రెడ్డి అయినా.. రావు అయినా.. మా దగ్గరకు రావాల్సిందే
సిఎం వద్దకు మేం వెళ్లం
మజ్లిస్ లేకపోతే జూబ్లీహిల్స్‌ను కాంగ్రెస్ గెలుచుకునేదా?
ప్రజలను మోసం చేయడంలో మోడీ బడే భాయ్.. రేవంత్ చోటే భాయ్
మున్సిపల్ ఎన్నికల్లో మా సత్తా ఏంటో చాటుతాం
కరీంనగర్లో అక్బరుద్ధీన్ సంచలన వ్యాఖ్యలు
మన తెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో సిఎం ఎవరైనా ఎంఐఎం దగ్గరికి రావాల్సిందేనని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం అందరి పార్టీ అని పేర్కొన్నారు. రెడ్డిలు, రావులు చేసినంత డ బ్బు ఖర్చు ఎంఐంఎం చేయలేదేమో.. కానీ, ప్రజలకు ప్రత్య క్షంగా, పరోక్షంగా అండగా ఉంటుందని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా సోమవారం కరీంనగర్‌లోని వెలమ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రులుగా ఎవరు వచ్చినా ఒవైసి సోదరుల వద్దకు ఎందుకు వస్తారో ఒక్కసారి ఆలోచించాలని ప్రజలను కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తీరును విమర్శిస్తూ, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఫలితాలను ప్రస్తావిస్తూ రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌తో తాము కలవకపోయి ఉంటే అక్కడ గెలుపు సాధ్యమయ్యేది కాదని అభిప్రాయపడ్డారు.
అధికారంలో ఎవరు ఉన్నా, వారు ఏ పార్టీ వారైనా సరే మా వద్దకు రావాల్సిందేనని, అది కేవలం ప్రజల బలమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏ కులం లేదా ఏ వర్గం వారు తమ సొంతం కాదని, కేవలం తమ సిద్ధాంతాన్ని నమ్మే వారే తమ బలమని పేర్కొన్నారు. ఇమామ్, మౌజన్ గౌరవ వేతనాలతో పాటు అర్చకులకు గౌరవ వేతనాల గురించి ఎంఐఎం గొంతెత్తిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంఐఎం అందరి పార్టీ అని చెప్పడానికి ఇంత కంటే ఏ ఉదాహరణ ఉండదని పేర్కొన్నారు. అసెంబ్లీలో తమ ఉనికి ఉంటేనే పనులు జరుగుతాయని, రాజకీయాలు చేయడం తమకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన తన ప్రసంగంలో ఉద్ఘాటించారు. బిజెపికి మతరాజకీయాలు తప్ప, వేరేది చేతగాదు అని అన్నారు. నెహ్రూ నుంచి మోడీ వరకు ముస్లింలు, దళితులను మోసం చేశారన్నారు. ప్రజలను మోసం చేయడంలో మోడీ బడే భాయ్.. రేవంత్ ఛోటే భాయ్ అని ఎద్దేవా చేశారు. కరీంనగర్ ఎవరి అడ్డానో కాదని, దానిని అభివృద్ధికి అడ్డాగా మారుస్తామని పేర్కొన్నారు.
420 హామీలతో కాంగ్రెస్ మోసం చేసిందని, ఏ ఒక్క హామీనైనా అమలు చేసిందా? అని ప్రవ్నించారు. మైనార్టీ సంక్షేమం కోసం బడ్జెట్లో రూ.3500 కోట్లు ప్రకటించి, కేవలం అందులో 38 శాతం మాత్రమే కేటాయించడం వారికి మైనార్టీలపై ఉన్న ప్రేమ ఎంతటిదో చాటి చెబుతున్నదని చెప్పారు. బిజెపి నేతలు నిత్యం ఒవైసి బ్రదర్స్ పేరును వాడుకుంటూ, రాజకీయం చేస్తున్నదన్నారు. ఎంఐఎం పార్టీ లేకపోతే, బిజెపికి మనుగడనే లేదని పేర్కొన్నారు. ఎంఐఎం దయాదాక్షిణ్యాలతో గెలిచిన గంగుల కమలాకర్.. నేడు అదే ఎంఐఎంపై విమర్శలు చేయడం ఆయన విజ్ఞతకు నిదర్శమన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై ఎంఐఎం జెండా ఎగురుతుందని జోస్యం చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత కరీంనగర్‌కు వస్తానని, అప్పుడు విజ యోత్సవ ర్యాలీలు ఘనంగా నిర్వహిద్దామని ఆకాంక్షించారు.
ఎంఐఎం పార్టీకి బీజేపీ భయపడుతున్నదని అక్బరుద్దీన్ విమర్శించారు. ఎంఐఎం భయానికి బీజేపీ గతంలో లేనటువంటి సంస్కృతి తెరలేపిందని, ఏకంగా ముస్లిం అభ్యర్థులకు టికెట్లు కేటాయించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఉమ్మడి జిల్లా పరిశీలకుడు యాసర్ అరఫాత్, కరీంనగర్అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, నగర కమిటీ నాయకులు బర్కత్ అలీ, సయ్యద్ మొయిజుద్దీన్ ఖాదిరి యూ సుఫ్,ఆతిన ఆతిఫ్, ఇబ్రహీం,ఖమారుద్దీన్, అజర్ దబీర్,ఆరిఫ్ అహ్మద్,బాబుజానీ, ఫసియు ద్దీన్ ఖాలీద్, సురేష్, సుధాకర్, రాజు, ఆసిమ్, అంజద్ ఖాన్, మజారొద్దీన్, అక్బర్, మొహసీ న్ మొహియుద్దీన్, వాజిద్ ఖాన్,అనెమల్ల సురేష్,కొమ్ముల రామేశ్వరి, మాజీ కోఆప్షన్ సభ్యు రాలు రాఫియా సుల్తానా, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





