Sirimalli

My WordPress Blog

అమెరికా డీల్‌పై ఎన్నో సందేహాలు

భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడే శుభసంకేతాలు కనిపిస్తున్నాయి. భారతీయ ఉత్పత్తులపై సుంకాల భారం 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్టు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారని భారత ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా వహించిన సహనమే తుదకు జయించిందని అభివర్ణించారు. ట్రంప్ ప్రకటించినట్టు సుంకాల తగ్గింపు అమలు లోకి వస్తే అమెరికా మార్కెట్‌లో భారతీయ ఎగుమతుల పోటీతత్వం గణనీయంగా పెరగనుంది. ఎందుకంటే బంగ్లాదేశ్, వియత్నాం, శ్రీలంక, పాకిస్థాన్ దేశాలపై 19 శాతం నుంచి 20 శాతం వరకు అమెరికా సుంకాల విధింపు ఉండగా, చైనాపై 34 నుంచి 37 శాతం వరకు సుంకాల భారం ఉంటోంది. అందువల్ల ఈ దేశాలతో పోలిస్తే భారత ఉత్పత్తులు అమెరికా మార్కెట్‌లో చవకగా లభిస్తాయి.

ముఖ్యంగా ఫార్మా, ఎలక్ట్రానిక్స్, వస్త్ర పరిశ్రమల ఉత్పత్తులు ఊపందుకుంటాయి. అంతవరకు బాగానే ఉంది. మొదట కొత్త సుంకాలు తక్షణం అమలు లోకి వస్తాయన్న సూచనలు కనిపించడం లేదు. ప్రకటన తాలూకు సంప్రదాయేతర విధానం, సమగ్ర డాక్యుమెంటేషన్ లోపించడం జవాబు లేని ప్రశ్నలను మిగిల్చింది. ఒప్పందం వివరాల ప్రస్తావనకు సంబంధించి భారత్ వైపు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని, చర్చలు తుది దశలో ఉన్నాయని, వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెబుతున్నారు. ఈ విరుద్ధ ప్రకటన అనంగీకారాన్ని ప్రతిబింబించకపోయినా విభిన్న చర్చల తీరును సూచిస్తోంది. ఇంకా చర్చలే ఒక కొలిక్కి రానప్పుడు 18 శాతం సుంకాల తగ్గింపు ఎప్పటి నుంచి అమలు లోకి వస్తుందో నిర్వచించలేకపోతున్నారు. రెండవది అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ స్వేచ్ఛగా ద్వారాలు తెరిచిందని, ట్రంప్ నేరుగా ప్రకటించడం వివాదాస్పదమవుతోంది.

భారత వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు ఈ ఒప్పందంనుంచి రక్షణ ఉంటుందని గోయల్ ప్రకటించగా, గోయల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే దీనిపై వైట్‌హౌస్ అధికార వర్గాలు అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు భారత్ పూర్తిగా అంగీకరించిందని కౌంటర్ ఇచ్చారు. ఈ వైరుధ్యానికి స్పష్టత రావాలంటే ఉభయ దేశాలు ఉమ్మడిగా ప్రకటించడం అవసరం. ఒప్పందంలో ఏవి అంగీకరించారో, ఏవి అమలు చేయాలనుకున్నారో స్పష్టం కావలసి ఉంది. మూడోది తక్కువ టారిఫ్‌ల పరస్పర ప్రయోజనం దృష్టా రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపివేయడానికి భారత్ అంగీకరించిందని ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా అమెరికా, వెనెజులా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్నారు. కానీ అదింకా నిర్ధారణ కాలేదు. భారత్ చవకగా దిగుమతి చేసుకుంటున్న చమురు దిగుమతుల్లో రష్యా వాటా గణనీయంగా ఉంటోంది. ప్రత్యామ్నాయ మార్గాలైతే వ్యయం మరింత భరించవలసి వస్తుంది. రిఫైనింగ్ సమస్యలు తప్పవు. ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు రష్యా విశ్వసనీయమైన వీటో దారునిగా ఉంటోంది.

రష్యాతో తెగతెంపులు చేసుకుంటే దౌత్యపరమైన సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇప్పటికీ రష్యా నుంచి భారత్‌కు రోజూ 1.1 నుంచి 1.3 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి అవుతూనే ఉంది. రష్యాలో అమెరికా ఆంక్షలు లేని సంస్థల నుంచి భారత్ చమురు దిగుమతి కొనసాగిస్తుందని పేరు బయటపెట్టని ప్రభుత్వ వర్గాలు పేర్కొనడం గమనార్హం. నాలుగోది అమెరికా ఉత్పత్తులపై ఏమాత్రం సుంకాలు లేకుండా చేస్తామని భారత్ అంగీకరించిందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ట్రంప్ ప్రకటించినట్టు 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి భారత్ కట్టుబడి ఉందా? అన్నది ప్రశ్నార్ధకమే. తాజా పరిణామాల ప్రకారం అమెరికా నుండి భారత్ 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేసే ఒప్పందం ఐదేళ్ల కాలంలో విడతల వారీగా జరగనుందని భారత్ ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే మొత్తం వస్తువుల విలువ 45 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండగా, 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల కొనుగోలుకు భారత్ ఎలా ఒప్పుకుందో స్పష్టం కావలసి ఉంది. దిగుమతి సుంకాలు (పన్నులు) కాకుండా ఇతర నిబంధనలు లేదా విధానాల ద్వారా అంతర్జాతీయ వాణిజ్యాన్ని పరిమితం చేసే చర్యలు ఏవైనా అంగీకారానికి వచ్చాయా అన్నది తెలియడం లేదు.

సుంకాల రాయితీలు, పెట్టుబడులు, కొనుగోళ్లు ఇవన్నీ కీలకమైన అంశాలే. లేనిపోని తొందరపాటు పడకుండా వీటన్నిటినీ సమతుల్యత చేసుకుంటేనే కానీ భారత్ చేసుకున్న ఒప్పందానికి విలువఉండదు. ఈ ఒప్పందంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చలు, వాదనలు, వదంతుల మధ్య ఉభయ దేశాల అధికార వర్గాలనుంచి స్పష్టమైన ప్రకటనలు రావలసి ఉంది. సుంకాలు తగ్గుతాయని భారీగా ప్రచారం చేయడంతో సరిపోదు. ఎప్పటి నుంచి అధికారికంగా కచ్చితంగా ఈ సుంకాల తగ్గుదల అమలు లోకి వస్తాయో నిర్ణయం కావాలి. ఎందుకంటే కాంట్రాక్టులు, వస్తువుల ధరల నిర్ణయం, సరఫరా వ్యవస్థ, వీటన్నిటిపై కొన్ని నెలలు ముందుగానే వాణిజ్యవర్గాల్లో చర్చలు అవసరమవుతాయి. లిఖితపూర్వకంగా ఒప్పందం ఖరారు కానంతవరకు వాణిజ్య వర్గాల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కావించడం, హడావిడిగా అధికార వర్గాల వివరణలు అధికారిక ఒప్పందానికి ప్రత్యామ్నాయం కాదు.