌ యూనస్‌ లాంటి దిగ్గజ పేసర్ల బౌలింగ్‌లో ఆడిన అప్పర్‌కట్ షాట్లు ఇప్పటికీ అభిమానుల కళ్లముందు తిరుగుతూనే ఉంటాయి. ఆ ఇన్నింగ్స్ మాత్రమే కాదు.. ఆ మ్యాచ్ మొత్తం క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచింది. అయితే తృటిలో సచిన్ సెంచరీ కోల్పోయాడు. సెంచరీ చేసుంటే.. ఆ మ్యాచ్ మరింత ప్రత్యేకంగా నిలిచేది.

ఇదే సందర్భం మళ్లీ పునరావృతమైంది. శివరాత్రి రోజునే (ఫిబ్రవరి 15) టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్–పాక్ తలపడ్డాయి. సచిన్ టెండూల్కర్ ఇన్నింగ్స్‌తో పోల్చలేనప్పటికీ.. యువ ఆటగాడు ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్‌తో పాకిస్థాన్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. కిషన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 77 రన్స్ చేశాడు. దాంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆపై బౌలర్లు చెలరేగడంతో పాక్ 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. కిషన్ దూకుడు ఇన్నింగ్స్ భారత విజయానికి కీలకంగా మారింది. ఈ రెండు మ్యాచ్‌లు శివరాత్రి రోజునే జరిగి.. భారత అభిమానులకు ప్రత్యేకమైన జ్ఞాపకాలను అందించాయి. ఒకటి సచిన్ మహత్తర క్లాసిక్ అయితే, మరొకటి ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్‌ను గుర్తు చేసింది.