ఆస్ట్రేలియాకు చెందిన 13 ఏళ్ల ఆస్టిన్ ఆపిల్‌బీ , సముద్రంలో కొట్టుకుపోతున్న తన తల్లి, ఇద్దరు తోబుట్టువులను రక్షించడానికి ఎంతో సాహసం చేయడం సంచలనం కలిగించింది. రాష్ట్ర రాజధాని పెర్త్ నుంచి వచ్చిన ఆస్టిన్ అతని తల్లి జోనె ఆపిల్‌బీ (47), తమ్ముడు బియయు (12), చెల్లి గ్రేస్ (8) కలిసి చిన్న పడవలు(కయాక్), ఫెడల్‌బోర్డ్‌ల సాయంతో సముద్రం లో విహారానికి వెళ్లారు. అంతలోనే సముద్రంలో వాతావరణం మారిపోయింది. వారంతా దూరంగా తీరానికి కొట్టుకుపోయారు. సాయం కోసం తల్లి సూచనతో కయాక్‌పై ఆస్టిన్ బయలుదేరినా, కయాక్‌లో నీరు చేరింది. ఈతకు లైఫ్‌జాకెట్ కూడా పనికి రాకపోవడంతో దాన్ని తీసివేశాడు. భారీ అలల మధ్య నాలుగు కిలోమీటర్ల దూరం ఈది ఒడ్డుకు చేరుకున్నాడు.
అధికారులకు సమాచారం ఇవ్వగా వారు హెలికాప్టర్‌తో గాలింపు మొదలెట్టారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అధికారులు తల్లిని, ఇద్దరు పిల్లలను గుర్తించారు. ఆ సమయంలో వారు తీరానికి 14 కిలో మీటర్ల దూరంలో పెడల్ బోర్డులను పట్టుకుని వేలాడుతూ కనిపించారు. బాలుడి ధైర్యసాహసాలను అధికారులు ప్రశంసించారు. నలుగురికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో ముగ్గురు పిల్లలను వదిలేసి తాను వెళ్లలేని పరిస్థితి ఉన్నప్పటికీ, ఆస్టిన్‌ను ఒడ్డుకు పంపడం తాను తీసుకున్న అత్యంత కష్టమైన నిర్ణయమని తల్లి జోవాన్ మంగళవారం తెలిపారు. సముద్రంలో కొట్టుకుపోయినప్పుడు మొదట్లో తాము ధైర్యంగానే ఉన్నా చీకటవుతున్న కొద్దీ అలల ఉధృతి పెరగడంతో భయంతో చలితో వణికిపోయామని ఆమె చెప్పారు.





