మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా హైదరాబాద్ నిలిచిందని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో బయో ఏషియా ప్రారంభమైనప్పుడు, హైదరాబాద్ అం టే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ ,సాఫ్ట్వేర్ నగరం అన్న గుర్తింపు ఉండేదని, కానీ, ఇప్పుడు గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మా రిందన్నారు. మంగళవారం హైదరాబాద్ హైటె క్స్ వేదికగా జరుగుతున్న బయో ఆసియా సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దూరదృష్టి గల నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో మాన వ వనరులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల కారణంగానే హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు, పరిశోధన, డిజైన్‌లో విశిష్టతకు ప్రపంచ కేంద్రం గా ఎదిగిందన్నారు. రెండు సంవత్సరాల్లోనే లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.73,000 కోట్లకు పైగా పె ట్టుబడులు వచ్చాయన్నారు. కొద్ది వారాల క్రితం దావోస్‌లో మా కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించామని సిఎం చెప్పారు. జీనోమ్ వ్యాలీని విస్తరించామన్నారు. ప్రపంచ స్థాయి పరిశోధన, ఆవిష్కరణలకు వన్-బయోను ప్రారంభించామన్నారు. గ్రీన్ఫార్మా సిటీని వేగవంతం చేశామని, అనేక గ్లోబల్ కేపబులిటీ సెంటర్లను ఆహ్వానించామన్నారు.
ఇది సాధారణ అభివృద్ధి కాదని ఇది దృఢమైన విజన్ ఫలితమని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మా సక్సెస్‌కు బయోఏషియా -2026 ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. బయోఏషియా తన పేరును దాటి బయో-వరల్డ్‌గా మారుతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4,000 మందికి పైగా ప్రతినిధులు ఇక్కడ హాజరయ్యారని ఆయన తెలిపారు. ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, ఆరోగ్య రంగాల్లో ప్రముఖులు, బిజినెస్ లీడర్స్ మనతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సైన్స్, ఏఐ, బయోటెక్ వంటి రంగాల్లో ప్రముఖులను కలిసినప్పుడు అసాధారణమైన ఫలితాలు వస్తాయన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బయోఏషియా సదస్సు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఇటీవల తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ప్రకటించామని 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగడం మా లక్ష్యమని చెప్పారు.
బల్క్ డ్రగ్స్ నుంచి బయాలజిక్స్ వరకు
ప్రస్తుత జీవ విజ్ఞాన ధోరణులను చూస్తే పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్‌లు చిన్న మధ్య తరహా సంస్థలు , ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరం అన్నారు. మీరు విశ్వసనీయమైన, స్థిరమైన, భవిష్యత్ కోసం మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నారని ఈ సౌకర్యాలు తెలంగాణ అందిస్తోందన్నారు. బల్క్ డ్రగ్స్ నుంచి బయాలజిక్స్ వరకు, తయారీ నుంచి ఆవిష్కరణ వరకు, భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. తాము కేవలం భారతదేశంలోనే పోటీ పడటం లేదని, ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతున్నామని సిఎం అన్నారు. హైదరా బాద్ ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రాధాన్య గమ్యస్థానంగా మారిందని, ఇప్పుడు మనం కలిసి దీనిని సమగ్ర జీవవిజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని మీ జీసిసిలను స్థాపించి, ఆవిష్కరణ కేంద్రాలను నిర్మించాలని సిఎం పిలుపునిచ్చారు. మాలిక్యుల్స్, ఔషధాలను డిజైన్ చేయాలని, క్లినికల్ అనలిటిక్స్‌ను నడపాలన్నారు. ఏఐ ప్లాట్‌ఫాంలను అభివృద్ధి చేసి, డిజిటల్ తయారీని ముందుకు తీసుకెళ్లాలని సిఎం రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. తమ ప్రభుత్వం, అధికారులు, శాస్త్రవేత్తలు, నైపుణ్యంతో కూడిన యువత మీ విజయానికి భాగస్వాములుగా ఉంటారని సిఎం చెప్పారు. మనమంతా కలిసి పనిచేస్తే హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న స్థితి నుంచి ప్రపంచ జీవ విజ్ఞాన రాజధానిగా ఎదిగేలా చేద్దామన్నారు. ప్రపంచ అవసరాలకు తెలంగాణ సిద్ధంగా ఉందని, తెలంగాణ అంటే బిజినెస్ అని ఆయన చెప్పారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో మీరంతా భాగస్వాములు కావాలని సిఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
పెట్టుబడులు పెట్టే వారికి సహకారం అందిస్తాం
ఈ సదస్సులో మాట్లాడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ లైఫ్ సైన్సెస్ రంగంలో గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులు, కంపెనీలు పెట్టాలని యోచించే గ్లోబల్ ఇన్వెస్టర్లకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే ఎన్నో లైఫ్ సైన్సెస్ కంపెనీలు హైదరాబాద్‌లో జీసీసీ (గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్)లను ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. ఇదే విషయమై మరింత లోతుగా దృష్టి సారించడానికి, గ్లోబల్ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ఇన్నోవేషన్ సెంటర్లను సులభతరం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఫ్యూచర్ సిటీలో జిసిసిల కోసం ఒక ప్రత్యేక జోన్‌ను నిర్మించాలని సిఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.
ప్రకటించిన పెట్టుబడుల వివరాలు ఇలా….
ఫ్రాన్స్‌లోని తన ప్రపంచ ప్రధాన కార్యాలయంతో సనోఫీ నుంచి విడిపోయిన గ్లోబల్ కన్స్యూమర్ హెల్త్‌కేర్ కంపెనీ ఒపెల్లా హెల్త్‌కేర్, దాని జిసిసి కార్యకలాపాలను 42,000 చదరపు అడుగుల సౌకర్యంతో విస్తరిస్తోంది. వచ్చే ఏడాదిలోపు 500 ఉద్యోగాలను ఈ కంపెనీలను సృష్టించనుంది. జీఏపిఎఫ్ఏ ఇండోనేషియా విభాగమైన వాక్సిండో యానిమల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, జీనోమ్ వ్యాలీలో ఆధునిక బిఎస్ఎల్-3 వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం కోళ్లు, పశువులు, స్త్వ్రన్, ఆక్వాకల్చర్ కోసం వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించనుంది. ఏఐ, డేటా సైన్స్ కంపెనీగా పేరొందిన ట్రెడెన్స్ ఐఎన్‌సీ, ఏఐ- ఆధారిత హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ పై కీలక సేవలు అందించిన సంస్థ హైదరాబాద్‌లో కార్యకలాపాలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ కేంద్రం సుమారు 18,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, దీనిలో ప్రపంచ స్థాయి కార్యకలాపాలను నిర్వహించ తలపెడుతోంది. దీంతో ఏఐ ఆధారిత హెల్త్ కేర్ రంగంలో మరింత ఆధునికత రానుంది. భారతదేశ లైఫ్ సైన్సెస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ హైదరా బాద్‌లోని జీనోమ్ వ్యాలీలో భారీ స్థాయిలో ఫార్మాట్ లైఫ్ సైన్సెస్ క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు 12 ఎకరాల స్థలంలో విస్తరించి 1 మిలియన్ చదరపు అడుగుల అడ్వాస్డ్ ల్యాబ్, మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. ఇది రాబోయే ఆరు సంవత్సరాల్లో మరింత విస్తృతం కానుందని ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.





