లండన్: ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీం ఇండియా ప్రత్యర్థి స్కోర్‌ను సమం చేసిన విషయం తెలిసిందే. అయితే కెఎల్ రాహుల్ (KL Rahul), రిషబ్ పంత్‌లు బ్యాటింగ్ చేస్తున్న దశలో భారత్.. ఇంగ్లండ్ స్కోర్‌ను దాటేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, మూడో రోజు భోజన విరామ సమయానికి ముందు రిషబ్ పంత్ రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ మలుపు తిరిగింది. అనవసరంగా పరుగు కోసం ప్రయత్నించి పంత్ రనౌట్ కావడం భారత అభిమానుల్ని నిరుత్సాహానికి గురి చేసింది.
చాలా మంది పంత్ తొందరపడ్డాడని విమర్శించారు. అయితే దీనిపై కెఎల్ రాహుల్ (KL Rahul) వివరణ ఇచ్చాడు. తాను సెంచరీ చేయాలనే ఉద్దేశ్యంతోనే పంత్ పరుగు కోసం ప్రయత్నించాడని.. అందులో అతని తప్పేమీ లేదని రాహుల్ పేర్కొన్నాడు. రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లంచ్ విరామానికి ముందే నేను సెంచరీ సాధిస్తానని పంత్‌తో చెప్పాను. అందుకే పంత్ నాకు స్ట్రైక్ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ, దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. ఇది మా ఇద్దరికీ నిరాశ కలిగించింది. ఏ బ్యాటర్ కూడా ఇలా ఔట్ అవ్వాలని అనుకోడు. ఆ రనౌట్ మూమెంటమ్‌ను దెబ్బ తీసింది. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఇంగ్లండ్ తిరిగి గేమ్ లోకి వచ్చింది’’ అని అన్నాడు.
Leave a Reply