జైన ధర్మానికి సంబంధించిన శిలాశిల్పాలు, లోహ శిల్పాలు, మట్టిబొమ్మలు, వర్ణచిత్రాలు ప్రత్యేక ప్రతిమా లక్షణాలను కలిగివుంటాయి. జైనమతంలో తీర్థంకరులకే ప్రాథమ్యం. 24 మంది తీర్థంకరులు, వారి శాసనదేవతలు (యక్ష, యక్షిణులు), వారి పరివారంలో విద్యాధరులు, గణధరులు, గంధర్వులు, చామర ధారులు, పాదాలు, నిశీథులు కాక చౌముఖ, చౌవీసీ, స్థాపనాచార్య శిల్పాలు గణనీయమైనవి. (జైనరూపమండన)
తీర్థంకరులు: జైనతీర్థంకరులు తలపై ముగ్గొడుగుతో (త్రిస్తరచ్ఛత్రాలు), వక్షం మీద శ్రీవత్సలాంఛనంతో, ఆజానుబాహువులతో, యవ్వనులుగా, ధ్యాన నిమగ్నులుగా, కాంతి పరివేషాలతో, నగ్నమూర్తులుగానే చెక్కబడతారు. తీర్థంకరుల లాంఛనాలే వారి గుర్తింపులు. తీర్థంకరులు దేవాదిదేవులుగా ‘దేవుళ్ళు’గా పిలువబడ్డారు. కాని, తీర్థంకరులు అచ్చంగా మానవ మూర్తులే.
తెలంగాణాలో జైనాలయాల వాస్తు లక్షణాలు: తెలంగాణలోని జైన ఆర్కిటెక్చర్‌ను తొలి చారిత్రక దశ, మధ్యయుగ దశ, అనంతర దశలని విభజించవచ్చు. తొలి దశలో ఇటికెల గుడులు, గుహాలయాలు, మధ్యయుగ దశలో జైనబసదులు, జైనాలయాలు, అనంతర దశలో మళ్ళీ జైనతీర్థాల పునరుద్ధరణ కనిపిస్తుంది. తెలంగాణాలోని జైనబసదుల వాస్తు ప్రణాళికలలో అధిష్టానం, పాదవర్గం, ప్రస్త రం, శిఖరం, పైన కలశం అగుపిస్తాయి. వీటిలో ఏ కకూట, ద్వికూట, త్రికూటాలున్నాయి. జైనాలయాల విమానాలు ‘కదంబనాగర’ ఫంసానా శైలి లో పిరమిడ్ వలె సోపానాలతో నిర్మితమైనాయి.
రాతిచిత్రాలలో జైనతీర్థంకరులు: జనగామ జిల్లా గోపరాజుపల్లి పెద్దగుట్ట రాతి చిత్రాలలో జైనతీర్థంకరుని తొక్కుడు బొమ్మ (Rockbruising) ఉంది. అదే జిల్లా సిద్దెంకి గుట్ట పక్కన రాతిగుండు మీద మహావీరుని పెట్రోగ్లైఫుం ది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి దానయ్య గుట్ట మీద 30 అడుగుల ఎత్తున్న తీర్థంకరుని చెక్కుడుబొమ్మ (Petroglyph) అగుపించింది. హన్మకొండ జిల్లా మెట్టుగుట్ట మీద ధర్మనాథతీర్థంకరుని పెట్రోగ్లైఫ్, వజ్ర చిహ్నం, నామసహితంగా చెక్కి ఉంది. నల్లగొండ జిల్లా అన్నీశ్వరమ్మ గుట్ట మీద ‘జినబ్రహ్మయోగి గురుపాద చారుకీర్తి’ అనే నామ శాసనముంది. సిద్ధిపేట జిల్లా వెల్కటూరు, పాత గూడూరులో రాతిమీద ధర్మనాథతీర్థంకరుని చెక్కుడుబొమ్మ, వజ్రచిహ్నం, పాదాలు, ‘జినబ్రహ్మజోగి’ నామశాస నం లభించాయి. కౌలాసులో ‘జినబ్రహ్మజోగి’ శాసనం లభించింది.
ఇటికెల గుడులు: విష్ణుకుండినుల కాలంలో తెలంగాణాలోని కీసరగుట్ట, గుమ్మడం, ఆల్వాన్ ప ల్లిలలో జైనధర్మచైత్యాలు ఇటికెల గుడులుగా నిర్మించబడ్డాయి. వనపర్తి జిల్లా గుమ్మడంలో ఇటికెలగుడి సర్వతోభద్ర జినాలయమని చరిత్రకారుల అభిప్రాయం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల-, కల్వకుర్తి రోడ్డు పక్కన అల్వాన్ పల్లిలోని జైనుల ఇటికెలగుడి గొల్లత్తగుడి. గొల్లత్తగుడి శిల్పాలు మహావీరుడు పిల్లలమర్రి మ్యూజియంలో, పార్శ్వనాథుడు హైద్రాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉన్నాయి.
రాతి గుహలు-జిన బసదులు: వికారాబాద్ జిల్లా ఎల్లకొండలోని గుట్టమీద సిద్ధుల గుహలు జినుల గుహలే. మొగిలచెర్ల ఏకవీరగుడి ముందర రెండు రాతి గుండ్లలో ఉన్నవి జైనమునులు సల్లేఖవ్రతమాచరించిన గుహలు. ఉల్బణ శిల్పాలు: యాదగిరి గుట్ట- భువనగిరి జిల్లా తుమ్మలగూడెం (ఇంద్రపాల నగరం) గుట్టమీద రణధీరజినాలయం అనే బసదిలో ఎతైన రాతిగుండ్ల మీద జైనతీర్థంకరుల ఉల్బణ శిల్పాలున్నాయి. జగిత్యాల జిల్లాలో కుర్క్యాలవృషభాద్రి వేములవాడ చాళుక్యు ల కాలంనాటి జైనబసది బొమ్మల గుట్టగా ప్రసిద్ధి.
ఇక్కడ ఆద్యంత తీర్థంకరులు రుషభనాథుడు, మహావీరుడు, రుషభనాథుని శాసన దేవత చక్రేశ్వరి ఉల్బణ శిల్పాలు చెక్కి ఉన్నాయి. అక్కడే పంప సోదరుడు జినవల్లభుడు రచించిన త్రిభాషాశాసనం చెక్కబడ్డది. జనగామ జిల్లా సిద్దెంకి గుట్ట మీద రుషభనాథుడు, మహావీరులతో పాటు జైనయక్షిణి ఆమ్రకూష్మాండిని, పార్శ్వనాథుని శిల్పా లు చెక్కబడ్డాయి. సిద్ధిపేట జిల్లాలోని శనిగరంలో గొల్లత్తగుడి అనే జైన బసదిలో రాతి గుండుపై పా ర్శ్వనాథ, అంబికల శిల్పాలున్నాయి. కొమురవెల్లి లో మల్లన్న గుట్టకు సుపార్శ్వనాథుని ఉల్బణ శిల్పమున్నది. హన్మకొండ అగ్గలయ్య గుట్టమీద చెక్కిన 30అడుగుల శాంతినాథుని శిల్పముంది. తెలంగాణాలో మొదటి ఎతైన శిల్పం. ఇక్కడే గుహలో జైన మహావీరుని ధ్యానాసన శిల్పం ఉన్నది.
అగ్గలయ్య గుట్టపై శాంతినాథ తీర్థంకరుడు: పద్మాక్షి గుట్టమీది గుడిలో నేమినాథ తీర్థంకరుడు, శాసన దేవతలైన సర్వంసహా, ఆమ్రకూష్మాండినుల అర్ధశిల్పాలున్నాయి. కడలాలయబసదిలోని ఆమ్రకూష్మాండినినే మార్చబడి ‘పద్మాక్షి’ అయిందిపుడు. సిద్ధిపేట జిల్లా బైరాంపల్లిలో అంగడి వీరన్న గుడిగా పిలువబడే జైనాలయం లలాటబింబం జినునిశిల్పం.
జైనబసదులు: జైనంలోని ‘త్రిషష్టిశలాక పురుషుల’ పేరుమీద నిర్మించిన కొలనుపాకలోని వీరనారాయణ దేవాలయం, బోధన్ దేవల్- మసీదుగా పిలువబడుతున్న ఇంద్రనారాయణ దేవాలయం ప్రసిద్ధమైనవి. వేములవాడలోని శివాలయం 2వ అరికేసరి కొడుకు బద్దెగ గురువు సోమదేవసూరి కొరకు కట్టించిన శుభధామజినాలయం. అక్కడి గుడుల ప్రాంగణాల్లో కుప్పలుగా జైనశిల్పాలు అగుపిస్తాయి. బాసరలోని పాపహరమయ్య దేవర జైనబసది పాపహరేశ్వరాలయంగా మార్పుపొందింది. నారాయణపేట జిల్లా ఉజ్జిలికోటలో బద్దిజినాలయముంది.
సంగారెడ్డి జిల్లా, పటాన్చెరులో జైనశిల్పాల తయా రీ కేంద్రముండేది. పార్శ్వనాథ, మహావీర, చౌము ఖ, చౌవీసీ, రాశిచక్ర జైనశిల్పాలు హైద్రాబాద్ రాష్ట్ర మ్యూజియంలో, గోల్కొండ సమీపంలోని కెబి మ్యూజియంలో పెట్టబడ్డాయి. శైవుడు దేవరదాసమయ్య తాను పొట్ల చెరువులోని 500 జైన బసదులను కూల్చానని, జైనులను వధించానని చెప్పుకున్నట్టు పాల్కురికి సోమనాథుని ‘పండితారాథ్య చరిత్ర’ వల్ల తెలుస్తున్నది. కొలనుపాకలోని ఊబదిబ్బ మీద అక్క(జైన) బసదనే ‘అంబరకులతిలకబసది’ ఉంది. ముందర జైనమాన స్తంభముంది. జోగులాంబ -గద్వాల జిల్లా, పూడూరులో శివాలయం గా మార్చబడ్డ పల్లవజినాలయం ముందరున్న నగ్నజైన విగ్రహాలను ‘బయటిదేవర్లు’, జైనబొమ్మయ్యలంటారట. వరంగల్లు కోట ఆగ్నేయ దిశలో చతుర్వింశతి తీర్థంకరుల గుడి నిర్మాణం కనిపిస్తుంది. నేలశంభునిగుడిలో జైనశిల్పాల అవశేషా లు, పక్కనున్న మేడరాయని గుడిలో రంగ శిలలలో ఒకటి తీర్థంకరుని అభిషేకానికి (సమవసరణ), రెండవది రంగభోగానికని అంటారు శ్రీపాద గోపాలకృష్ణమూర్తి. వర్ధమాన మహావీరుని శిల్పమున్న గుడితోనే ఆ వూరికి వర్ధమానపురమని (నాగర్ కర్నూల్ జిల్లా నందివడ్డెమాను) పేరొచ్చిందంటా రు. దేవాలయం బయట జైనశిల్పాలున్నాయి. కరీంనగర్ జిల్లా నగునూరు జంటగుళ్ళలో పార్శ్వనాథ, మహావీరుల శిల్పాలుండేవి.
– శ్రీరామోజు హరగోపాల్






