Sirimalli

My WordPress Blog

బడ్జెట్‌లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలి

యూత్‌ డిక్లరేషన్‌ హమీలు అమలు చేయాలి : డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌,ఆనగంటి వెంకటేష్‌

నవతెలంగాణ – ముషీరాబాద్‌
రాబోయే వార్షిక బడ్జెట్‌లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలని, యూత్‌ డిక్లరేషన్‌ హమీలను అమలు చేయాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేష్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించాలని, రాజీవ్‌ యువ వికాస్‌ పథకం అమలుకు నిధులు కేటాయించాలని కోరారు. సోమవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా నిరుద్యోగ భృతి హామీని అమలుచేయలేదని, కనీసం రాబోయే బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

యువత ఉపాధి అవకాశాల కోసం రూ.1000 కోట్ల నిధులతో యూత్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో అసెంబ్లీ వేదికగా ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ఇప్పటివరకు అమలు కాలేదని, లక్షలాది నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. రాజీవ్‌ యువ వికాస్‌ పథకం ద్వారా రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలు ఇస్తామని, ఇందుకు రూ.6,000 కోట్ల నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల 25 వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. జూన్‌ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున నిధులు మంజూరు చేస్తామని చెప్పి వాయిదా వేసినట్టు చెప్పారు.

ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా, కాలయాపన చేయకుండా రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైన లబ్దిదారులందరికీ రాజీవ్‌ యువ వికాస్‌ పథకం ద్వారా నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. సిబిల్‌ స్కోరు లేకున్నా నిరుద్యోగ యువతకు ఈ పథకాన్ని అమలు చేయాలని కోరారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో, మండల నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు, క్రీడాకారుల ప్రోత్సాహనికి, క్రీడారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌ సమావేశాల్లో యువజన రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులను కేటాయించాలని, లేనియెడల డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌.ఎల్‌ మూర్తి, ఎండీ జావీద్‌, నాయకులు రాజు పాల్గొన్నారు.

The post బడ్జెట్‌లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలి appeared first on Navatelangana.