పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో తారిఖ్ రహమాన్ నాయకత్వాన 49 మంది మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత ఒక పురుష ప్రధాని అధికార పగ్గాలు చేపట్టడం ఆ దేశంలో ఇదే తొలిసారి. తల్లి ఖలీదా జియా మరణం తాలూకు సానుభూతి, మాజీ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని ప్రధాన రాజకీయ పార్టీ అవామీ లీగ్‌ను తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలలో పోటీ చేయకుండా బహిష్కరించడం, జమాత్ ఎ ఇస్లామీ కూటమి పెద్దగా పోటీ ఇవ్వలేకపోవడంతో బిఎన్‌పికి మూడింట రెండొంతుల మెజారిటీతో అసాధారణ విజయం లభించింది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా రహమాన్‌కు అందలం సునాయాసంగా అందివచ్చింది. బంగ్లా ప్రజలు తారిఖ్ జియాగా పిలుచుకునే రహమాన్ మొదటినుంచీ వివాదాస్పద రాజకీయ నేతగా పేరుపడ్డారు.
అవామీలీగ్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనపై అవినీతి, ఆశ్రిత పక్షపాతం, మనీలాండరింగ్, బాంబు దాడులకు పాల్పడటం వంటి 84 కేసులు నమోదయ్యాయి. తన తల్లి ప్రధానిగా ఉన్న సమయంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) కార్యాలయమైన హవా భవన్ నుంచి ఆయన సమాంతర ప్రభుత్వాన్ని నడిపేవారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. 2008లో అవామీలీగ్ అధికారంలోకి రావడంతో స్వదేశంలో తనకు నూకలు చెల్లినట్లేనని భావించి, లండన్‌కు పారిపోయి తలదాచుకున్నారు. తన మాతృమూర్తి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి ఖలీదా జియా మరణశయ్యపై ఉండటంతో పదిహేడేళ్ల ప్రవాస జీవితానికి స్వస్తిపలికి గత డిసెంబర్లో తిరిగి స్వదేశం చేరుకున్న తారిఖ్ రహమాన్‌కు ముందున్నది ముళ్లబాటేనని చెప్పవచ్చు. అవామీలీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా ఆశ్రిత పక్షపాతం కారణంగా ప్రజలలో అశాంతి, అభద్రతాభావం చోటుచేసుకున్నాయి. ఆమె పదవీచ్యుతురాలైన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా పగ్గాలు అందుకున్న మహ్మద్ యూనస్ నాయకత్వంలో దేశ పరిస్థితి పెనంమీదనుంచి పొయ్యిలో పడినట్లుగా మారింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పట్టాలు తప్పింది. శాంతిభద్రతలు మృగ్యమయ్యాయి. మైనారిటీల భద్రత ప్రమాదంలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన రహమాన్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి.
రాజకీయ అస్థిరతతో దేశం అతలాకుతలమవుతోంది. అప్పులు పెరిగిపోయి, ప్రజల తలసరి ఆదాయం క్షీణించి, ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరింది. ఉపాధి అవకాశాలు మృగ్యమై, యువతరం ఉద్యమాల బాట పడుతోంది. తాత్కాలిక ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడితప్పాయి. హిందువులు లక్ష్యంగా దాడులు పెచ్చుమీరాయి. దేశంలో అరాచక పరిస్థితులు నెలకొనడంతో పెట్టుబడిదారులు ముందుకు రాని పరిస్థితి నెలకొని ఉంది. వీటన్నింటికీ పరిష్కారాలు కనుగొనవలసిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది. ఇదిలా ఉంటే, రహమాన్ నాయకత్వంలో బంగ్లాదేశ్ విదేశాంగ విధానం ఎలా ఉండబోతోందన్నది అందరిలోనూ ఉత్సుకత రేకెత్తిస్తోంది. తమ దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే విదేశాంగ విధానం ఉంటుందని ఆయన చెప్పినా, భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తామని ఇప్పటికే స్పష్టం చేసినా ఆచరణలో ఆయన తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్ బాటలోనే నడుస్తారన్న అనుమానాలు లేకపోలేదు. యూనస్‌కు దేశ అధ్యక్ష పదవిని కట్టబెడతారనీ లేదా ప్రభుత్వంలో ప్రధాన సలహాదారు పదవిలో కూర్చోబెడతారని వస్తున్న వార్తలు ఇలాంటి అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. పైగా తమ చిరకాల ప్రత్యర్థి షేక్ హసీనాకు భారత్ రాజకీయ ఆశ్రయం కల్పించడం కూడా భారత్‌తో సత్సంబంధాలు నెరిపేందుకు ప్రధాన అడ్డంకిగా మారవచ్చు.
హసీనాను తమకు అప్పగించే విషయంలో న్యాయపోరాటం సాగిస్తామని ఇప్పటికే ప్రకటించిన రహమాన్, భారత్‌తో దౌత్య సంబంధాల విషయంలో తన తల్లి తరహాలోనే అంటీముట్టని వైఖరినే కొనసాగించవచ్చు.ఈ నేపథ్యంలో హసీనాకు దీర్ఘకాలం రాజకీయ ఆశ్రయం కల్పించే విషయంలో భారత్ పునరాలోచన చేయడం శ్రేయస్కరం. బంగ్లాదేశ్‌కు దగ్గర కావడం ద్వారా దక్షిణాసియాలో చైనా ప్రాబల్యాన్ని కట్టడిచేసే దిశగా భారత్ అడుగులు వేయాల్సిన సమయమిది. సార్వత్రిక ఎన్నికలలో సాధించిన ఘన విజయం ద్వారా స్వతంత్రంగా, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు రహమాన్ ప్రభుత్వానికి లభించింది. స్వప్రయోజనాలే పరమావధిగా భావించే చైనా, విభజన రాజకీయాలతో కల్లోలం సృష్టించే పాకిస్తాన్ ఒకవైపు, ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ, వాటికి తలలో నాలుకలా వ్యవహరించే భారత్ మరొకవైపు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎటువైపు మొగ్గాలో నిర్ణయించుకోవలసిన బాధ్యత రహమాన్ ప్రభుత్వానిదే.





