Sirimalli

My WordPress Blog

ఎకరం 99పైసలా?

గుప్పెడు శనగలు కూడా రావు
కార్పొరేట్లకు భూ పందేరంపై మండలిలో నిలదీత
నిరాధార ఆరోపణలు : లోకేష్‌
వాకౌట్‌ చేసినవైసిపి సభ్యులు

అమరావతి : పరిశ్రమలు, ఉపాధి పేరుతో ఎకరం భూమిని 99 పైసలకు కార్పొరేట్లకు పందేరం చేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై శాసనమండలిలో ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి సభ్యులు తూమాటి మాధవరావు,వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు తదితరులు గత 20 ఏళ్ల కాలంలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలకు ఎకరం 99 పైసలకు కేటాయించిన భూముల వివరాలు తెలియజేయాలంటూ అడిగిన ప్రశ్నకు మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్‌ ఇచ్చిన సమాధానంపై సభలో తీవ్రస్థాయిలో చర్చ సాగింఇ. మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ విశాఖలో ఐదు కంపెనీలకు ఎకరం 99 పైసలకు భూములు కేటాయించిన మాట వాస్తవమేనని చెప్పారు. వైసిపి సభ్యుడు తూమాటి మాధవరావు మాట్లాడుతూ కంపెనీలు పెడతారో లేదో తెలియదని, వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దాదాపు ఉచితంగా బడా కంపెనీలకు ఎలా అప్పచెబుతారని ప్రశ్నించారు.

అదే మాదిరి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు భూములు ఇచ్చి వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇస్తారా అని ప్రశ్నించారు. వరదు కల్యాణి మాట్లాడుతూ విశాఖపట్నంలో 99 పైసలు ఏ వస్తువు దొరకదని, గుప్పెడు పల్లీలు,శనగలు, కప్పు టీ నీళ్లు కూడా ఇవ్వరని ఎద్దేవా చేశారు.. ఇప్పుడు సిఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు కంపెనీలు, ఉపాధి ముసుగులో రూ.5 వేల విలువైన భూములను కబ్జా చేశారని ఆరోపించారు. విశాఖలో రహేజా రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు 99 పైసలకే 27.1 ఎకరాలను ఎలా కేటాయిస్తారని వైసిపి సభ్యులు మాధవరావు, వరుదు కల్యాణి ప్రశ్నించారు. అడ్రస్‌ లేని ఉర్సా కంపెనీకి 99 పైసలకే భూములు కట్టబెట్టాలని ప్రయత్నించారని ఆరోపించారు. భూముల కేటాయింపుల్లోపారదర్శకత లేదని, విశాఖలో వారి కుటుంబానికి ఏ విధంగా భూములు కేటాయిస్తారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైసిపి సభ్యులు సభ నుండి వాకౌట్‌ చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూయువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని అన్నారు.

20 లక్షల ఉద్యోగాలు సృష్టించాలన్నదే తమ ధ్యేయం అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదనే లక్ష్యంతో వైసిపి ఉందన్నారు. విశ్వసనీయత ఉన్న కంపెనీలకే రూ.99 పైసలకు భూములు కేటాయించామని లోకేష్‌ తెలిపారు విశాఖలో ఐదు కంపెనీల ద్వారా 65వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. భూముల కేటాయింపుల్లో తమకు ఎక్కడా లాలూచీ పడాల్సిన అవసరం లేదన్నారు. ఒక కప్పు కాఫీ కంటే నేను వారి వద్ద ఎక్కువ తీసుకుని ఉంటే నిరూపించాలన్నారు ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, కాగ్నిజెంట్‌, ఏఎన్‌ఎస్‌ఆర్‌ గ్లోబల్‌, రహేజా, మదర్సన్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలకు 99 పైసలకే మొత్తం భూములు కేటాయించినట్లు చెప్పారు. తాము 5 కంపెనీలకే 99 పైసలకు భూములు కేటాయించామని, ఆరో కంపెనీ పేరు ప్రస్తావించినందున ఆధారాలు బయట పెట్టాలని, ఆరోపణలు చేసి బయటకు వెళ్లడం కాదని అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకే పరిశ్రమలకు తక్కువ రేటుకు భూములు ఇస్తున్నామని చెప్పారు. ఉర్సా విషయంలో ఆరోపణలను నిరూపించాలని సవాల్‌ చేశారు..

The post ఎకరం 99పైసలా? appeared first on Navatelangana.