Sirimalli

My WordPress Blog

మాట్లాడు

మాట్లాడు.. ఏదో ఒకటి మాట్లాడు

నీలోపల, లోలోపల, ఓసారి తొంగిజూడు

నీ చుట్టూ అల్లుకున్న

చీకట్లను భయాలను పక్కకునెట్టి

కనీసం నీతో నువ్వయినా మాట్లాడు

మాట్లాడకపోతే

నీలోని ఒక ధీరోదాత్తుడైన మానవునితో

సంభాషించే సద్భాగ్యాన్ని కోల్పోతావు

లేదూ, నిన్ను నీవే కోల్పోతావు

లే, అత్తిపత్తిలా అలా వాలిపోతావేం?

నీలో నువ్వు ముడుచుకుపోతావేం?

వికసించు, పూవులా విప్పారు

ఓ జలపాతమై, నేనులోంచి మనంలోకి

మనం నుంచి జనంలోకి

జాతరలా ప్రవహించు

రెక్కవిప్పి నింగినదిలో స్వేచ్ఛగా ఈదులాడు

ఇప్పటికే, నిన్ను బరువంటోంది భూమి

కసురుకుంటోంది కాలం

యింకెంత కాలమీ స్తబ్ధత?

పోటెత్తనీ, నీలోని సముద్రాలు

బద్దలవనీ, అగ్నిపర్వతాలు

మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు

ఈ రోజుటి కొత్త గాయాల గురించో

గాయాలను పొడుచుకు తింటున్న

రాంపోతుల గురించో

కూలగొట్టబడ్డ నీ యింటిగురించో

పగిలిపోయిన పూలకుండీల గురించో

రాలిపోయిన మొగ్గల గురించో

పసరుటాకుల కన్నీటిపాట గురించో

ఏదో ఒకటి మాట్లాడు

నిత్య నిర్భందాల రాజ్యంలో

ఏ పెనుగాలికి ఏ చెట్లు కూలిపోయాయో

ఏ పూలు ఎక్కడ రాలిపోయాయో

ఏ గూళ్లు ఎలా తగలబడిపోయాయో

ఏ పిట్టపిల్లలు

నేలరాలి నెత్తురోడుతున్నాయో

మాట్లాడు, మాట్లాడు,

ఏదో ఒకటి మాట్లాడు

సమస్తం ధ్వంసమైపోతున్న

ఒకానొక తరుణంలో

నేనింకా బతికే ఉన్నాననీ,

మాట్లాడుతున్నాననీ

ఎలుగెత్తి భూనభోంతరాలు దద్దరిల్లేలా

బిగ్గరగా మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు

మాటాడితే, మంటలు పుట్టాల

మాటాడితే, చురకత్తులు జూలు విదిల్చాల

మాట, జయగీతమే కాదు జనగీతం గావాల

ఒరే నాయనా

మాట్లాడాల్సిన సమయంలో

మాట్లాడకపోతే

నువ్వు మరణించినట్టు లెఖ్ఖ

మాట్లాడితే కేవలం ధిక్కారివే

మాట్లాడకపోతే నువ్వు, కట్టు బానిసవు!

– సిరికి స్వామినాయుడు