Sirimalli

My WordPress Blog

హంగ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అరాచకాలు

పోలీసులతో మా కార్పొరేటర్లకు ప్రలోభాలు

ఎవరు కలిసొచ్చినా రాకున్నా సింగరేణిలో అవినీతిపై

పోరాటం చేస్తాం: కెటిఆర్

తెలంగాణ భవన్‌లో సేవాలాల్ జయంతి వేడుకలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో 34 చోట్ల హంగ్ పరిస్థితి ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఆయా చోట్ల కాంగ్రెస్ పార్టీ ఆరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు తమ కార్పోరేటర్లను పోలీసుల ద్వారా ప్రలోభపెడుతునారని మండిపడ్డారు. పోలీసులను ఇంటింటికి పంపించడం, గుండాలను ఉపయోగించడం వంటి చర్యలు జరుగుతున్నాయని అన్నారు. ఎక్స్ అఫీషియో ఓటుపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తాము 17 మున్సిపాలిటీలు గెలిచామని, తమకు ఉన్న అంచనా మేరకు హంగ్ మున్సిపాలిటీల్లో మరిన్ని తమ పార్టీకి రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కెటిఆర్, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ రాజకీయ పరిస్థితులు, సింగరేణి సంస్థలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు.

సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం

సింగరేణిలో జరుగుతున్న దోపిడీని అడ్డుకోవడమే తమ లక్ష్యమని కెటిఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా కొత్తగూడెంలో తాము సిపిఐకి మద్దతు ప్రకటించామని తెలిపారు. బిజెపి, కాంగ్రెస్ రెండూ కలిసి సింగరేణి దోపిడీలో భాగస్వాములై సంస్థను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సిపిఐ, కాంగ్రెస్ ఇప్పటికే అవగాహనతో ఉన్నాయని, కొత్తగూడెంలో మేయర్ పదవి పంచుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదని అన్నారు. అయితే సిపిఐకి అనుబంధ సంస్థ ఎఐటియుసి కూడా ఈ పొత్తును ఎందుకు అంగీకరించిందో తెలియదన్నారు. దాని వెనుక ఏ ఒత్తిళ్లు పని చేశాయో తాను చెప్పలేనని వ్యాఖ్యానించారు. అయితే ఎవరు కలిసొచ్చినా, రాకున్నా తాము సింగరేణి అవినీతిపై పోరాటం చేస్తామని కుండబద్దలు కొట్టారు.

జల్-జంగల్-జమీన్ స్ఫూర్తితో కెసిఆర్ పాలన

మా తండాల్లో మా రాజ్యం ఉండాలి అన్న నినాదాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చి గిరిజనుల ఆత్మగౌరవానికి న్యాయం చేసిన నాయకుడు కెసిఆర్ అని కెటిఆర్ పేర్కొన్నారు. గిరిజన గూడాలు, కోయ గూడాలు, లంబాడా తండాలకు ప్రాధాన్యం ఇస్తూ 3,146 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి వేలాది గిరిజన యువతకు సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా అవకాశాలు కల్పించారని చెప్పారు. దాదాపు 30 వేల మంది వార్డు సభ్యులు గిరిజన వర్గాల నుంచి ఎదిగారని వివరించారు. అలాగే ఒకే రోజు సుమారు నాలుగున్నర లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనుల భూమి హక్కులను బిఆర్‌ఎస్ ప్రభుత్వం రక్షించిందని అన్నారు. కొమురం భీమ్ నాయకత్వంలో జరిగిన జల్, జంగల్, జమీన్ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ అడవులు, భూములు, నీళ్ల విషయంలో న్యాయం చేస్తూ గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచామని తెలిపారు.

గిరిజన పిల్లల కోసం ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, జూనియర్, డిగ్రీ కాలేజీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం బిఆర్‌ఎస్ ప్రభుత్వ ఘనత అని చెప్పారు. రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచి గిరిజన యువతకు మెరుగైన అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. గిరిజన యువతకు ప్రభుత్వ సబ్సిడీలు, వడ్డీ లేని రుణాలు అందించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని వివరించారు. ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందించి విదేశాలలో ఉన్నత విద్యకు ప్రోత్సాహం ఇచ్చామని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో సేవాలాల్ బంజారా భవన్ నిర్మాణం ద్వారా గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని, రాష్ట్రవ్యాప్తంగా సేవాలాల్ భవనాల నిర్మాణానికి స్థలాలు మంజూరు చేసినట్లు చెప్పారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం కూడా గిరిజన గౌరవానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

బిఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు అండగా నిలబడతామని కెటిఆర్ హామీ ఇచ్చారు. సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని తెలంగాణ భవన్‌లో ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని కెటిఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంఎల్‌ఎ అనిల్ జాదవ్, భుక్యా జాన్సన్ రాథోడ్, వాల్యా నాయక్, రామచంద్రు నాయక్, రాంభల్, గాంధీ నాయక్, కరాటే రాజు, శ్రీనివాస్ గౌడ్ తదితర నేతలతో కలిసి భోగ్ భండార్ కార్యక్రమం నిర్వహించారు.

ప్రజలందరికీ కెటిఆర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు

మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. శివుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబం సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. సేవాలాల్ జయంతి, మహాశివరాత్రి ఒకే రోజు రావడం ప్రత్యేకతగా పేర్కొన్నారు.