
Suryakumar Yadav Warns Rivals Ahead of T20 World Cup 2026 Super 8: టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్-8 దశకు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూపర్-8కు చేరిన ప్రతి జట్టు అత్యుత్తమ క్రికెట్ ఆడిందని, ఇక ఏ టీమ్‌ను తక్కువగా అంచనా వేయలేమని చెప్పాడు. సూపర్-8 దశకు రావాలంటే.. స్థిరమైన ప్రదర్శన అవసరం అని, ప్రతి జట్టు బలంగా ఉందని పేర్కొన్నాడు. సూపర్-8 కాబట్టి భారత జట్టులోని అందరికీ కఠిన పరీక్షే ఎదురుకానుందని సూర్యకుమార్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశను భారత్ అపజయం లేకుండా ముగించింది. నరేంద్ర మోడీ స్టేడియంలో బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన గ్రూప్-ఎ చివరి మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో గెలిచింది.
ముందుగా భారత్ 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఛేదనలో నెదర్లాండ్స్ 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘ముందుగా బ్యాటింగ్ చేసి 190 పరుగుల భారీ స్కోర్ చేయడం విజయంలో కీలకంగా మారింది. మేము బౌలింగ్‌కు వచ్చినప్పుడు డ్యూ కారణంగా కొంత ఇబ్బంది ఎదురైంది. మొత్తంగా జట్టు ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉన్నా. మధ్య ఓవర్లలో వికెట్ స్వభావం ఎలా ఉందో బ్యాటర్లు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మొదట నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభమైనా చివర్లో ఫినిషింగ్‌కు మాకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు మ్యాచ్‌ను ముగించే సామర్థ్యం గలవారు’ అని చెప్పాడు.
‘శివమ్ దూబే ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇలాంటి ప్రదర్శన అతడికి కొత్త కాదు. ఇటీవల న్యూజిలాండ్ జట్టుపై విశాఖపట్నంలో ఆడిన మ్యాచ్‌లో కూడా అద్భుతంగా ఆడాడు. ఈ మ్యాచ్‌లో మధ్య ఓవర్లలో మిగతా బ్యాటర్ల మీద ఒత్తిడి తగ్గిస్తూ స్కోర్‌ను 190 వరకు తీసుకెళ్లడంలో దూబే పాత్ర కీలకం. మధ్య ఓవర్లలో బౌలింగ్ చేయడానికి చాలా ఎంపికలు ఉన్నాయి. అభిషేక్ శర్మ, హార్దిక్, దూబే వంటి వారు ఉన్నారు. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఎవరైనా కొన్ని ఓవర్లు వేయగలరు. ప్రస్తుతం అన్నీ సవ్యంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ప్రతి బ్యాటర్ నుంచి చిన్న చిన్న భాగస్వామ్యాలు రావడం జట్టు బలం. మ్యాచ్ ఉత్కంఠగా ఉన్నప్పుడు అందరూ సహకరిస్తేనే విజయం సాధ్యమవుతుంది. మొత్తంగా ఈ విజయం నుంచి కూడా కొన్ని పాఠాలు నేర్చుకున్నాము’ అని సూర్య తెలిపాడు.
Also Read: Pixel 10a India Launch: భారత్‌లో గూగుల్ ‘పిక్సెల్ 10ఏ’ విడుదల.. 5100mAh బ్యాటరీ, 48MP కెమెరా!
‘సూపర్-8 దశలో మా గ్రూపులో ఉన్న వెస్టిండీస్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా అద్భుత టీమ్స్. ఈ మూడు జట్లు తమ తమ గ్రూపుల్లో అన్ని మ్యాచ్‌లు గెలిచి సూపర్-8కు వచ్చాయి. విజయాలు చూస్తే.. మూడు టీమ్స్ బలం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ప్రతి మ్యాచ్‌ను ఫైనల్లా భావించి ఆడాలని టీమ్ నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం మా దృష్టి పూర్తిగా తదుపరి మ్యాచ్‌పైనే ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ చాలా కఠినం. అయితే మా లక్ష్యం ఒక్కటే.. విజయం సాధించడం. మంచి క్రికెట్ ఆడి జట్టుగా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. జట్టులోని ఆటగాళ్లందరికీ ఇకపై కఠిన పరీక్షే’ అని సూర్య చెప్పుకొచ్చాడు. కెప్టెన్ వ్యాఖ్యలతో భారత్ జట్టు సూపర్-8 దశను అత్యంత సీరియస్‌గా తీసుకుంటోందని స్పష్టమైంది.





