ముంబై: మార్కెట్లో ఐటి స్టాక్స్ భారీ పతనం చూశాయి. అమెరికా ఎఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ వార్తలతో భారత ఐటి కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో ఇన్ఫోసిస్, టిసిఎస్‌తో పాటు సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీల స్టాక్స్ భారీ పతనమయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భవిష్యత్తులో ఐటి సేవలకు డిమాండ్ తగ్గవచ్చనే భయం చోటుచేసుకుంది. స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఐటి షేర్లు పడిపోయాయి. టిసిఎస్ దాదాపు 7 శాతం, ఇన్ఫోసిస్ 8 శాతం క్షీణించగా, హెచ్‌సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో కూడా నష్టపోయాయి. దీంతో ఐటి రంగం మార్కెట్ విలువ సుమారు రూ.2 లక్షల కోట్లు తగ్గింది. ఆంథ్రోపిక్ అమెరికాకు చెందిన ఎఐ సంస్థ, ఈ సంస్థ ఎఐ టూల్‌ను ప్రకటించిన తర్వాత యుఎస్‌లో టెక్ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ ప్రభావం ఇన్ఫోసిస్, విప్రో ఎడిఆర్‌లపై పడింది. ఫలితంగా భారత మార్కెట్‌లోనూ అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుత పతనం భవిష్యత్తు ఆందోళనల వల్లేనని నిపుణులు చెబుతున్నారు. ఐటి కంపెనీల ఎఐ వ్యూహాలే ఇక మార్కెట్ దిశను నిర్ణయిస్తాయని అంటున్నారు.
మరో పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ఐటి స్టాక్స్ పతనంలోనూ మార్కెట్లో బిఎస్‌ఇ సూచీ సెన్సెక్స్ 79 పాయింట్లు పెరిగి 83,818 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 48 పాయింట్లు పెరిగి 25,776 వద్ద నిలిచాయి. ఆటో, ఎనర్జీ, ఎఫ్‌ఎంసిజి స్టాక్‌లు లాభపడగా, ఐటి, బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి. ట్రంప్ భారత్‌పై సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం మార్కెట్‌కు బలమిచ్చింది. ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. విదేశీ పెట్టుబడిదారులు రూ.5,426 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.





