తన అద్భుత నటన, మైమరపించే డ్యా న్స్‌లు, పవర్‌ఫుల్ యాక్షన్‌తో కోట్లాది అభిమానులు, ప్రేక్షకుల మన సు గెలుచుకున్న మెగాస్టార్ చిరంజీవి తన సినీ ప్రయాణంలోని అమూల్యమైన జ్ఞాపకాన్ని పంచుకున్నారు. దశాబ్దాలుగా అగ్ర కథానాయకుడిగా అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి సినిమా ‘పునాదిరాళ్లు’. ఈ చిత్రం 1979 సంవత్సరం జూన్ 21న విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, నరసింహ రా జు, గోకిన రామారావు, సావిత్రి, కవిత ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే అప్పట్లో ఫిబ్రవరి 11వ తేదీన ఈ చిత్రం షూటింగ్‌లో చిరంజీవి మొదటిసారి పాల్గొన్నారు. ఈ సినిమా కోసం మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన ప్రత్యేక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేశారు మెగాస్టార్.
“ఈరోజు పునాదిరాళ్లు సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు.ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి. ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాదిరాళ్లు పడ్డాయి”అని చిరంజీవి పేర్కొన్నారు.






