Sirimalli

My WordPress Blog

ఉద్యోగులకు భరోసా

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగు లు, పింఛనర్ల నగదు రహిత చికిత్స పథకం(క్యాష్ లె స్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్) కేబినెట్ ఆమోదం తెలిపిం ది. దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూస్తు న్న కోరికను సోమవారం రాష్ట్ర కేబినెట్ నెరవేర్చింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు క్యాష్‌లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (ఇహెచ్‌ఎస్) అమలు చేయాలని నిర్ణ యం తీసుకుంది. 3లక్షల 56వేల మంది ప్రభుత్వ రె గ్యులర్ ఉద్యోగులతో పాటు 2.88లక్షల మంది పెన్షనర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు మొత్తం 17.07 లక్షల మందికి ఈ పధకం వర్తిస్తుంది.ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఆసుపత్రుల్లో ఒక్క రూపాయి చెల్లించకుండానే వైద్య చికిత్సలు అందుతాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 652 ఎంప్యానెల్ ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఈ పథకం వర్తిస్తుంది. దీనిపై మొత్తం 1998 వైద్య చికిత్సలు అందిస్తారు. ప్రతి ఉ ద్యోగికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డ్ అందిస్తారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఉ ద్యోగులకు ఈ ఉచిత నాణ్యమైన వైద్యం అందించాల ని కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకానికి ప్రభుత్వ ఉ ద్యోగులు తమ బేసిక్ పే నుంచి 1.5 శాతం తమ వా టాగా చెల్లిస్తారు. అంతే సమాన వాటాను ప్రభుత్వం మ్యాచింగ్ వాటా చెల్లిస్తుంది. ఏడాదికి ఉద్యోగులు రూ.528 కోట్లు తమ వాటాగా చెల్లిస్తే.. ప్రభుత్వం కూడా రూ.528 కోట్లు వాటా చెల్లిస్తుంది. మొత్తం రూ.1056 కోట్లతో 

క్యాష్‌లెస్ ఎంప్లాయి హెల్త్ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం. కుటుంబ భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో భరోసా, నమ్మకం కల్పిస్తుందనడానికి ఈ పధకాలు నిదర్శనమని కేబినెట్ మొత్తం హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం.. భద్రతకు రాష్ట్రమంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోనే ఆదర్శవంతమైన కొత్త పథకాలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు రెండు కొత్త పథకాలను ప్రారంభిస్తుంది. సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా శాసనసభ బడ్జెట్ సమావేశాలు, ఉద్యోగులు, పింఛనర్ల నగదు రహిత చికిత్స పథకం, హైదరాబాద్ మెట్రోను ఎల్ అండ్ టి నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవడం తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.

ఉద్యోగులు, పెన్షనర్లందరికీ ప్రమాద బీమా పథకం

దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ ప్రమాద బీమా పథకం అమలు చేస్తుంది. ఉద్యోగులు ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించకుండా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా సింగరేణిలో, ట్రాన్స్ కోలో ఉద్యోగ వర్గాలకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి, అక్కడ విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అందరికి ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది. ఈ ప్రమాద బీమా అమలుతో ఒకవేళ ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.1.2 కోట్లు ప్రమాద బీమా పరిహారం అందుతుంది. సహజ మరణానికి 60 ఏళ్ల వరకు ఉద్యోగులకు రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5 లక్షల 19 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులున్నారు. వీరితో పాటు 2 లక్షల 38 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తం 7.57 లక్షల మందికి ఈ ప్రమాద బీమా వర్తిస్తుంది.అటు ఉద్యోగులు, ఇటు ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా బ్యాంకర్ల ద్వారా బీమా అమలు చేయాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయించింది. ————

టివివిపిను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్పు

రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ హాస్పిటళ్లలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను (టివివిపి) డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా(డిఎస్‌హెచ్) మార్చాలని నిర్ణయించింది. డిఎస్‌హెచ్ బిల్లు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో ఇన్నాళ్లు అటానమస్ వ్యవస్థగా ఉన్న టివివిపికి, పూర్తిస్థాయి ప్రభుత్వ విభాగ హోదా లభిస్తుంది. నిధుల కేటాయింపులో ప్రాధాన్యం పెరుగుతుంది. సర్జికల్స్, మెడిసిన్స్ కొనుగోలు వేగంగా జరుగుతుంది. డాక్టర్లు, సిబ్బందికి సకాలంలో వేతనాలు అందడంతో వైద్య సేవలు మెరుగుపడుతాయి. వైద్య ఆరోగ్య శాఖలో కీలక సంస్కరణలు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో వివిధ విభాగాల పరిధిలో ఉన్న అన్ని ఆసుపత్రుల నిర్వహణ సమర్థవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని చర్చించింది. అవసరమైన కొత్త విధానాలపై అధ్యయనం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయ, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డిని కమిటీలో నియమించి వారి సలహాలు సూచనలు తీసుకుంటారు. ఆసుపత్రుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టేందుకు హాస్పిటళ్లలో మెడికల్ సర్వీసెస్‌ను, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వేరుగా విభజించే ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.

హెచ్‌ఎండిఎ పరిధిలోకి మరో నాలుగు గ్రామాలు

హెచ్‌ఎండిఎ విస్తరణలో భాగంగా మరో నాలుగు గ్రామాలను హెచ్‌ఎండిఎ పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వికారాబాద్ జిల్లాలోని నవాబ్ పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్ పేట మండలం ఎంకతాల గ్రామాలను హెచ్‌ఎండిఎ పరిధిలో చేర్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాంప్రెహేన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (సిఆర్‌ఎంని ఫేజ్ 2) చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ఫేస్ 1లో ఉన్న 744 కిలోమీటర్లకు అదనంగా 300 కిలోమీటర్ల రోడ్లను ఫేస్ 2లో అభివృద్ధి, మెయింటెనెన్సు చేస్తారు. రూ. 3145 కోట్ల జిహెచ్‌ఎంసి నిధులతో ఈ ప్రాజెక్ట్ చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేస్ 1, ఫేస్ 2 ఆధునీకరణ ప్రాజెక్ట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ జలమండలి ప్రతిపాదనల మేరకు రూ. 722 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పనులకు నిర్ణయం తీసుకుంది. రూ. 282 కోట్లతో ఉస్మాన్ సాగర్ మంచినీటి పైప్ లైన్ ఆధునీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాలం చెల్లిన పైపులు, పంప్ హౌస్‌ల కారణంగా దాదాపు 30 శాతం నీటి సరఫరాలో నష్టం వాటిల్లుతోంది. ఇప్పుడున్న ప్రాజెక్టు ఆధునీకరిస్తే ఈ పరిస్థితి ఆదిగమించటంతో పాటు హైదరాబాద్ సిటీలో నీటి సరఫరా మెరుగుపడుతుంది.

ఎల్ అండ్ టి నుంచి మెట్రోను స్వాధీనానికి నిర్ణయం

హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతమున్న 69 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థను ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. వెంటనే అందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ స్వాధీనం, సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కేబినేట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినేట్ సుదీర్ఘంగా చర్చించింది. అవసరమైతే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశంపై చర్చించాలని నిర్ణయం తీసుకుంది. మెట్రో ఫేజ్ 2 విస్తరణ పనులను వేగంగా ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది.కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్లో చేపట్టే ఫేజ్- 2 విస్తరణకు మొత్తం మెట్రో నెట్‌వర్క్ ఒకే సంస్థ ఆధ్వర్యంలో ఉండాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మెట్రో ఫేజ్ 1 నిర్వహిస్తున్న ఎల్ అండ్ టి మెట్రో ఫేజ్-2 విస్తరణ చేపట్టేందుకు విముఖత ప్రదర్శించింది. సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్, మెట్రో విస్తరించాల్సిన అవసరాల దృష్ట్యా ప్రభుత్వం మెట్రో ఫేజ్ 1ను ఎల్ అండ్ టి నుంచి స్వాధీనం చేసుకోవటం అనివార్యమైంది. రుణబారం సహా మొత్తం రూ.15 వేల కోట్లకు ప్రభుత్వం ఎల్ అండ్ టీకి చెల్లించి ఫేజ్ 1 ప్రాజెక్టు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని సబ్ కమిటీ తమ నివేదికను కేబినెట్ ముందుంచింది. ప్రస్తుతం మెట్రో ఆస్తుల విలువ దాదాపు రూ.19 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. దాదాపు 22 శాతం తగ్గింపు ధరకు ప్రభుత్వ మెట్రో ఫేజ్ 1ను సొంతం చేసుకుంటుంది. ఫేజ్- 2ఎలో భాగంగా 5 కొత్త కారిడార్లలో 76.4 కిలోమీటర్లు, ఫేజ్- 2బిలో 3 కారిడార్లలో 86.1 కి.మీ.ల మెట్రో విస్తరణ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి పంపించింది. ఈ నిర్ణయంతో మెట్రో విస్తరణ వేగవంతమవనుంది.

ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం

రంగారెడ్డి జిల్లా కోహెడలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.అందుకు అవసరమైన 223.09 ఎకరాల భూమిని టిజిఐఐసి బదలాయించాలని నిర్ణయం తీసుకుంది. టిజి హౌసింగ్ బోర్డు ఆధీనంలో ఉన్న 239 ఎకరాలను ప్రపం స్థాయి ప్రమాణాలతో కూడిన పండ్ల మార్కెట్ ఏర్పాటుకు వ్యవసాయ మార్కెటింగ్ విభాగానికి రాష్ట్ర క్యాబినెట్ కేటాయించింది.

గుమ్మడూరులో ఇంజనీరింగ్ కాలేజీకి 70 ఎకరాలు

మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం గుమ్మడూరులో జెఎన్‌టియు అధ్వర్యంలోని ఇంజనీరింగ్ కాలేజీకి 70 ఎకరాలు, శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లో 36 ఎకరాలను కేటాయించింది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మెదక్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణానికి భూములు కేటాయించింది. హైదరాబాద్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు అవసరమైన 42 ఎకరాలను రక్షణ శాఖ (ఢిపెన్స్ ల్యాండ్) నుంచి తీసుకున్నందున సమాన విలువైన భూముల కింద రక్షణ శాఖకు కాప్రా మండలంలో 153 ఎకరాలు కేటాయించేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

టిటిడికి 20 ఎకరాలు కేటాయింపు

భద్రాచలంలో గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియం నిర్మాణానికి 5 ఎకరాల భూమిని రాష్ట్ర క్యాబినెట్ కేటాయించింది. తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య క్షేత్రం నిర్మాణానికి ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురం గ్రామంలో 20 ఎకరాలు కేటాయించింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణానికి 3 ఎకరాల 12 గుంటలను దేవాదాయ శాఖకు కేటాయించింది. హెచ్‌ఎండిఎ పరిధిలోని నియోపోలీస్ పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరాకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు గండిపేట మండలం కోకాపేటలో శారద పీఠానికి చెందిన స్థలాన్ని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ అండ్ సీవరేజీ బోర్డుకు కేటాయించడంతో పాటు శారద పీఠానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు

క్యూర్ ఏరియాలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల దగ్గర నిర్మించిన షాప్స్ వేలం వేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులను రాబట్టుకోవడానికి ప్రయత్నించాలని చర్చించింది. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 300 మెగావాట్ల విద్యుత్తు వినియోగించే డేటా సెంటర్లకు రెన్యుబుల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఇచ్చేందుకు కేబినేట్ ఆమోదించింది.

మే 11 నుంచి ఇండ్ల గణన

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జన గణన 2027ను చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది. నిర్ణిత షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) రాష్ట్రంలో మే 11వ తేదీన ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హౌజ్ లిస్టింగ్‌కు కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనాను వివరించారు. రాష్ట్రంలో ఎన్యుమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు మొత్తం 89 వేల మంది ఉద్యోగులు జన గణన ప్రక్రియలో పాలుపంచుకుంటారు. రెండో దశ వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరిలో చేపడుతారు.