‘నేనే రాజు, నేనే మంత్రి’ వ్యాఖ్యలను వక్రీకరించారు
మున్సిపోల్స్ ఫలితాలు మా పనితీరుకు గీటురాయి
అసెంబ్లీలో దళితుడిని అధ్యక్షా అని పిలిచేలా చేశాను
ఎస్సిలు 17 శాతం ఉంటే 30 శాతం పదవులు ఇచ్చాం
ప్రభుత్వం వద్ద భూములు లేవు.. సంక్షేమాన్ని అందిస్తాం
రాష్ట్రంలోని అన్ని తండాలకు బిటి రోడ్లు
అచ్చంపేట అడవుల్లో సంత్ సేవాలాల్ పుణ్యక్షేత్రం నిర్మిస్తాం
మరో ఇరవై ఏళ్లు పేదల కోసమే పనిచేస్తాం
సేవాలాల్ జయంతి వేడుకల్లో సిఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: నేనే రాజు.. నేనే మంత్రి అంటూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విపక్షాల విమర్శలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ముఖ్యమంత్రి అన్నారు. ఆ వ్యాఖ్యలపై ఆయన స్పష్టత నిచ్చారు. మున్సిపల్ ఎన్నికల గెలుపోటములకు తానే బాధ్యత వహిస్తానని తన వ్యాఖ్యల ఉద్దేశ్యమని స్పష్టత నిచ్చారు. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని బంజారా భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రజలు 90 శాతం ఫలితాలను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చారని, ఇది తన పనితనానికి ప్రజలు ఇచ్చిన గీటురాయి అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొందరు ఈ విజయాన్ని జీర్ణించుకోలేక ప్రజల తీర్పును అవమానిస్తున్నారని, కాని పేదలు తనపై ఉంచిన నమ్మకమే ఈ విజయానికి మూలమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానం , ప్రభుత్వ లక్ష్యాలపై తాను ఎప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదని, కేవలం సేవకుడిగానే బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని సిఎం పునరుద్ఘాటించారు.
దళితుడిని అధ్యక్షా అని పిలిచేలా చేశా
సామాజిక న్యాయం , దళితుల సాధికారతపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని నమ్మించి మోసం చేసిన వారికి భిన్నంగా, నేడు అదే దళితుడిని అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఒకప్పుడు దళితులు రాష్ట్రాన్ని నడపలేరని హేళన చేసిన వారే, నేడు అదే దళితుడిని ‘అధ్యక్షా’ అని పిలిచి మైక్ అడిగే పరిస్థితిని తాము కల్పించామని, ఇది అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన గొప్ప అవకాశమని కొనియాడారు. ప్రభుత్వంలో ఎస్సి వర్గాలకు 30 శాతం ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, నలుగురు మంత్రులకు అవకాశం ఇచ్చామని చెప్పారు.
40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్సి వర్గీకరణ సమస్యను తాము పరిష్కరించడం వల్లే, నేడు బుడిగ జంగాల వంటి వెనుకబడిన వర్గాలకు ఎంబిబిఎస్ సీట్లు అందుతున్నాయని, ఈ మార్పు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన ఆకాంక్షించారు. రాబోయే 20 ఏళ్లు కూడా తాను పేదల కోసమే పని చేస్తానని, ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు తన సేవలు కొనసాగుతాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పరిపాలనలో డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఎఎస్ అధికారులుగా పేదల పిల్లలను చూడాలన్నదే తన కల అని, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సిద్ధిస్తుందని అభిప్రాయపడ్డారు. గెలిచినప్పుడు విర్రవీగడం, ఓడిపోయినప్పుడు కుంగిపోవడం తన నైజం కాదని, 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలకు దూరంగా లేనని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తనపై బాధ్యత మరింత పెరిగిందని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు అంకితభావంతో పనిచేస్తానని రేవంత్ రెడ్డి ఈ సభ ద్వారా ఉద్ఘాటించారు.
రాష్ట్ర పునర్నిర్మాణంలో లంబాల పాత్ర కీలకం
తెలంగాణ రాష్ట్ర సాధనలో లాంబాడా యువకులది కీలక పాత్ర అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పునర్:నిర్మాణంలో లంబాడాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలోని అన్ని లంబాడా తండాలకు బిసి రోడ్లు వేయాలని ఈ సందర్భంగా అధికారులకు సిఎం ఆదేశించారు. ఇకనుంచి రోడ్లు లేకుండా రాష్ట్రంలో ఏ తండా ఉండకూదని అన్నారు. ప్రతీ తండాలో ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నాలుగు నెలల్లో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నానని, ఆలోపే తండాలన్నింటికీ రోడ్ల సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. లంబాడా యువకులు అందరూ కెరియర్ను గొప్పగా మల్చుకోవాలని సూచించారు.
ఊర్లోనే ఉంటాం, వ్యవసాయం చేసుకుంటాం అనే ధోరణిని వీడాలని సిఎం సూచించారు. గ్రూపు-1, గ్రూపు-2 ఉద్యోగాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని, నచ్చిన రంగంలో రాణించేలా కృషి చేయాలని, అందుకు ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి స్పష్టత నిచ్చారు. గత పదేళ్లలో లేని విధంగా లక్షలాది కొత్త రేషన్ కార్డులు, 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో 8 ఏళ్లు అధికారంలో ఉంటుందని అన్నారు. మానవ జాతి శాంతి మార్గంలో నడవాలని, శాంతి, భక్తి, సామర్గంతో అభివృద్ధి పదంలో నడవాలని సంత్ సేవలాల్ మహారాజ్ స్ఫుర్తి నింపారని, దేశంలో ని 15 కోట్ల మంది లంబాడీలకు మార్గదర్శిగా నిలబడ్డారని కొనియాడారు.
రాష్ట్రంలో దళితులతో పాటు గిరిజనలు ప్రాధాన్యత ఉండాలని, ఈ వర్గాలకు సముచిత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని తండాలలో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించాలని, అన్ని తండాల్లో తాగునీటి కోసం ట్యాంకులు ఏర్పాటు చేయాలని, సోలార్ పంప్ సెట్ లు ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ ద్వారా చాలా తండాల్లో మంచి నీటి సౌకర్యం కల్పించ లేదని విమర్శించారు. ప్రతి తండాలో ప్రభుత్వ పాఠశాల ఉండాలన్నారు. 100 నియోజక వర్గాల్లో 20 వేల కోట్ల తో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపుగా సంత్ సేవాలాల్ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి నల్లమల అచ్చంపేట అటవీ ప్రాంతంలో 20 ఎకరాల భూమి సేకరించామని, వచ్చే ఏడాదిలో దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి లక్షలాది మంది భక్తులతో జయంతి వేడుకలను అక్కడే నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పనులు లంబాడీ గిరిజన సాంప్రదాయాలకు అనుగుణంగా జరిగేలా గిరిజన సంస్కృతిపై అవగాహన కలిగిన అధికారులను నియమిస్తామని స్పష్టం చేశారు.
సంత్ సేవాలాల్ బోధనలు నేటి తరానికి దిశానిర్దేశం: మంత్రి అడ్లూరి
లంబాడీ గిరిజనుల ఆరాధ్య దైవంగా, సమాజ సంస్కర్తగా సంత్ సేవాలాల్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన మార్గం నేటి తరానికి దిశానిర్దేశంగా నిలుస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. విద్యే ఆయుధం, సమానత్వమే లక్ష్యం, గిరిజనుల ఆత్మగౌరవమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని అడ్లూరి అభివర్ణించారు. సంత్ సేవాలాల్ అనంతపూర్ జిల్లా రామ్ నాయక్ తండలో జన్మించినప్పటికీ, తన జీవితం మొత్తాన్ని గిరిజనుల అభ్యున్నతికే అంకితం చేశారని కొనియాడారు. మద్యపానానికి బానిస కాకుండా, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని బోధిస్తూ గిరిజన సమాజంలో పెను మార్పులకు దోహదపడ్డ గొప్ప సంస్కర్తగా సేవాలాల్ నిలిచారని అన్నారు.
ఆయన బోధించిన సమానత్వం, సత్యం, శ్రమ, సామాజిక ఔన్నత్యం వంటి విలువలు ప్రతి ఒక్కరూ ఆచరించదగినవని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నామని మంత్రి తెలిపారు. ఐటిడిఎలను బలోపేతం చేస్తూ ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, డిగ్రీ కళాశాలలను విస్తరించనున్నట్లు వెల్లడించారు. గిరిజన విద్యార్థులు ఐఐటి, జెఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరింగ్ కళాశాలల్లో , కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ప్రముఖ మెడికల్ కళాశాలల్లో , ఎయిమ్స్ లాంటి వైద్య కళాశాలల్లో ఎంబిబిఎస్ సీట్లను, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ఉచిత సీట్లు సంపాదించి అద్భుత విజయాలు సాధిస్తున్నారని, ఇందుకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న ఉచిత కోచింగ్ ప్రధాన కారణమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, జగిత్యాల ఎంఎల్ఎ డాక్టర్ సంజయ్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, మాజి ఎంఎల్సి రాములు నాయక్, మాజీ మంత్రి రవీందర్ నాయక్, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి ఘోష్, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకులు సముజ్వల, చీఫ్ ఇంజనీర్ బాలునాయక్, జిసిసి జిఎం ప్రతాప్ రెడ్డి, ఇతర ఉన్నత అధికారులు, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





