Sirimalli

My WordPress Blog

జీవితపు అనుభవాలే నా కథలు.. నేను నా సాహితీ యాత్ర

నా బాల్యం ఒక తడి ఆరని గాయం: అందరికీ బాల్యం అమూల్యం. ఓ మధురమైన తీయని జ్ఞాపకం. నాకు మాత్రం అది ఒక తడి ఆరని గాయం. పేదరికం, అనారో గ్యంతో గడిచిన కాలం అది. ముక్కలు ముక్కలు గా రెండెకరాల భూమి గల వ్యవసాయ కుటుం బం మాది. అప్పులతో తిప్పలు పడుతున్న తల్లిదండ్రు లు, ఆరవ తరగతిలోనే ఆరు కిలోమీటర్లు అడవి మార్గంలో నడిచి చదువుకోలేక నాకు అనారోగ్యం పట్టుకుంది. అందుబాటులో వైద్యం లేక తొమ్మిద వ తరగతిలోనే బడిని మానివేశాను. ఆ అనుభవా లే తరవాత నా ఊట బాయి కథలకు ముడిసరుకయింది.

తొలితరం ఎడారి వలస కుటుంబం మాది మా ఊరిలో మా కుటుంబం మొదటి తరం వలస కుటుంబం. ఓవైపు నా ఆరోగ్యం బాగాలేక చదు వు మానేసి ఇంట్లో ఉన్నాను. బతుకు దెరువు లేక మాకు పిడికెడు తిండి పెట్టడానికి మా బాపు ఎడారి దేశం వలస వెళ్లాడు. ఆ వలస కూడా అంత సజావుగా సాగలేదు. ఏడాది పాటు ఊరికి, బొంబాయికి తిరిగి తిరిగి చివరికి ఎప్పుడు పేరు కూడా వినని హేమన్ దేశానికి వలస వెళ్లాడు. పోయాక పది నెలల వరకు జాడా లేదు పత్తలేదు. ఓ ఉత్త రం కూడా లేదు. మేమంతా చిన్న పిల్లలం. బాపు చనిపోయాడని అనుకున్నాము. మమ్మల్ని పట్టుకొని మా అమ్మ ఏడ్చిన ఏడుపు ఇప్పటికీ గుర్తు. ఆ అనుభవాలే ఎడారి మంటలు నవల, ఎండమావి నాటకం, వలసబతుకులు కథలకు ముడిసరుకయింది.

మా ఇంట్లో వీధి నాటకాలు ప్రాణం పోసుకున్నాయి మాది రెండు సంకల పెద్దిల్లు. మా అమ్మ వాళ్ళది అదే ఊరు. మా మేనమామలు ముగ్గురు ఊర్లోనే ఉండేవారు. మా నడిపి మామ ఓ నాటక మండలిని స్థాపించాడు. మా ఇంట్లో రిహార్సల్స్ జరుగుతుండేవి. మా బాపు కూడా నాటకాలు నేర్పిస్తూ ఉండేవాడు. నేను రాత్రంతా మేల్కొని ఆ నాటకాలను చూస్తుండే వాడిని. వాటిని మిత్రులతో కలి సి పొద్దంతా అనుకరించే వాడిని. ఆ కాలంలో ఆ వీధి బాగోతాలే మాకు వినోదాలు. అవసరమైనప్పుడు చిన్న, చిన్న పాటలను వచనాలను మారు స్తూ పాత్రలు రాస్తుండే వాడిని. తరువాత కాలం లో నేను కూడా ఒక నాట్య మండలిని స్థాపించి బ్రహ్మంగారి చరిత్రను చుట్టుపక్క గ్రామాల్లో 50 కి పైగా ప్రదర్శనలు ఇచ్చాము. ఆ నవ్వులు, ప్రేమలు, పగలు ప్రతీకారాలు తర్వాత మా ఊరి బాగోతం కథలుగా మారాయి.

వ్యవసాయం ఒక జూదం

అనారోగ్యంతో నా చదువు ఆగిపోయింది. బాపు గల్ఫ్ వెళ్ళాక వ్యవసాయం కూడా ఆగిపోయింది. బతుకు దెరువు కోసం నేను వ్యవసాయం మొదలుపెట్టాను. అప్పుడు నా వయసు పద్నాలుగేం డ్లు. అప్పుడపుడే సాంప్రదాయ వ్యవసాయ పద్ధతు లు మారి విత్తనాల కొనుగోళ్లు, పురుగు మందుల వాడకం మొదలయింది. వర్షాలు కావాలనుకున్నప్పుడు ఎండలు, వద్దనుకున్నప్పుడు వర్షాలు, వడగల్లతో, ఎండలతో పంట నష్టాలు, పురుగు మందులు, ధరలు లేకపోవడం, వ్యవసాయంలో నష్టాలు కష్టాలు అన్ని చూస్తూనే ఇంటర్ పూర్తి చేసాను. ఆ అనుభవాలే తర్వాత నేను రాసిన వ్యవసాయ కథలకు ముడిసరికి అయింది

ఉద్యమాలు రెండు-ఉద్దేశ్యం ఒక్కటే

మానేరు పరివాహక ప్రాంతంలో విముక్తి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగుస్తున్న కాలం అది. స మాంతర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. దొరలు భూ స్వాములు ఊర్లను విడచి పోతున్నారు. నా ఆరోగ్యం కుదుటపడి కొత్తగా వచ్చిన గంభీరావుపేట కాలేజీలో చేరాను. అప్పుడే నాకు పిడిఎస్‌యుతో పరిచయమైంది. ఆ పరిచయం చాలా ఏండ్ల వరకు కొనసాగింది. పీపుల్స్ వార్, జనశక్తి నువ్వా, నేనా అన్నట్టు ఉన్నా మా ఊర్లో మాత్రం జనశక్తి ప్రభావం ఎక్కువగా ఉండేది. ఒక్క వాల్ పోస్టర్‌తో ఊర్లకు ఊర్లు ఉలిక్కిపడేవి. ఆ చైతన్యం, ఆ మార్పులు తర్వాత కాలంలో కథల్లో అంతర్లీనంగా అల్లుకుని కథా వస్తువులు గా వచ్చాయి. రచయితగా ఎదుగుతున్న కాలంలోనే తెలంగాణ ఉద్యమం మొదలైంది. దానితో స మాంతరంగా నడిచాను. ఉవ్వెత్తున సాగిన ఉ ద్యమం నా కలానికి పదును పెట్టింది. ఉద్యమ నేపథ్యాన్ని వివరిస్తూ కొన్ని కథలను లాంగ్ మార్చ్ నవలను రాశాను.

గుండె బరువు దించుకోవడానికి కథలు రాసాను

ఉద్యమాలు ప్రైవేట్ ఉద్యోగాలు చదువులు వీటన్నింటిని ముగించుకొని 1996లో ఉపాధ్యాయ ఉద్యోగంలోకి చేరి ఊరిలోకి వచ్చాను. అప్పటికి ఊరికి నాకు ఎడబాటు ఓ నాలుగైదు సంవత్సరాలు. ఈ అనతి కాలంలోనే ఊరిలో జరగాల్సిన మార్పులన్నీ జరిగిపోయాయి. ఊరు ఊరంతా ఎర్రటి ఎండల ఎడారి దేశాల్లో వలతేరుతుంది. కొత్త ఏజెంట్లు పుట్టుకొచ్చారు. అంతవరకు ఒకటి రెండు ప్రేమ కథలు తప్ప పెద్దగా రాసింది లేదు. వ్యాపార సాహిత్యం తప్ప పెద్దగా చదివింది లేదు. ఆ మార్పులను, బాధలను చూసి తట్టుకోలేక కలం పట్టాను. అదిగో అప్పుడు నన్ను నేను తవ్వుకున్నా ను. గతం తాలూకు పుట్ట చెదిరింది. నడిచి వచ్చిన నా జీవితాన్ని, నడుస్తున్న ఊరి చరిత్రని, బాధను, ఉగ్గబట్టుకొని వలసకు సంబంధించిన ‘ఆశ నిరాశ ఆశ’ ‘కన్న తల్లి’ అనే కథలతో 1999 లో కథకుడిగా మొదలయ్యాను. ఇప్పటికి 300 క థలు, ఏడు నవలలు, 10 కథా సంకలనాలు, 5 నాటకాలు, 100కు పైగా వ్యాసాలు రాసాను.

నేను నా అనువాదాలు

నేను కథలు రాస్తున్న తొలి కాలంలోనే, అనువాదాలు అంతగా తెలియని ఆ కాలంలోనే, శాంతా సుందరి గారు నా పిల్ల జలగ అనే కథను హిందీలోకి అనువాదం చేశారు. తర్వాత కాలంలో ఆమె నా ఇరవై ఐదు కథలను హిందీలోకి అనువాదం చేశారు. ‘ఓ అక్రమన్ కబ్ కా హో చుకా’ పేరుతో హిందీలో కథల సంపుటి వచ్చింది. వోగర్ బంద్ డాలియా పేరుతో అవే కథలు మరాఠీ లోకి అనువాదం అయ్యి సంపుటిగా వచ్చాయి. కన్నడలోకి 12 కథలను అనువాదమై ‘జాల’ పేరుతో సంపుటిగా వచ్చాయి. జిగిరి నవల మొదట హిందీలోకి అనువాదమైంది. తర్వాత 12 భారతీయ భాషల్లోకి అనువాదమైంది.

చివరగా రెండు మాటలు

అవార్డులు రివార్డులు చాలానే తీసుకున్నాను. అన్నింటికంటే అత్యధికంగా తృప్తినిచ్చినది నా రచనలు యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉండడం. నేను రాసిన పిహెచ్‌సిడి పరీక్షలో నా రచన నాకే ప్రశ్నగా రావడం. నా నవలను నేనే పాఠ్య పుస్తకంగా చదువుకోవడం. చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. పాఠశాలనే నా ప్రయోగశాల. మా ఊరే నా కథల కార్యశాల. పాఠాలు చెప్పడం, కథల రాయడం, కొత్తవాళ్ళతో కథలు రాయించడం చాలా ఇష్టం. రచయితగా ఎంత నిబద్ధతతో రాసానో ఉపాధ్యాయుడిగా అంతే నిబద్దతతో పని చేసాను. ప్రధానోపాధ్యాయుడిగా ఇల్లంతకుంట మండలం రామాజిపేట గ్రామంలో నా పని తీరుపై నేనే ప్రజల మధ్యలో మీడియా ముందు రెఫరెండం పెట్టుకున్నాను. ఇది విద్యా వ్యవస్థలో అరుదైన అంశం. సీనియర్ సిటిజన్స్‌తో పాఠశాలలో ప్రవేశ పెట్టిన ‘అనుభవ పాఠాలు’ కూడా ఒక కొత్త ప్రయోగం. కథలు రాయడంపై వివిధ యునివర్సిటీలలో, డిగ్రీ కాలేజీలలో వర్క్ షాపులు నిర్వహించాను.

– పెద్దింటి అశోక్ కుమార్