న్యూఢిల్లీ: నమీబియాతో జరిగే మ్యాచ్ కోసం ఆతిథ్య టీమిండియా మంగళవారం ముమ్మర సాధన చేసింది. గురువారం ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే ఓ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా రెండో విజయంపై కన్నేసింది. దీని కోసం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆటగాళ్లు కఠోర సాధన చేశారు. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ పర్యవేక్షణలో ఈ సాధన కొనసాగింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు స్టార్ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, సిరాజ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు ప్రాక్టీస్ చేశారు.
ఈ సందర్భంగా గంభీర్‌తో పాటు అసిస్టెంట్ కోచ్‌లు వీరికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. కాగా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం భారత్ తలపడాల్సి ఉంది. ఇలాంటి స్థితిలో నమీబియా మ్యాచ్‌ను దీనికి రిహార్సల్‌గా ఉపయోగించు కోవాలనే లక్షంతో భారత్ కనిపిస్తోంది. దీని కోసం కఠోర సాధనలో నిమగ్నమైంది.





