Sirimalli

My WordPress Blog

బయో సదస్సు జీవవిజ్ఞాన తేజస్సు

ఒకవైపు ఢిల్లీలో భారత్ ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తుండగా, మరో వైపు ఇదే సమయంలో భాగ్యనగరంలో బయో ఆసియా సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వ భవితవ్యానికి బంగారు బాట వేస్తోందని చెప్పవచ్చు. సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ. 1700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వివిధ సంస్థల ప్రతినిధులు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం వచ్చే రెండేళ్లలో సుమారు 8250 ఉద్యోగ అవకాశాలు తెలంగాణ యువతకు లభించే అవకాశం కలుగుతోంది. దీనికి తోడు 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాష్ట్రానికి సమకూర్చి కొత్తగా 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఎన్నో ఆశలను రేకెత్తిస్తోంది. సిబిఆర్‌ఇ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ (2025) ప్రకారం బోస్టన్, శాన్‌ఫ్రాన్సిస్కో, బీజింగ్, టోక్యో వంటి గ్లోబల్ హబ్‌ల సరసన నిలిచిన ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ అని ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది.

కొద్ది వారాల క్రితం దావోస్‌లో కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు చూపుతోనే ఈ బయో ఆసియా సదస్సును చేపట్టడం జీవవిజ్ఞాన రాజధానిగా హైదరాబాద్‌ను రూపొందించాలన్న లక్షం ప్రగాఢంగా కనిపిస్తోంది. 23 ఏళ్ల క్రితం బయో ఆసియా సదస్సు ప్రారంభమైనప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్‌వేర్ నగరం అన్న పేరుండేది.అదే హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా చరిత్ర సాధించింది. ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జిపిసి)కు ప్రాధాన్య గమ్యస్థానంగా మారిన హైదరాబాద్‌ను సమగ్ర జీవన విజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా మనమంతా కలిసి తీర్చిదిద్దుదామని సదస్సును ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామిక వేత్తలకు, సంబంధిత సంస్థలకు పిలుపు నివ్వడం మంచి పరిణామం. గత రెండేళ్లలోనే జీవ విజ్ఞానరంగంలో రూ.73 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలన్న లక్షాలను ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచం లోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో రాష్ట్రాన్ని ఒకటిగా నిలిపేందుకు విధానాలను రూపొందించినట్టు వెల్లడించింది.

భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రాబోయే విద్యా సంవత్సరం నుంచే లైఫ్ సైన్సెస్ యూనివర్శిటీ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. లైఫ్ సైన్సెస్ రంగంలో కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్, డేటా సైన్సెస్ ఏకీకరణపై ఈ సదస్సులో చర్చలు ప్రముఖంగా సాగడంతో ఇది ప్రపంచస్థాయి బయో ఆసియా సదస్సుగా గుర్తింపు పొందడం విశేషం. ఈ సందర్భంగా గ్లోబల్ కంపెనీల చూపు జీనోమ్ వ్యాలీ వైపు కేంద్రీకరించడం అత్యంత విశేషం. జిఎపిఎఫ్‌ఎ ఇండోనేషియా విభాగమైన వాక్సిండో యానిమల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక బిఎస్‌ఎల్ 3 వ్యాక్సిన్ తయారీ కేంద్రాని ఏర్పాటు చేస్తోంది. కోళ్లు, పశువులు, ఆక్వా కల్చర్ కోసం వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేయడమే ఈ సంస్థ ప్రధాన లక్షం. ఆర్‌ఎక్స్ ప్రొపెల్లెంట్ జీనోమ్ వ్యాలీలో భారీ స్థాయిలో ఫార్మాట్ లైఫ్ సైన్సెస్ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టు 12 ఎకరాల స్థలంలో ఒక మిలియన్ చదరపు అడుగుల అడ్వాన్స్‌ల్యాబ్, మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. ఇదే సమయంలో జీనోమ్ వ్యాలీ నాలుగో దశను అత్యాధునిక మౌలిక వసతులతో ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.

జీనోమ్ వ్యాలీ అన్నది హైదరాబాద్ శివారు లోని భారతీయ హై టెక్నాలజీ వ్యాపార కేంద్రం. బయో మెడికల్ పరిశోధన, శిక్షణ తయారీ కోసం ఒక క్లస్టర్‌గా అభివృద్ధి చెందింది. భారత్ బయోటెక్ వంటి వివిధ సంస్థల ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో 1999 లో ఇది ప్రారంభమైంది. 600 కి.మీ పరిధిలో విస్తరించిన ఈ కేంద్రం దేశంలోనే మొట్టమొదటి పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా వ్యవస్థీకృత సముదాయంగా గుర్తింపు పొందింది. 18 దేశాలకు చెందిన దాదాపు 200 సంస్థలు తమ బయోఫార్మా పరిశోధనలను, ఉత్పత్తుల తయారీని సాగిస్తున్నాయి. దాదాపు 150 జీవశాస్త్ర కంపెనీలు ఇందులో ఉన్నాయి. పదివేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ వ్యాలీ ఏర్పాటైన దగ్గర నుంచి తెలంగాణ ప్రభుత్వం దీని విస్తరణకు ప్రణాళికలు రూపొందించడంతో ఏటా 2,00,000 చదరపు అడుగుల మేరకు ప్రయోగ క్షేత్రం (ల్యాబ్ స్పేస్) కొంత కలుస్తూ విస్తరిస్తోంది.

కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో సమర్ధవంతమైన వ్యాక్సిన్ల తయారీకి కేంద్రంగా ఈ వ్యాలీ ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలనే ఆకర్షించ గలిగింది. అదే సమయంలో ఈ జీనోమ వ్యాలీని ప్రధాని మోడీ సందర్శించి కరోనా వ్యాక్సిన్ తయారీ పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకుని పరిశోధకులను, శాస్త్రవేత్తలను ప్రత్యేకంగా అభినందించడం చెప్పుకోదగిన ఘట్టం. ఈ వ్యాలీ దేశీయంగానే కాకుండా ప్రపంచస్థాయి లోనే జీవశాస్త్ర కంపెనీలకు ప్రధాన గమ్యంగా వర్ధిల్లుతోంది. అందుకనే స్వదేశీ, ప్రపంచస్థాయి బయోటెక్నాలజీ కంపెనీలు జీనోమ్ వ్యాలీని ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని చిత్రించగలిగాయి. ఈ నేపథ్యంలో జీనోమ్ వ్యాలీని మరింత విస్తరింప చేయాలని తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రపంచ స్థాయిలో బయో ఆసియా సదస్సును ఏర్పాటు చేయడం ప్రముఖ శాస్త్రవేత్తలను, ఫార్మా రంగ నిపుణులు, నిర్వాహకులను రప్పించడం అభినందించవలసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొని అనేక విలువైన సూచనలతో చర్చించడం విశేషం.