తృటిలో విమాన ప్రమాదాలు తప్పిపోయాయి. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా, ఇండిగో విమానాల రెక్కలు ఒకదానికొకటి తాకాయి. ఈ సంఘటనను రెండు విమానయాన సంస్థలు ధృవీకరించాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ అపాయం కలగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని ప్రకటించాయి. మంగళవారంనాడు ముంబై నుండి కోయంబత్తూరుకు వెళ్లాల్సిన ఎఐ2732 విమానం టేకాఫ్ కావడానికి ముందు టాక్సీవేలో వేచి ఉండగా ఇండిగోకు చెందిన విమానాన్ని తాకడంతో ఆలస్యం అయిందని, రెండు విమానాల రెక్కలు తాకడంతో తమ విమానం రెక్క దెబ్బతిందని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. ముందుజాగ్రత్త చర్యగా, తదుపరి సాంకేతిక పరీక్షల కోసం విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా దిగిపోయారు. వీలైనంత త్వరగా వారిని వారి గమ్యస్థానానికి తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.





