వాషింగ్టన్: నాకు అత్యంత ఇష్టమైన పదం టారిఫ్ అని ప్రకటించుకోవడమే కాకుండా… ఎడాపెడా సుంకాలు వేస్తూ ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా తన దారి కి తెచ్చుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. ఇప్పటి వరకు ట్రంప్ విధించిన సుంకాలు చెల్లబోవు అని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయా దేశాల వద్ద నుంచి వసూలు చేసిన అదనపు సుంకాలను తిరిగి వారికి చెల్లించాలని స్పష్టం చేసింది. ట్రం ప్ తన అధికారాలను అతిక్రమించారని మొట్టికాయలు వేసింది. దేశ వాణిజ్య భాగస్వాముల పై సుంకాలు విధించడం చట్ట విరుద్ధమని, అధికార పరిధిని మించిపోవడమేనని ఘాటైన వ్యా ఖ్యలు చేసింది. ఏకపక్షంగా సుంకాలు విధించడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. జాతీయ అ త్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన అత్యవసర వినియోగాల చట్టాన్ని అతిక్రమించారని అభిప్రాయపడింది. శుక్రవారంనాడు అమెరికా సుప్రీంకోర్టు ధర్మాసనం 6-3 తేడాతో ఈ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది.
1997 నాటి అంతర్జాతీయ అత్యవసర అధికారాల చట్టం(ఐఇఇపిఎ) ప్రకారం వాణిజ్య భాగస్వామ్య దేశాలపై విధించిన టారిఫ్‌లు చెల్లనేరవని స్పష్టం చే సింది. ‘సుంకాలను విధించే ప్రత్యేక అసాధారణ అధికారాన్ని చట్టసభ కాంగ్రెస్ ఐఇఇపిఎతో తెలియజేయాలనుకుంటే అది స్పష్టంగా చేసి ఉండేది. సుంకాలను, పన్నులను విధించే అధికారం అమెరికా రాజ్యాంగం కాంగ్రెస్‌కు మాత్రమే ఇస్తుంది, అధ్యక్షుడికి కాదు’ అని కుండబద్ధలు కొట్టింది. ఈ సుంకాలను ట్రంప్ కీలక ఆర్థిక, విదేశాంగ విధానాలకు సాధనంగా ఉపయోగించారని దుయ్యబట్టింది. దిగువ కోర్టుల తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు తీర్పును విపక్ష డెమొక్రాట్లు, పరిశ్రమ, వాణిజ్య వర్గాలు స్వాగతించాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో దూసుకెళ్లాయి. మరోవైపు సుప్రీం తీర్పుపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. తనదగ్గర ‘ప్లాన్ బి’ ఉందని వ్యాఖ్యానించారు. తద్వార టారిఫ్‌లపై వెనక్కి తగ్గేది లేదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
అప్పుడు ట్రంప్ ఏమన్నారంటే..?
2025, ఏప్రిల్‌లో ట్రంప్ జాతీయ అత్యవసర పరిస్థితి పేరిట దేశంలో వాణిజ్య లోటును పరిష్కరించడానికి చాలా దేశాలపై ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా ఆర్థిక భద్రతకు ఈ సుంకాలు ముఖ్యమని అభివర్ణించారు. లేకపోతే దేశం రక్షణ భారమవుతుంది, అది విధ్వంసానికి దారితీస్తుందని ప్రకటించారు. ఏప్రిల్ 2న శ్వేతసౌధంలో ‘మేక్ అమెరికా వెల్తీ అగేన్‘ అనే పేరుతో రోజ్ గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో పరస్పర సుంకాలపై వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఒక చార్ట్‌ను పట్టుకుని ఏయే దేశాలపై ఎంత మేరకు టారిఫ్‌లు విధిస్తున్నది ప్రకటించడం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. డిసెంబర్ నాటికి అత్యవసర అధికారాల చట్టం కింద అధ్యక్షుడు విధించిన దిగుమతి పన్నుల నుండి ట్రెజరీ 133 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిందని సమాఖ్య డేటా చూపిస్తుంది. మరోవైపు వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ వచ్చి ట్రంప్ భారత్‌ను కూడా వదిలిపెట్టలేదు. ఏకంగా 50శాతం టారిఫ్‌లు విధించిన ట్రంప్ సంప్రదింపులు, ఒప్పందం నేపథ్యంలో ఇటీవల వాటిని 18 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు ఎంత వసూలు అయింది?
కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం ప్రకారం, ట్రంప్ సుంకాల ఆర్థిక ప్రభావం వచ్చే దశాబ్దంలో సుమారు 3 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. అత్యవసర అధికారాల చట్టం కింద అధ్యక్షుడు విధించిన దిగుమతి పన్నుల నుండి ట్రెజరీ 133 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిందని డిసెంబర్ నుండి ఫెడరల్ డేటా చూపిస్తోంది. ప్రభుత్వం ఇతర మార్గాల్లో సుంకాలను తిరిగి విధించడానికి ప్రయత్నిస్తున్నందున ఈ తీర్పు తాత్కాలికమేనని పలువురు నిపుణులు భావిస్తున్నారు.





