గిల్‌ని ఊరిస్తున్న అనితర సాధ్యమైన రికార్డు.. అదేంటంటే..

Shubman Gill

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) మంచి ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన అతను రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న రికార్డును కైవసం చేసుకున్నాడు. ఇలా మరిన్ని రికార్డులను కూడా తిరగరాశాడు గిల్.

అయితే ఇప్పుడు ఓ అరుదైన, అనితర సాధ్యమైన రికార్డు గిల్‌ను (Shubman Gill)) ఊరిస్తోంది. గిల్ ఈ సిరీస్‌లో ఇప్పటికే 585 పరుగులు చేశాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. ఐదు అంతకంటే తక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో (విదేశాల్లో) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా లెజెండ్ డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును గిల్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. బ్రాడ్‌మాన్ 1930లో ఇంగ్లండ్ పర్యటనలో 974 పరుగులు చేశారు. 95 ఏళ్లుగా ఈ రికార్డును ఎవరూ చేధించలేకపోయారు. ఆ తర్వాతి స్థానంలో వాలీ హేమాండ్(905 పరుగులు), మూడో స్థానంలో నీల్ హార్వే(834 పరుగులు), నాలుగో స్థానంలో వివ్ రిచర్డ్స్ (829 పరుగులు), ఐదో స్థానంలో క్లైడ్ వాల్కాట్ (827 పరుగులు) ఉన్నారు. గిల్ ఈ సిరీస్‌లో ఈ జాబితాలో స్థానం సంపాదించుకొనే అవకాశం ఉంది.

భారత్‌ తరఫున ఈ రికార్డు సునీల్‌ గవాస్కర్‌ పేరిట ఉంది. గవాస్కర్‌ 1970/71 వెస్టిండీస్‌ పర్యటనలో 4 మ్యాచ్‌ల్లో 774 పరుగులు చేశాడు. గవాస్కర్‌ తర్వాత ఈ రికార్డు విరాట్‌ కోహ్లి పేరిట ఉంది. విరాట్‌ 2014/15 ఆస్ట్రేలియా పర్యటనలో 692 పరుగులు చేశాడు. ఈ జాబితాలో గిల్ ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్ ముగిసేలోపు గిల్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *