తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కంకణం కట్టుకొని విజయవంతమవుతున్న కాంగ్రెస్ పార్టీ పలు సందర్భాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచింది. కులగణన, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు వంటి అంశాల్లో ముందడుగు వేస్తూ దేశంలో ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. రిజర్వేషన్ల అమలులో సాంకేతికంగా ఇబ్బందులు కలిగినా పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో బిసిలకు పెద్దపీట వేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో తెలంగాణ రాజకీయాల్లో సామాజిక న్యాయం మరోసారి కీలకాంశంగా మారింది. బిసిలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాజకీయంగా మాత్రమే కాకుండా సామాజికంగా కూడా విశేష ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అంతకు మించి పురపాలిక ఎన్నికల్లో బిసిలకు 53 శాతానికిపైగా టికెట్లు కేటాయించి తన నిబద్ధతను చాటుకుంది. కాంగ్రెస్ నిర్ణయంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ పదవుల్లో 60% కంటే ఎక్కువ బిసిలకు దక్కాయి. రాష్ట్రంలో తాము గెలుచుకున్న 85 మున్సిపాలిటీల్లో 51 స్థానాలను బిసిలకు కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సామాజిక వర్గాల ప్రాతినిధ్యం అంశం నిత్యం చర్చకు వస్తున్నా ఆచరణలో అమలు కాలేదు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని కేవలం నినాదాలకే పరిమితం చేయకుండా కృతనిశ్చయంతో అమలుపర్చింది.
రాష్ట్రంలో 105 మున్సిపాలిటీల్లో 64 మంది బిసి చైర్మన్లు ఎన్నిక కావడం, పుర ప్రథముల్లో 61 శాతం బిసిలు ఉండటం సామాజిక న్యాయానికి స్పష్టమైన సంకేతంగా నిలిచింది. వైస్ చైర్పర్సన్లలో 41 శాతం బిసిలు ఉండడం కూడా పట్టణ పాలనలో వారి పాత్ర పెరిగిందనడానికి నిదర్శనం. పట్టణాల్లోని 55 శాతం పైగా వార్డుల్లో బిసిల ఆధిక్యం నమోదవడం, వారిలో నాయకత్వ సామర్థ్యానికి ప్రజలు ఇచ్చిన మద్దతుగా చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలు సత్తా చాటుతూనే ఉన్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకున్న వారు బిసిలే. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఊపు కొనసాగించడం ద్వారా పట్టణ రాజకీయాల్లో తమ స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. కార్పొరేషన్ల స్థాయిలోనూ బిసిలకు లభించిన ప్రాధాన్యం గమనార్హం. కార్పొరేషన్లలో బిసి మేయర్లు ఎన్నిక కావడం, డిప్యూటీ మేయర్గా బిసి నాయకత్వం రావడం కేవలం రాజకీయ గణాంకం కాదు పట్టణ పాలనలో శక్తి సమీకరణాల మార్పుకు ప్రతీక. మొత్తం 7 కార్పొరేషన్లలో నలుగురు బిసి మేయర్లు ఉండటం పట్టణాల్లో బిసిల రాజకీయ పటిమను ప్రతిబింబిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో బిసిలకు ప్రాధాన్యత యాదృచ్ఛికంగా జరిగిన పరిణామం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కోసం కులగణన చేపట్టడం, ఆ గణాంకాల ప్రకారం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆచరణలో చూపింది. కులగణన ద్వారా వాస్తవ గణాంకాలు సేకరించి, వాటి ఆధారంగా విధానాలు రూపొందిస్తామని చెప్పడం సామాజిక న్యాయం పట్ల నిబద్ధతకు సంకేతం. గతంలో రిజర్వేషన్లపై చర్చలు జరిగితే అవి రాజకీయ హామీలకే పరిమితం అయ్యాయి. అయితే ఇప్పుడు వాటిని వ్యవస్థీకృతంగా అమలు చేసే దిశగా అడుగులు పడడడం అభినందనీయం.
బిసిలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఇతర వర్గాలను విస్మరించలేదనే విషయం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎస్సి, ఎస్టి, ముస్లిం, ఒసి వర్గాలకు కూడా సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సమతుల్యతను పాటించింది. ఇది ఒక వర్గాన్ని మరొక వర్గానికి వ్యతిరేకంగా నిలబెట్టే రాజకీయ శైలికి భిన్నం. సామాజిక వర్గాల మధ్య సమన్వయం, భాగస్వామ్య పాలన లక్ష్యంగా ముందుకు సాగడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిగా కనిపిస్తోంది. పట్టణ పాలనలో నాయకత్వ మార్పులు సాధారణ పరిపాలనా అంశం మాత్రమే కాదు. ఇవి అభివృద్ధి ప్రాధాన్యతలను, సంక్షేమ దిశలను నిర్ణయించే కీలక స్థాయిలు. చైర్మన్లు, మేయర్లు స్థానిక సమస్యలను గుర్తించి, నిధుల వినియోగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక పాలనపై ప్రభావం చూపగలరు. ఈ స్థానాల్లో బిసి వర్గాల ప్రతినిధులు అధికంగా ఉండటం వల్ల పట్టణాల్లోని మధ్యతరగతి, వెనుకబడిన వర్గాల సమస్యలు మరింత ప్రాధాన్యత పొందే అవకాశముంది. ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లో జీవన వ్యయం, ఉపాధి అవకాశాలు, చిన్న వ్యాపారాల ప్రోత్సాహం, బస్తీల అభివృద్ధి వంటి అంశాలు బిసి వర్గాలకు అత్యంత సంబంధితమైనవి. ఈ వర్గాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు స్థానిక వాస్తవాలను బాగా అర్థం చేసుకుని విధానాలను అమలు చేయగలరనే నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకే 55 శాతం పైగా వార్డుల్లో బిసిల విజయం నమోదైందని విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు, ఇది రాజకీయంగా కూడా కీలకమైన పరిణామం. పట్టణాల్లో బలమైన సామాజిక వర్గాల మద్దతు సాధించగలిగిన పార్టీ రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ బలంగా నిలబడే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాభిప్రాయ సర్వేలా భావించే పరిస్థితుల్లో, ఈ ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత ఉత్సాహాన్నిస్తాయి. ప్రజాపాలన నినాదాన్ని కేవలం మాటల్లో కాకుండా పదవుల పంపిణీలోనూ ప్రతిఫలింపజేసిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ విజయాలను నిలబెట్టుకోవడం పెద్ద సవాల్. పదవులు దక్కడం ఒక ఎత్తు అయితే, వాటి ద్వారా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. పారదర్శక పాలన, అవినీతి రహిత వ్యవస్థ, సమర్థవంతమైన సేవలు అందించడం ద్వారా మాత్రమే ఈ సామాజిక సమీకరణం స్థిరపడుతుంది. లేకపోతే గణాంకాలు రాజకీయ ప్రచారానికే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.
42 శాతం రిజర్వేషన్ల బిల్లు అధికారికంగా కార్యరూపం దాల్చితే తెలంగాణ సామాజిక నిర్మాణంలో మరింత విస్తృత మార్పులు చోటుచేసుకోవచ్చు. ఇది కేవలం ఒక ప్రభుత్వ నిర్ణయం కాకుండా, భవిష్యత్ రాజకీయ ధోరణులను ప్రభావితం చేసే అంశంగా మారే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి డిమాండ్లు బలపడే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం కులగణన, బిసి సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు పరిచిన కాంగ్రెస్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వారికి 60 శాతంపైగా ప్రాధాన్యత కల్పించడం తెలంగాణ రాజకీయాల్లో చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలుస్తోంది. బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించడంలో భాగంగా వారికి రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం, పాలనలో భాగస్వామ్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం సంతోషకరం. ఈ సామాజిక న్యాయం ప్రయాణం తాత్కాలికానికే పరిమితం కాకుండా భవిష్యత్తులోనే సఫలీకృతమైతే తెలంగాణ రాజకీయ చరిత్రలో ఇది ఒక దిశానిర్దేశక ఘట్టంగా నిలిచే అవకాశం ఉంది.
అమరవాజీ నాగరాజు
(టిపిసిసి చీఫ్ పిఆర్ఒ)






