సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘నారీ నారీ నడుమ మురారి’తో అలరించిన చార్మింగ్ స్టార్ శర్వా, ఇప్పుడు తొలిసారిగా యాక్షన్ స్పెషలిస్ట్ సంపత్ నందితో కలిసి ‘భోగి’ అనే భారీ పాన్- ఇండియన్ పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. టీమ్ ఇప్పటికే ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసింది. అందులో శర్వా, ఇతర నటీనటులతో కొన్ని టాకీ పార్ట్ చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ కీలక షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ను నిర్మించారు. ఈ షెడ్యూల్‌లో రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్‌లు ఉండగా, వాటికి ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ భారీ షెడ్యూల్ పూర్తయ్యే వరకు శర్వా నాన్ స్టాప్ గా షూటింగ్‌లో పాల్గొననున్నారు. తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మక చిత్రంగా నిలుస్తున్న భోగిలో శర్వా పూర్తి కొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. భోగి చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్- ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది.





