కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ల ఎన్నికలకు రంగం సిద్ధం
ఉ. 11కు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం
మ.12.30 తర్వాత ఛైర్‌పర్సన్లు, మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం
ఏకగ్రీవం కాని చోట చేయి ఎత్తే విధానం ద్వారా ఎన్నిక
సమానంగా ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటించనున్న అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కొత్త కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏకగ్రీవం కాని చోట చేయి ఎత్తే విధానం ద్వారా ఎన్నిక నిర్వహిస్తారు. ఆయా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లు చేయి ఎత్తి ఓటు వేయాలి. ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్న ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు తమ ఓటును వినియోగించుకుంటారు.
కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లతో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యులు ఓట్లు వేసిన తర్వాత సమానంగా ఓట్లు ఉన్నట్లయితే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. ఒక్కో అభ్యర్థి పేరు 5 పేపర్లపై రాసి, అన్నీ కలిపేసి స్థానిక ఎన్నికల అధికారి లాటరీ తీస్తారు. అందులో ఎవరి పేరు వస్తే వారినే విజేతగా ప్రకటిస్తారు. పరోక్ష ఎన్నిక ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం విధివిధానాలను వెల్లడించింది. ఎన్నిక నిర్వహించడానికి మొత్తం కౌన్సిలర్లు, కార్పొరేటర్లలో కనీసం సగం మంది ఉంటేనే కోరంగా పరిగణిస్తారు. ఒకవేళ కోరం లేకపోతే ఛైర్ పర్సన్, మేయర్ ఎన్నిక మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. ఆ రోజు కూడా కోరం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఆ తర్వాత మరో రోజును ఖరారు చేసి, అప్పుడు కోరం లేకపోయినప్పటికీ ఎన్నిక నిర్వహిస్తారు.
ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే ఎన్నిక
రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 2,594 మంది కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో 414 మంది కార్పొరేటర్లుగా గెలిచారు. ఆయా మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో రిజర్వేషన్ల ప్రకారం ఛైర్‌పర్సన్‌లు, మేయర్‌లను ఎన్నుకుంటారు. వైస్ ఛైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్లకు రిజర్వేషన్లు వర్తించవు. మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం ఒకరే పోటీలో ఉంటే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు. ముందుగా ఛైర్‌పర్సన్, మేయర్, ఆ తర్వాత వైస్ ఛైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. ఒకవేళ ఏదైనా కారణంతో ఛైర్‌పర్సన్, మేయర్ ఎన్నిక నిర్వహించలేకపోతే, వైస్ ఛైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా వాయిదా వేస్తారు.
విప్ జారీ చేస్తే ఎల్లుండి వరకు అవకాశం
మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో చైర్‌పర్సర్, మేయర్ ఎన్నికలో రాజకీయ పార్టీలకు విప్ జారీ చేసే అధికారం ఉంటుంది. కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం సహా 13 పార్టీలకు విప్ జారీ చేసే అవకాశం ఉంది. విప్ జారీ చేస్తే సోమవారం ఉదయం 11 గంటల్లోపు స్థానిక ఎన్నికల అధికారికి ఆయా పార్టీలు సమాచారం ఇవ్వాలి. పార్టీల అభ్యర్థులుగా గెలిచిన వారు విప్‌ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ విప్ ధిక్కరిస్తే ఆ పార్టీ మూడు రోజుల్లోగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థికి నోటీసులిచ్చి వివరణ కోసం వారం రోజులు గడువు ఇచ్చి ఆ తర్వాత రెండు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థికి, స్థానిక ఎన్నికల అధికారికి సోమవారం ఉదయం 10 గంటలలోపు ఆయా పార్టీలు బి.ఫారం ఇవ్వాలి.
అత్యధికంగా 1,537 వార్డులు గెలిచిన కాంగ్రెస్
మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల వారీగా చూస్తే, మొత్తం 2,996 మున్సిపల్ వార్డులకు గాను, కాంగ్రెస్ పార్టీ 1,537 వార్డులు గెలుచుకుంది. బిఆర్‌ఎస్ పార్టీ 781 వార్డులు గెలుచుకోగా, బిజెపి 336, సిపిఎం 13, ఎంఐఎం 70, బిఎస్‌పి 2 వార్డులు గెలువగా, స్వతంత్రులు 181 వార్డుల్లో గెలుపొందారు. ఏడు మున్సిపల్ కార్పోరేషన్లలో మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్‌నగర్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించి, నాలుగు స్థానాలకు కైవసం చేసుకోనుంది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్, సిపిఐ చెరో 22 స్థానాలు గెలుచుకోగా, అక్కడ హంగ్ ఏర్పడినప్పటికీ కాంగ్రెస్‌తో పాటు సిపిఐ పార్టీకి ఉన్న అవగాహన మేరకు ఆ పార్టీ మేయర్ పదవి దక్కే అవకాశం ఉంది.
నిజామాబాద్ కార్పోరేషన్‌లో మొత్తం 60 స్థానాలకు గానూ బిజెపి 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బిఆర్‌ఎస్ ఒక స్థానంలో గెలిచాయి. కాగా, బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ సిద్ధాంతాలకు అతీతంగా బిజెపి పార్టీని నిలువరించడానికి కాంగ్రెస్, బిఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు జతకట్టడం అక్కడ మేయర్ ఎన్నిక ఆసక్తిగా మారింది. కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 స్థానాలలో బిజెపి అత్యధికంగా 28 స్థానాలు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 14, ఎంఐఎం 3, బిఆర్‌ఎస్ 9 స్థానాల్లో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు 10 మంది గెలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏ పార్టీ వైపు చూపితే ఆ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోనుంది.





