మన తెలంగాణ/హైదరాబాద్: హంగ్ మున్సిపాలిటీలు .. ‘హస్త’గతం కావాల్సిందేనని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నెల 16న (సోమవారం) మున్సిపల్ చైర్మన్లను, కార్పొరేషన్ల మేయర్లను ఎన్నుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని తన (ఎంపీ) క్యాంపు కార్యాలయంలో సమావేశం ని ర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భ ట్టివిక్రమార్క, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఇతర ముఖ్య నాయకులూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హంగ్ మున్సిపాలిటీలన్నింటినీ కైవసం చేసుకోవడానికి ఎ లాంటి పరిస్థితులు ఉన్నాయని ప్రశ్నించగా, ఇన్‌ఛార్జి మం త్రులు లెక్కలు చూపించారని తెలిసింది. ఇండిపెండెంట్లు, ఇ తర పార్టీల నుంచి గెలుపొందిన వారిలో ఎంత మంది మన పార్టీకి మద్దతుగా ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి వా రిని అడిగి తెలుసుకున్నారని తెలిసింది. తన వద్ద ఉన్న సమాచారాన్ని, మంత్రులు చెబుతున్న సమాచారాన్ని ఆయన బే రీజు వేసుకున్నారని సమాచారం. సోమవారం చైర్మన్ల, మే యర్ల ఎంపిక పూర్తయ్యేంత వరకూ, ఇతర బిజెపి, బిఆర్‌ఎస్ కవ్వింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ చేజారవద్దని ఆయన సూచించారని తెలిసింది. మొత్తం 38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడితే,
అందులో 20 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి మార్గం సుగమమైందని మంత్రులు వివరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇదిలాఉండగా నిజామాబాద్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహం కోసం పిసిసి చీఫ్ బి. మహేష్‌కుమార్ గౌడ్‌ను, మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఇంఛార్జిలుగా నియమించారు. ఈ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడానికి మజ్లీస్ పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో మాట్లాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్‌కు సూచించారని తెలిసింది. ఇంకా కీలకమైన కరీంనగర్ కార్పొరేషన్‌కు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, డి. శ్రీధర్ బాబును, జగిత్యాలకు అడ్లూరి లక్ష్మణ్‌ను, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్‌ను ఇంఛార్జిలుగా నియమించారు.
అధిష్టానం అభినందనలు
మున్సిపాలిటీల్లో మంచి ఫలితాలు సాధించడానికి బాగా కృషి చేశారని, దీంతో పార్టీ అధిష్టానం కూడా సంతృప్తి వ్యక్తం చేసిందని సిఎం వివరించారు. మంత్రులను, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ ముఖ్య నాయకులను, ముఖ్యంగా కార్యకర్తలను ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేయాల్సిందిగా పార్టీ అధిష్టానం తనకు సూచించిందని ముఖ్యమంత్రి చెప్పినట్లు పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు తెలిపారు.
నేను ముందే చెప్పాను కదా..
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే మున్సిపాలిటీల్లో తొంబై శాతం సీట్లు కైవసం చేసుకుంటామని ఎంతో నమ్మకంగా మీకు చెప్పానని, బహిరంగ సభల్లో, మీడియా సమావేశాల్లోనూ చెప్పానని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఆదర్శ మున్సిపాలిటీలుగా, కార్పొరేషన్లుగా తీర్చి దిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.
అంఛనా లెక్క పక్కాగా.. సిఎంను అభినందించిన మంత్రులు
మీ అంచనా లెక్క .. పక్కాగా వచ్చిందనీ మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. మీ కృషి, పట్టుదల, చేపట్టిన మంచి పథకాలూ మన పార్టీ విజయానికి తోడ్పడ్డాయని ప్రశంసించారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల మహిళలు సంతోషంగా ఉన్నారని, వారు ఖచ్చితంగా తమ పార్టీకే ఓట్లు వేశారని అన్నారు.






