వైస్ చైర్మన్‌గా పల్లెర్ల వెంకన్న
పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నిక
మున్సిపల్ పీఠంపై మూడో మహిళా చైర్మన్
చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను సన్మానించి శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే సామేల్ .
మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ చైర్మన్‌గా గడ్డం స్వప్నసోమనర్సయ్య, వైస్ చైర్మన్‌గా పల్లెర్ల వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మున్సిపల్ కేంద్రంలోని పాత గ్రామపంచాయతీ భవనంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులకు గాను కాంగ్రెస్ 8 వార్డులు, బీఆరఎస్ 3 వార్డులు, ఒక ఇండిపెండెంట్ గెలుపొందారు. కాంగ్రెస్ తమ కౌన్సిలర్లకు విప్ జారీ చేయడంతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎంపిక చేసి బీఫాంలు అందజేశారని, విప్‌ను ధిక్కరిస్తే సభ్యులు అనర్హతకు గురవుతారని మున్సిపల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ సురేష్ ప్రకటించారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం పూర్తి కోరం ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు పల్లెర్ల వెంకన్న, కుర్మిళ్ల ప్రమీల, గడ్డం స్వప్న, గనగాని శైలజ, పన్నాల శ్రీవిద్య, బీసు శ్రీకాంత్, కారుపోతుల వెంకన్న, మెంట రమణ, బీఆరఎస్ కౌన్సిలర్లు సుల్తాన్ స్వామి, కొండ శోభ, నల్ల మధు, ఇండిపెండెంట్ మొగుళ్ల అనురాధ హాజరయ్యారు.
చైర్మన్ కోసం ఎన్నిక నిర్వహించగా 8వ వార్డు కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య 6వ వార్డు కౌన్సిలర్ గడ్డం స్వప్నను ప్రతిపాదించగా 7వ వార్డు కౌన్సిలర్ గనగాని శైలజ బలపర్చారు. పోటీ లేకపోవడంతో మెజార్టీ కోరంతో గడ్డం స్వప్న చైర్మన్‌గా ఎన్నికైనట్టు ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ సురేష్ ప్రకటించారు. అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించగా 11వ వార్డు కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న 1వ వార్డు కౌన్సిలర్ పల్లెర్ల వెంకన్నను ప్రతిపాదించగా 9వ వార్డు కౌన్సిలర్ బీసు శ్రీకాంత్ బలపర్చారు. పోటీ లేకపోవడంతో వైస్ చైర్మన్‌గా పల్లెర్ల వెంకన్న ఎన్నికైనట్టు ప్రకటించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించి ఎన్నికల ఆఫీసర్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ముగిసే వరకు కూడా ముగ్గురు బీఆరఎస్ కౌన్సిలర్లు సమావేశంలోనే కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ పీఠంపై మూడో మహిళా చైర్మన్
మోత్కూరు మున్సిపల్ పీఠంపై మూడో మహిళా చైర్మన్ కొలువుదీరారు. మోత్కూరు మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత రెండోసారి ఎన్నికలు జరిగాయి. 2018 ఆగస్టు 2న కొత్త మున్సిపాలిటీగా ఏర్పడగా 2020 జనవరిలో ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా ఆ ఎన్నికల్లో బీఆరఎస్ 7 స్థానాల్లో గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. చైర్మన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కాగా తొలి మున్సిపల్ చైర్మన్‌గా తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి ఎన్నికయ్యారు. 2023లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, మున్సిపాలిటీలో మారిన రాజకీయ సమీకరణాలు, కౌన్సిలర్ల అసంతృప్తితో చైర్మన్ సావిత్రిమేఘారెడ్డిపై అవిశ్వాసం పెట్టారు.
అవిశ్వాసంతో సావిత్రిమేఘారెడ్డి చైర్మన్ పదవి కోల్పోగా, కాంగ్రెస్ కౌన్సిలర్ గుర్రం కవితలక్ష్మీనర్సింహారెడ్డి చైర్మన్ అయ్యారు. కౌన్సిల్ ఐదేళ్ల పదవీకాలంలోనే ఇద్దరు మహిళలు చైర్మన్ పదవి చేపట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో 8 వార్డుల్లో గెలిచిన కాంగ్రెస్ మున్సిపాలిటీని కైవసం చేసుకోగా 6వ వార్డు (ఎస్సీ జనరల్) నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్‌గా గెలుపొందిన గడ్డం స్వప్నసోమనర్సయ్య మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. దీంతో ముగ్గురు మహిళలు చైర్మన్ పదవుల్లో కొలువుదీరినట్టు అయ్యింది. కాంగ్రెస్‌లో చైర్మన్ పదవి కోసం 12వ వార్డు కౌన్సిలర్ మెంట రమణనగేష్, వైస్ చైర్మన్ పదవి కోసం 9వ వార్డు కౌన్సిలర్ బీసు శ్రీకాంత్ తీవ్రంగా పోటీ పడినప్పటికీ ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరిని బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. పోయిన సారి వైస్ చైర్మన్ పదవి బీసీకి దక్కగా, ఈసారి వైస్ చైర్మన్ పదవి వైశ్య సామాజికవర్గానికి దక్కింది.
కౌన్సిలర్లను సన్మానించిన ఎమ్మెల్యే సామేల్
సమావేశం ముగిసిన అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చైర్మన్ స్వప్న, వైస్ చైర్మన్ వెంకన్నతో పాటు కాంగ్రెస్, బిఆరఎస్ కౌన్సిలర్లను సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ను నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేశామని, మెయిన్ రోడ్డు, అంగడి బజారు సీసీ రోడ్డు చేశామని, పెద్ద చెరువులో కలుస్తున్న డ్రైనేజీని మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, బృందావన్ కాల్వ వెంట ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో కాల్వను శుభ్రం చేయిస్తామన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశంతో మున్సిపాలిటీని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.





