మున్సిపల్ ఎన్నికల వేళ బాన్స్‌వాడలోని కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం, బాన్సువాడ పట్టణానికి చెందిన ఆరుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కెటిఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్‌ఎస్లో చేరిన కౌన్సిలర్లు, బాడి శ్రీనివాస్, లాయక్, అక్బర్, ఖాదర్, గంగారామ్, రైటర్ రాజు కెటిఆర్ సమక్షంలో చేరారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ఎలమంచిలి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఇప్పటికే నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ బీ-ఫామ్స్ సమర్పించి ప్రచారంలో దూసుకుపోతుండగా, తాజా చేరికలతో కాంగ్రెస్ పార్టీ కోట కుప్పకూలినట్లయింది. పొచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి, బాన్సువాడ ప్రజలకు చేసిన ద్రోహాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ చేరికలతో బాన్సువాడలో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని, బీఆర్‌ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని స్థానిక నేతలు ధీమా వ్యక్తం చేశారు.





