Sirimalli

My WordPress Blog

పట్టుబట్టి.. పార్టీకి కోట కట్టి..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక కాంగ్రెస్ పని అయిపోయింది, తెలంగాణలో ఆ పార్టీకి నూకలు చెల్లినట్టే అని తెగ సంతోషపడిపోయిన వాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలం పుంజుకుంటున్నది. అందుకు తాజా నిదర్శనం మొన్న వెలువడిన ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటమే కాదు, దక్షిణాదిలో మళ్ళీ ఒక బలమైన శక్తిగా అవతరించిందన్న సంకేతాలు ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి.

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో ప్రభుత్వం మీద, పార్టీ మీద పట్టు మరింత పెరగడమే కాదు, కేంద్ర పార్టీలో కూడా ఆయన పలుకుబడి పెరిగిన మాట వాస్తవం. ఆయన ‘నేనే రాజు, నేనే మంత్రి’ అని ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలకు కారణం ఇదే. కాంగ్రెస్ లో ఇంకా చాలా రోజులు తన మాట చెల్లుబాటు కాబోతున్నదనే సంకేతాలు ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా పంపించారు. ఫలితాలు వెలువడుతున్న క్రమంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి పర్యటించినప్పుడు అక్కడ పార్టీ అధిష్టానం పెద్దలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆయనకు అందించిన అభినందనలు, వారి స్పందన ఇందుకు ఉదాహరణ. కాంగ్రెస్‌లో బహు నాయకత్వం ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అందరూ ఆమోదించి ఎవరి పని వారు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత స్థిరంగా ఉన్నదో ఇప్పుడు మళ్ళీ అవే పరిస్థితులు నెలకొంటున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రినని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందనీ చెబుతూ వచ్చిన మాటలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. మెజారిటీ స్థానా ల్లో కాంగ్రెస్ గెలిచింది. పదేళ్లపాటు అధికారంలో ఉండి, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్‌ఎస్ ఫలితాలపై మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉండి, తెలంగాణలో కూడా అధికారం కోసం ఉవ్విళ్ళూరుతున్న భారతీయ జనతా పార్టీ కింద పడ్డా తనదే పైచేయి అంటున్నది. దీని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం.

కాంగ్రెస్ విషయానికొస్తే ఆ పార్టీ గెలుపు శాతం 63.7. మొత్తం వార్డులలో 52 శాతం వార్డులు అధికార కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉండగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కేవలం ఆరు మున్సిపాలిటీలకే పరిమితమైన కాంగ్రెస్, ఈసారి 74 మున్సిపాలిటీ గెలుచుకున్నది. గత కార్పొరేషన్ ఎన్నికలలో ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ, ఈసారి నాలుగు కార్పొరేషన్లలో మెజారిటీ స్థానాలు గెలుచుకొని మేయర్ పదవులలో పార్టీ నేతలకు అవకాశం కల్పించింది. అయితే హంగ్ పరిస్థితి ఏర్పడిన మూడు కార్పొరేషన్లు, 24 మున్సిపాలిటీలలో గెలుపు ఎవరిదనే ఆసక్తి నెలకొని ఉంది. సభ్యుల బలంతో దాదాపు అన్ని మున్సిపాలిటీలను సాధించుకునే ఎత్తుగడలకు కాంగ్రెస్ తెరతీసింది. హంగ్ అయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను చేజిక్కించుకునేందుకు అధికారపక్షం, తమవారు గోడ దూకి పోకుండా చూసుకోవడంకోసం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మొత్తానికి మూడు ప్రధాన పార్టీలు క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి.

ఈ మూడు కార్పొరేషన్లు, 24 మున్సిపాలిటీలలో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో ఇతర పార్టీలతో పొత్తులు, స్వతంత్రుల మద్దతు కీలకంగా మారాయి. భారతీయ జనతా పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్న కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో, కాంగ్రెస్‌తో పొత్తు కుదరక సిపిఐ స్వతంత్రంగా పోటీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్‌లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు ఎవరు దక్కించుకుంటారన్న విషయం ఆసక్తిగా మారింది. అయితే నిజామాబాద్ కార్పొరేషన్‌ను ఎంఐఎం, కో ఆప్షన్ సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది.

కొత్తగూడెం కార్పొరేషన్ విషయానికి వచ్చేసరికి ఫలితాలు వెలువడుతున్న క్రమంలోనే భారత రాష్ట్ర సమితి కార్యాధ్యక్షుడు కెటి రామారావు సిపిఐకి స్వచ్ఛందంగా తమ పార్టీ మద్దతు ప్రకటించేశారు. అధికారంలో ఉన్నంతకాలం భారత రాష్ట్ర సమితి, దాని అధినాయకుడు కెసిఆర్ కమ్యూనిస్టులను తోక పార్టీలు అని వెక్కిరించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అధికారంలో ఉండగా మునుగోడులో ఉప ఎన్నిక జరిగినప్పుడు సిపిఐ మద్దతు కోసం ఆరాటపడిననాడు భవిష్యత్తులో కూడా ఈ స్నేహం కొనసాగుతుందని కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. ఆ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థి కేవలం 10 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ ఓట్లు సిపిఐ మద్దతు కారణంగా వచ్చినవే. ఆ ఎన్నిక తర్వాత మళ్లీ కెసిఆర్ సిపిఐ నాయకుల మొహం చూడలేదు. ఇప్పుడు కొత్తగూడెంలో కాంగ్రెస్‌ను నిలువరించేందుకు కెటిఆర్ అందిస్తానంటున్న మద్దతు తీసుకోవడానికి సిపిఐ సిద్ధపడుతుందా?

ఇప్పటికే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఏ పార్టీ మద్దతు తీసుకోవాలనే విషయంలో నిర్ణయం జాతీయ పార్టీకి వదిలేశామని ప్రకటించారు. జాతీయ నాయకత్వం కూడా కొత్తగూడెంలో సిపిఐ భారత రాష్ట్ర సమితి సహాయం తీసుకొని పీఠం దక్కించుకోవడానికి సుముఖంగా లేదని, కాంగ్రెస్‌తోనే ప్రయాణం సాగించాలన్న నిర్ణయంతో ఉందని తెలుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు, కనీసం స్పష్టంగా రెండుసార్లు, ఒకసారి సిపిఐ నూరేళ్ల పండుగ ఖమ్మంలో జరిగినప్పుడు, మరోసారి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కారం అందించినప్పుడు కాంగ్రెస్, సిపిఐ రెండూ నాణానికి రెండు వైపులు అని, రాజకీయ పొత్తు కొనసాగుతుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కాబట్టి కొత్తగూడెంలో సిపిఐ, కాంగ్రెస్ కలిసి కార్పొరేషన్‌ను దక్కించుకునే అవకాశాలే ఎక్కువ. అలా చూసినప్పుడు ఏడింట ఆరు కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డట్టే. ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ మాత్రమే భారతీయ జనతా పార్టీ ఖాతాలోపడే అవకాశం ఉంది. అదే జరిగితే అందుకు కారణం కరీంనగర్‌లో కేంద్ర మంత్రి సంజయ్ కి వ్యక్తిగతంగా ప్రజల్లో ఉన్న పలుకుబడే అని భావించాలి.

కార్పొరేషన్ల పరిస్థితి ఇలా ఉంటే, 24 మునిసిపాలిటీలలో ఏం జరగబోతున్నది? ఎవరెన్ని మాట్లాడినా, ఏం చెప్పుకున్నా స్పష్టమైన మెజారిటీ ఉన్న మున్సిపాలిటీలను పక్కన పెడితే సింపుల్ మెజారిటీ రాని, వచ్చినా బొటాబొటీగా ఉన్న మున్సిపాలిటీల పరిస్థితి ఏమిటో చెప్పలేం. ఫలితాలు వెల్లడి కావడానికి ముందునుండే క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. పార్టీల ఎత్తుగడలు ఆఖరిక్షణం వరకు కొనసాగుతాయి. చివరి నిమిషం వరకు ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్ల కోరం లేక ఎన్నికలు వాయిదా పడవచ్చు. 16వ తేదీ తర్వాతే కచ్చితంగా ఏ పార్టీ ఎన్ని మేయర్ స్థానాలు, ఎన్ని చైర్‌పర్సన్ స్థానాలు కైవసం చేసుకున్నదో చెప్పడానికి వీలవుతుంది. ఇది రాస్తున్న సమయానికే జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు మీద తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత మద్దతుతో గెలుపొందిన పదిమందిలో ఎనిమిదిమంది ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్టు సమాచారం మాధ్యమాల్లో వచ్చింది. ఫార్వర్డ్ బ్లాక్ నాయకులతో కలిసి కవిత పత్రికా గోష్ఠి నిర్వహించి ఇది ట్రైలర్ మాత్రమేననీ, ‘పిక్చర్ అభీ బాకీ హై’ అనీ అన్న కొద్దిగంటల్లోనే ఈ పరిణామం జరగడాన్నిబట్టి హంగ్ అయిన మున్సిపాలిటీలను ఎవరు కైవసం చేసుకుంటారో ఇప్పుడే చెప్పలేమని అర్థం అవుతోంది.

ఇక భారత రాష్ట్ర సమితి విషయానికొస్తే తాను అధికారంలో ఉండగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నాలుగు కార్పొరేషన్లు గెలుచుకున్న బిఆర్‌ఎస్ ఈసారి బోణీ కూడా చెయ్యలేదు. కార్పొరేషన్లలో అయితే బిఆర్‌ఎస్ అసలు పోటీనే ఇవ్వలేకపోయింది. అలాగే మున్సిపాలిటీలలో కూడా కేవలం 15కే పరిమితమైంది. గత లోకసభ ఎన్నికల్లో చతికిలబడిన పార్టీ మున్సిపాలిటీ ఎన్నికలలో 28.7 శాతం ఓట్లు సాధించడం, అందునా పార్టీ అగ్రనేత ప్రచారంలో ఎక్కడా కనబడకపోయినా ఈ ఫలితాలు రావడం కొంత ఊరటగానే భావించవచ్చు. అయితే లోకసభ ఎన్నికల నాటికి (16.6 శాతం), ఈ మున్సిపల్ ఎన్నికల నాటికి బిఆర్‌ఎస్‌కు పన్నెండు శాతం ఓట్లు పెరగడం విశేషమే. ఇక లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్‌తో సమానంగా ఎనిమిది స్థానాలు గెలుపొందిన బిజెపి, మహామహులను ప్రచారానికి దింపి కూడా ఒక్క మున్సిపాలిటీనీ గెలవకపోవడాన్ని బట్టి ఆ పార్టీ తప్పనిసరిగా తెలంగాణలో తమ పరిస్థితి మీద సమీక్ష జరుపుకోవాల్సిందే. లేదా కవిత చెపుతున్నట్టు బిఆర్‌ఎస్‌తో పొత్తు ప్రయత్నాలు ఇప్పటి నుండే ప్రారంభించాలేమో!.

దేవులపల్లి అమర్