మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ), క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ను సామాన్యుడికి చేరువ చేసి.. డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాల కు రోల్ మోడల్‌గా తీర్చి దిద్దాలన్నదే తమ ప్ర భుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించా రు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో టెక్నాలజీని కేవలం ఓ సాఫ్ట్‌వేర్‌గా మాత్రమే కాకుండా… ఓ ట్రాన్స్ఫర్మేషన్ టూల్‌గా మార్చుకుంటున్నామన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రణాళికలను న్యూఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో భాగంగా శుక్రవారం ‘ఏజెంట్స్ ఆఫ్ ఛేంజ్: ఎఐ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ క్లైమేట్ రెసిలియెన్స్’ అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
పౌర సేవలకు టెక్నాలజీని అనుసంధానం చేసి… ప్రభుత్వానికి, పౌరులకు మధ్య ఉండే దూరాన్ని తగ్గించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ, ఎఐ సిటీ, ఎఐ యూనివర్సిటీ, ఐకం, ఎఐ ఆధారిత తెలంగాణ డిజిటల్ ఎక్స్ఛేంజ్, భూ భారతి లాంటి విప్లవాత్మక సంస్కరణలు డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణ బ్రాండ్‌ను సుస్థిరం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతిక ఫలాలను కేవలం ఓ ప్రాంతానికో లేదా వర్గానికో పరిమితం చేయకుండా అందరికీ చేరువ చేసేలా ఏజెంటిక్ ఏఐ వినియోగంపై ప్రధానంగా దృష్టి సారించామని పేర్కొన్నారు. టెక్నాలజీని కేవలం గవర్నెన్స్‌కు మాత్రమే పరిమితం చేయకుండా వ్యవసాయం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, సుస్థిర నగరాల అభివృద్ధి, క్లీన్ ఎనర్జీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర రంగాలకూ విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తెలంగాణ అవకాశాల గని :
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణలో ఎఐ పరిశోధలు, ఆవిష్కరణలకు ప్రభావశీలమైన టాలెంట్ పూల్ ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.శుక్రవారం నాడు ఆయన ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఏఐ సమ్మిట్‌లో స్వీడెన్ వాణిజ్య ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. కృత్రిమ మేథ వెల్లువ వల్ల ఎదురయ్యే సవాళ్లను, అది తీసుకువచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం ముందే సంసిద్ధమైందని తెలిపారు. దానికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ నిపుణుల నైపుణ్యాలు పెంచే కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. ఎఐ విస్తృతితో ఉద్యోగ విధుల్లో గణనీయమైన మార్పులు వస్తాయని, అందుకు అవసరమైన సన్నధను తమ ప్రభుత్వం మొదలు పెట్టిందని చెప్పారు. ఎఐ పరిశోధన కేంద్రాలు, అప్లికేషన్లు, సేవల వల్ల కొత్త ఉద్యోగాలు ఫుట్టుకొస్తాయని, దీనిని యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. యువత, వృత్తి నిపుణులు మరింత సృజనాత్మక బాధ్యతలు చేపట్టేందుకు ఎఐ అపారమైన అవకాశాలను సృష్టిస్తుందని, స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్ అనేది రెండేళ్లుగా తాము మంత్రంలా జపిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ సేవలు,
సంక్షేమ కార్యక్రమాల్లో ఎఐ వినియోగం వల్ల లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెరుగుతుందని, దుర్వినియోగానికి ద్వారాలను మూసివేస్తుందని చెప్పారు. ఇందుకు అవసరమైన అప్లికేషన్లను రూపొందించడం, నూతన ఆవిష్కరణలను చేపట్టేందుకు గ్లోబల్ టెక్ కంపెనీలు ముందుకు రావాలని కోరారు. కృత్రిమ మేథ ఫలాలను ప్రజలందరి వద్దకు చేర్చేందుకు ప్రతి గ్రామానికి ఇంర్నెట్ కనెక్టివిటీని అందించే బృహత్తర యజ్ణం ఇప్పటికే మొదలైందని వెల్లడించారు. టీ- ఫైబర్ ప్రతి గ్రామాన్ని ప్రంపచంతో కనెక్ట్ చేసేందుకు రెండేళ్లుగా శ్రమిస్తోందని అన్నారు. ఎఐ ఓ గేమ్ ఛేంజర్ అని, దాన్ని మచ్ఛిక చేసుకోవాలి.. మన నైపుణ్యాలకు పదును పెట్టుకుని దానిని నియంత్రణలోకి తెచ్చుకోవాలని పేర్కొన్నారు. పెట్టుబడులకు తెలంగాణా స్వర్గధామం లాంటిదని, కొత్తదనానికి రాష్ట్రం ఎప్పుడూ స్వాగతం పలుకుతూ ఉంటోందని వ్యాఖ్యానించారు. దీనికి అనుకూలమైన ఎకోసిస్టంను రాష్ట్రంలో అభివృద్ధి చేశామని, నిరంతర విద్యుత్తు సరఫరా, స్థిరమైన విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు.





