హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సిఎం కెసిఆర్‌ను సిట్ విచారించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సిట్ విచారణలో ఏం జరిగిందో కెసిఆర్ చెప్తారని అనుకుంటున్నానని, రెండేళ్లు అవుతున్నా.. ఫోన్ ట్యాపింగ్ కేసు ముగింపునకు రావట్లేదని అన్నారు. దీనిపై కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విచారణకు త్వరగా ముగింపు పలకాలని.. దోషులకు శిక్షపడాలని కోరారు. సిట్ విచారణను తప్పుపడుతూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడటం కరెక్టు కాదని కవిత విమర్శించారు. చట్టాలను అందరూ గౌరవించాలని, సహకరించాలని సూచించారు. గంటనక్కలతో కలిసి కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు పిలిస్తే వెళ్లానని, తన ఫోన్, తన భర్త ఫోన్లు ట్యాప్ చేశారని అనుమానాలున్నాయని అన్నారు. సిట్ అధికారులు పిలిస్తే వెళ్లి విచారణకు సహకరిస్తానని తెలియజేశారు. కెటిఆర్ వ్యాఖ్యలు రాచరికపు పోకడలకు నిదర్శనమని, చెడ్డవారికి ఓటెయాలని కెటిఆర్ చెబుతున్నారా? అని ప్రశ్నిచారు. మున్సిపల్ ఎన్నికల్లో కులం కాదు.. గుణం చూసి ఓటేయాలని, పైసలు కాదు.. పనిచేసేవాడికి ఓటు వేయాలని ఏ పార్టీ అయినా సరే.. మంచి అభ్యర్థులకు ఓటేయాలని అన్నారు. కెసిఆర్ గతంలో సిఎంగా ఉన్నారు కాబట్టి సిట్ విచారణకు పిలిచిందని, విచారణకు పిలిస్తే ఎవరైనా వెళ్లక తప్పదని కవిత పేర్కొన్నారు.




