నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పాక్ 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత సెంచరీతో చెలరేగి పాకిస్థాన్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ విజయంతో ఇంగ్లండ్ ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. మరోవైపు, ఈ ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలు అత్యంత క్లిష్టంగా మారాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ (63) ఒక్కడే రాణించాడు. అనంతరం 165 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (51 బంతుల్లో 100) అద్వితీయ శతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టినా ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఫలితంతో గ్రూప్-2లో ఇంగ్లండ్ రెండు విజయాలతో 4 పాయింట్లు సాధించి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒక ఓటమి, ఒక రద్దుతో కేవలం ఒక్క పాయింట్‌తో ఉంది. పాక్ సెమీస్ చేరాలంటే తన చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై భారీ తేడాతో గెలవాలి. అదే సమయంలో, న్యూజిలాండ్ తన మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలి. దీంతో గ్రూప్‌లో మిగిలిన ఒక్క సెమీస్ స్థానం కోసం పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంకల మధ్య పోటీ తీవ్రంగా మారింది.
The post పాక్ సెమీస్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే.. appeared first on Navatelangana.







