Sirimalli

My WordPress Blog

ప్రపంచ టెన్నిస్‌లో అల్కరాజ్‌దే రాజ్యం!

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. వరుస గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో దూసుకుపోతున్నాడు. అతని ఆట ఆల్‌టైమ్ గ్రేట్ దిగ్గజాలు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రఫెల్ నాదల్ (స్పెయిన్)లను తలపిస్తోంది. 22 ఏళ్ల అతి చిన్న వయసులోనే అల్కరాజ్ కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించి నయా చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే ఏడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించి ఎదురులేని శక్తిగా మారాడు. కిందటి ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ట్రోఫీలు సాధించిన అల్కరాజ్ తాజాగా ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ విజేతగా నిలిచి సత్తా చాటాడు.

సెర్బియా యోధుడు జకోవిచ్‌తో జరిగిన తుది పోరులో అసాధారణ పోరాట పటిమతో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. జకోవిచ్ ఆధిపత్యాన్ని తట్టుకుంటూ ముందుకు సాగిన తీరును ఎంత పొగిడినా తక్కువే. రానున్న రోజుల్లో అల్కరాజ్ ఎదురులేని శక్తిగా మారుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం పురుషుల టెన్నిస్‌లో ఇటలీ స్టార్ జన్నిక్ సినర్ ఒక్కడే అల్కరాజ్‌కు పోటీ ఇస్తున్నాడు.

జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరేవ్ కూడా రేసులో ఉన్నా సినర్‌తో పోల్చితే అతనికి గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో మంచి రికార్డు లేదనే చెప్పాలి. వెటరన్ ఆటగాడు జకోవిచ్‌లో కూడా మునుపటి జోష్ కనిపించడం లేదు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరినా టైటిల్ మాత్రం సాధించలేక పోయాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అల్కరాజ్ జోరును తట్టుకుని మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడం అతనికి శక్తికి మించిన పనిగానే చెప్పాలి. ప్రపంచ టెన్నిస్‌లో మరి కొన్నేళ్ల పాటు అల్కరాజ్ ఆధిపత్యం చెలాయించడం ఖాయమని చెప్పొచ్చు.