మే 2025లో మారుతి బెస్ట్ సెల్లింగ్ కార్లు..

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి. ఈ కంపెనీకి సంబంధిచిన కొన్ని కార్లు మే నెలలో అమ్మకాలు వేగం పుంజుకోగా, మరికొన్ని కొన్ని కార్ల అమ్మకాలు తగ్గాయి. మారుతి ఫ్యామిలీ సెడాన్ కారు డిజైర్ అమ్మకాలు బాగా జరిగాయి. దీనితో పాటు బ్రెజ్జా, ఎర్టిగా కార్ల విక్రయాలు కూడా ఊహించిన దానికంటే మెరుగ్గా ఉన్నాయి. ప్రత్యేకత ఏమిటంటే ఈ మూడు కార్లు వేర్వేరు విభాగాల నుండి వచ్చాయి. గత నెలలో అమ్మకాలలో అగ్రస్థానంలో ఉన్న మారుతి సుజుకి ఈ 3 కార్ల గురించి చూద్దాం.

మారుతి కార్ల విక్రయాల్లో డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా అమ్మకాలు అగ్రస్థానంలో ఉన్నాయి. గత సంవత్సరం మే నెలలో కంపెనీ బ్రెజ్జా 16,061 యూనిట్లను విక్రయించగా.. ఈ ఏడాది గత నెలలో (మే) 18,084 యూనిట్ల విక్రయించింది. పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో కంపెనీ ఈ కారు 2023 యూనిట్లును విక్రయించింది. దీనితో పాటు ఎర్టిగా గురించి మాట్లాడుకుంటే..గత నెలలో ఈ కారు 16,140 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే గత సంవత్సరం ఇదే సమయంలో ఈ సంఖ్య 13,892 యూనిట్లు. ఇకపోతే, డిజైర్ 18,084 యూనిట్లతో అమ్మకాలలో ముందుంది. గత సంవత్సరం ఇదే సమయంలో దాని 16,061 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఫ్లిప్‌కార్ట్ జూన్ ఎపిక్ సేల్.. వీటిపై సూపర్ డిస్కౌంట్స్..

ప్రసిద్ధ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఒకదానితో ఒకటి పోటీ పడటానికి ఎప్పటికప్పుడు ఆఫర్లను ప్రకటిస్తాయి. ఈ సమయంలో అనేక ఉత్పత్తులపై ధర తగ్గింపుతో పాటు ఇతర ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ ఎపిక్ సేల్ జూన్ 12, 2025 నుండి ప్రారంభమైంది. ఈ సేల్‌ను జూన్ 18, 2025 వరకు సద్వినియోగం చేసుకోవచ్చు. జూన్ ఎపిక్ సేల్ ఆరు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో గృహోపకరణాలను చౌకగా కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా.. ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్ మొదలైన వాటిని చౌకగా కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ ఎపిక్ సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు ఉన్నాయి. ఈ సేల్ కింద ఇన్ఫినిక్స్ ఫోన్‌లను చౌకగా కొనుగోలు చేయవచ్చు. నథింగ్స్ CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ కూడా 16-17 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. వివిధ బ్రాండ్‌ల ఫోన్‌లు అప్పుడప్పుడు డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి. కాగా, రియల్ మీ P35 5Gపై 20 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లను 44 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. హెచ్‌పి, లెనోవో, ఏసర్, ఆసుస్, డెల్ కంపెనీల ల్యాప్‌టాప్‌లపై 44 శాతం వరకు తగ్గింపు ఇవ్వబడుతోంది. .ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ను 5 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. వివిధ మోడళ్ల ల్యాప్‌టాప్‌లు వివిధ డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి.

నాయిస్ స్మార్ట్‌వాచ్ భారీ తగ్గింపుతో అమ్ముడవుతోంది. వివిధ ఫీచర్లు, ప్రత్యేకతలతో వచ్చే స్మార్ట్‌వాచ్‌లను 68 శాతం నుండి 80 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. శామ్‌సంగ్ స్మార్ట్ వేరబుల్స్‌పై 60 నుండి 65 శాతం వరకు తగ్గింపు ఇవ్వబడుతోంది.

ఎక్కువ తగ్గింపుతో వాషింగ్ మెషిన్ లేదా ఫ్రిజ్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే.. ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్ జూన్ ఎపిక్ సేల్‌లో 29 శాతం వరకు తగ్గింపుతో ఫ్రిజ్‌ను కొనుగోలు చేయవచ్చు. వాషింగ్ మెషిన్‌పై 40 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంది.

27 ఏళ్ల తర్వాత నెరవేరిన కల.. వరల్డ్ టెస్టు ఛాంపియన్ గా సౌతాఫ్రికా

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025 కప్ ను ఈసారి సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ ను తృటిలో చేజార్చుకున్న సఫారి జట్టు.. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ను సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. తొలిసారి డబ్ల్యూటిసి విజేతగా సౌతాఫ్రికా జట్టు నిలిచింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ సమరంలో ఆస్ట్రేలియా విధించిన 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారి జట్టు 83.4 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. అద్భుత సెంచరీతో చెలరేగిన ఓపెనర్ మార్ క్రమ్(136), కెప్టెన్ బావుమా(66)లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత సౌతాఫ్రికా జట్టు తొలి ఐసిసి ట్రోఫీని గెలిచింది. ఈ క్రమంలో మర్ క్రమ్ కూడా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐసిసి ఫైనల్ మ్యాచ్ లో సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు.

కాగా, ఈ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 212 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో 207 పరుగులకే పరిమితమైంది. ఇక, తన తొలి ఇన్నింగ్స్ లో 138 రన్స్ కే కుప్పకూలిన సౌతాఫ్రికాకు ఆసీస్ 282 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హజల్ హుడ్ లు చెలరేగుతున్న క్రమంలో అందరూ సఫారి జట్టు గెలవడం కష్టమే అనుకున్నారు. అయితే, ఓపెనర్ మర్ క్రమ్ అద్భుత ఇన్నింగ్స్ తో అందరీ అంచనాలను తలకిందులు చేశాడు. కెప్టెన్ బావుమాతో కలిసి మూడో వికెట్ కు అత్యధికంగా 143 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో సఫారి జట్టు విజయం దాదాపు ఖాయమైన నేపథ్యంలో భారీ షాట్ కు ప్రయత్నించిన మర్ క్రమ్ ఔట్ అయ్యాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన మరో బ్యాట్స్ మెన్ డేవిడ్ బెడింగ్‌హామ్(21) మిగతా పని పూర్తి చేశాడు. దీంతో 27 ఏళ్లుగా ఊరిస్తున్న ఐసిసి ట్రోఫీని సఫారీ జట్టు సొంతం చేసుకుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్‌తో.. అనిరుధ్ వివాహం..?

Kavya Maran Anirudh Ravichander

సినీ పరిశ్రమలో సెలబ్రిటీలపై రూమర్స్ రావడం సహజమే. సోషల్‌మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి ఇలాంటి రూమర్స్ రావడం ఇంకా పెరిగిపోయింది. అందులో కొన్ని నమ్మేలా ఉంటే.. కొన్ని అస్సులు నమ్మశక్యంగా ఉండవు. తాజాగా అలాంటి రూమర్ ఒకటి వైరల్ అవుతోంది. అదేంటంటే.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌కి (Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌తో (Kavya Maran)  వివాహం జరుగుతోందని.

తెలుగు, తమిళ భాషల్లో భాషల్లో స్టార్ హీరోలకు మ్యూజిక్ చేస్తూ బిజీగా ఉన్నాడు అనిరుధ్(Anirudh Ravichander). అయితే అతనిపై రూమర్స్ రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో అతను హీరోయిన్లు ఆండ్రియా, కీర్తి సురేశ్‌లతో డేటింగ్‌లో ఉన్నాడని పుకార్లు పుట్టుకొచ్చాయి. తాజాగా అతను కావ్య మారన్‌తో(Kavya Maran) ప్రేమలో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2014 నుంచి వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నారని పుకార్లు పుట్టుకొస్తున్నాయి. అయితే ఇద్దరు తమిళవాళ్లే కావడంతో ఇది నిజమేమో అని అంతా అనుకుంటున్నారు. ఇప్పటివరకూ ఇరువైపుల నుంచి ఎలాంటి ఖండన లేదు.. అలా అని అంగీకరం లేదు. కాబట్టి ఇప్పటివరకూ ఇది రూమర్ మాత్రమే

విమాన ప్రమాదం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. AI-171 నంబర్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. విమాన ప్రమాద మృతులకు గౌరవార్ధంగా ఈ నెంబర్ ను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా శనివారం ప్రకటించింది. AI-171 స్థానంలో AI-159 నెంబర్‌ విమానం అహ్మదాబాద్-లండన్‌ మధ్య సేవలందించనుందని తెలిపింది.

కాగా, గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 270కి పెరిగిందని వైద్యులు తెలిపారు. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న విమానం AI 171 గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన నిమిషాలకే BJ మెడికల్ హాస్టల్ భవనాన్ని ఢీకొట్టిన సంగతి తెలిసిందే.

బ్లాక్ బాక్స్ లో ఏముందో తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాం : రామ్మోహన్

waiting find black box

అమరావతి: తన తండ్రి కూడా విమానం ప్రమాదంలోనే మరణించారని ఆ బాధ అర్థం చేసుకోగలనని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమాన దుర్ఘటన మరణించిన వారి కుటుంబాల బాధను అర్థం చేసుకోగలనని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలిలో సహాయచర్యలు చేపట్టారని, గుజరాత్ ప్రభుత్వం, పౌరవిమాన శాఖ సంయుక్తంగా స్పందించిందని చెప్పారు. మంటలార్పి.. మృతదేహాలను వెంటనే అక్కణ్నుంచి తరలించామని, ఈ దుర్ఘటనను పౌరవిమాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని తెలియజేశారు.

దుర్ఘటనపై విచారణకు తక్షణమే ఐదుగురు సభ్యుల కమిటీ వేశామని, అవసరమైతే మరికొంతమంది సభ్యులనూ బృందంలో చేరుస్తామని అన్నారు. బ్లాక్ బ్లాక్స్ విశ్లేషణ (Analysis Block Blocks) తర్వాత ఏం జరిగిందనేది పూర్తిగా తెలుస్తుందని, బ్లాక్ బాక్స్ లో ఏముందో తెలుసుకునేందుకు తామూ ఆతృతగా ఎదురుచూస్తున్నాం అని రామ్మోహన్ పేర్కొన్నారు. హోం సెక్రటరీ ఆధ్వర్యంలో మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, వివిధ రంగాలకు నిపుణులతో కమిటీ వేశామని చెప్పారు. పౌరవిమానయాన సంపూర్ణ దర్యాప్తు జరిపేందుకు ఈ కమిటీ సభ్యులు దోహదపడతారని, 787 సిరీస్ ను తరచుగా తనిఖీలు చేయాలని ఆదేశాలు ఇచ్చామని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వాలు చేస్తున్న చిరుసాయం కాస్త ఊరట కలిగిస్తుందని ఆశిస్తున్నానని రామ్మోహన్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ముల్లుకుచ్చుకుంటే.. బిజెపి నేతలకు నొప్పిలేస్తుంది: నిరంజన్ రెడ్డి

కాంగ్రెస్, బిజెపిపై బిఆర్ఎస్ మాజీ మంత్రి నింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముల్లుకుచ్చుకుంటే.. రాష్ట్ర బిజెపి నేతలకు నొప్పిలేస్తుందని అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రాజెక్టులలో జరుగుతున్న నష్టాల మీద రాష్ట్ర బిజెపి నేతలు, ప్రజా ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల్లో నష్టాలపై ఎలాంటి కమిషన్లు వేయదని.. విచారణ కూడా చేయదన్నారు. శ్రీశైలం సొరంగం కూలినా.. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినా.. వట్టెం పంప్ హౌస్ మునిగినా.. కేంద్రం ఎందుకు కమిషన్లు పంపడం లేదని మాజీ మంత్రి ప్రశ్నించారు. వాటి మీద విచారణకు రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు డిమాండ్ చేయరని నిరంజన్ రెడ్డి నిలదీశారు.

ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి ప్రియాంక ఔట్.. రకుల్ ఇన్?

Rakul Preet Priyanka Chopra

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. దీంతో దర్శకులు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు తెరకెక్కించేందుకు ఇష్టపడుతున్నారు. అలా తెరకెక్కుతున్న ఓ పాన్ ఇండియా సినిమానే ‘రామాయణ్’. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా.. సౌత్ ముద్దుగుమ్మ సాయి పల్లవి సీత పాత్ర పోషిస్తుంది. కన్నడ రాక్‌స్టార్ యశ్ రావణాసురుడిగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో రావణాసురిడి సోదరి శూర్పణక పాత్ర కోసం ప్రియాంక చోప్రాని తీసుకున్నారట. కానీ, ఆమె చేతినిండ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమా నుంచి బయటకు వచ్చేసి టాక్. అయితే ప్రియాంక స్థానంలో ఆ పాత్రకి రకుల్ ప్రీత్ సింగ్‌ను సంప్రదించారని.. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగం కావడమే సంతోషంగా భావించిన రకుల్ వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పాత్ర కోసం రకుల్ లుక్ టెస్ట్ కూడా జరిగిందట. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉన్నదో అనే విషయం తేలాల్సి ఉంది. ఇక రామాయణ్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి రెండో భాగం 2027లో విడుదల కానుంది.

సుప్రీం తీర్పు బాబుకు చెంపపెట్టు వంటిది: జగన్

Supreme Court strong warning

అమరావతి: నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న..ఎపి సిఎం చంద్రబాబు నాయుడుకు కు సుప్రీం కోర్టు గట్టిగా బుద్ధి చెప్పిందని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీనియర్ జర్నలిస్టు కెఎస్ఆర్ ను వెంటనే విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు వంటిదని అన్నారు. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు..తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదాహం అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

విమాన ప్రమాదం.. ఎయిర్ ఇండియాపై మండిపడ్డ నటి

Meera Chopra Air India

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం యావత్ భారత దేశాన్ని కలచివేసింది. ఈ ఘటన తర్వాత పలువురు విమానం ఎక్కాలంటే భయపడుతున్నారు. చాలా మంది విమాన టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఎయిర్ ఇండియా (Air India) విమాన ప్రయాణంలో భద్రత గురించి అంతా భయపడుతున్నారు. అయితే నటి ప్రియాంక చోప్రా సోదరి మీరా చోప్రా (Meera Chopra) భర్త కూడా ఎయిర్ ఇండియా విమానంలో ఈ నెల 15వ తేదీన దుబాయ్ వెళ్లాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదం తర్వాత ఆయన తన ప్రయాణన్ని రద్దు చేసుకున్నారు. కానీ, విమాన టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు ఎయిర్ ఇండియా నిరాకరించింది.

దీంతో ఆమె ఆగ్రహానికి గురైంది. ఎయిర్ ఇండియా (Air India) తీరుపై ఆమె ఎక్స్ వేదికగా మండిపడింది. తన భర్త విమాన ప్రయాణాన్ని భద్రత కారణాల దృష్ట్యా రద్దు చేసుకున్నామని.. కానీ, ఎయిర్ ఇండియా వారికి ఎటువంటి సూచన రాలేదని పేర్కొంటూ.. టికెట్ ధర మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించిందని మీరా (Meera Chopra) తెలిపింది. టాటా గ్రూప్స్ నడుపుతున్న ఎయిర్ ఇండియా సంస్థ అంటే గర్వపడతాం.. కానీ, ఈ రోజు జరిగింది చూశాక వారు విమానాలు నడుపుతున్న తీరు తీవ్ర నిరాశపరిచిందని పేర్కొంది. ఈ ఘటన ఎయిర్ ఇండియా సంస్థకు సిగ్గుచేటు అని.. 241 మంది ప్రాణాలు కోల్పోయిన సంస్థ అస్సలు పట్టించుకోదంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

అయితే దీనిపై పలువురు నెటిజన్లు మీరాకు కౌంటర్ ఇస్తున్నారు. టికెట్ కాన్సిలేషన్ గురించి ముందే చదువుకోవాలని.. ఎప్పుడు కావాలంటే అప్పుడు టికెట్ ప్రయాణ సమయం మార్చడం కుదరదని కామెంట్ చేస్తున్నారు. మీ సొంత కారణాలతో ప్రయాణం రద్దు చేసుకుంటే.. డబ్బులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని జవాబు ఇస్తున్నారు.