Sirimalli

My WordPress Blog

ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి కోసం రెండు కీలకమైన సంక్షేమ పథకాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న సుదీర్ఘంగా జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం, ఈ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు.

కొత్తగా ప్రవేశపెట్టనున్న పథకం ప్రకారం, 60 ఏళ్లలోపు సర్వీసులో ఉన్న ఉద్యోగి సహజంగా మరణిస్తే, వారికి అందే రెగ్యులర్ ప్రయోజనాలతో పాటు అదనంగా రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ అందించనున్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే కోటి రూపాయలకు పైగా పరిహారం ఇచ్చేలా మరో పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ బీమా పథకాలకు ఉద్యోగుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

దీంతో పాటు, ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన క్యాష్‌లెస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్‌ (EHS)కు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీని కింద ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 17 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి 1.5 శాతం చెల్లించనుండగా, అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఈ నిధులతో ఏర్పాటు చేసే ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలోని 652 ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందిస్తారు. లబ్ధిదారులందరికీ డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నిర్ణయాలతో సుమారు 7.56 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

The post ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం appeared first on Navatelangana.