న్యూఢిల్లీ : దేశ క్షిపణి వ్యవస్థను మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో భారత్ మరో ముందడుగు వేసింది. భారత రక్షణ పరిశోధన , అభివృద్ధి సంస్థ (డిఆర్డివొ)మంగళవారం ఒడిశా తీరంలో చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుండి సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ (ఎస్ఎఫ్డిఆర్) టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయవంతమైన ప్రదర్శనతో భారతదేశం ఈ సాంకేతికతను కలిగి ఉన్న ఎంపికైన దేశాల సమూహంలో చేరింది. ఇది దీర్ఘశ్రేణి ఎయిర్ టు ఎయిర్ క్షిపణుల అభివృద్ధిని అనుమతిస్తుంది. ప్రత్యర్థులపై వ్యూహాత్మక విజయాన్ని అందిస్తుంది. ఈ పరీక్షలో భాగంగా నాజిల్ లెస్ బూస్టర్ , సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ మోటార్,ఫ్యూయల్ ఫ్లో కంట్రోలర్ వంటి అన్ని వ్యవస్థలు ఆశించిన రీతిలో అత్యుత్తమ పనితీరును కనబరిచాయి.
ఐటీఆర్ ఏర్పాటు చేసిన వివిధ ట్రాకింగ్ పరికరాల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఈ పరీక్ష విజయవంతమైనట్టు శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. ఎస్ఎఫ్డిఆర్ ప్రొపల్షన్ వ్యవస్థ పరీక్ష విజయవంతం కావడంతో శత్రుదేశాల లక్షాలను అత్యంత దూరం నుంచే అడ్డుకోగల క్షిపణుల తయారీ దిశగా భారత్ ముందడుగు వేసినట్టయింది. ఈ ప్రయోగాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ , హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ(హెచ్ఇఎంఆర్ఎల్), రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సిఐ), ఐటీఆర్ శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. ఎస్ఎఫ్డిఆర్ సాంకేతికతను విజయవంతంగా ప్రదర్శించినందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డీఆర్డీవోను అభినందించారు. ఈ పరీక్షలో పాల్గొన్న అన్ని బృందాలను రక్షణ పరిశోధన , అభివృద్ధి శాఖ కార్యదర్శి డిఆర్డివో ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ అభినందించారు.






