100 కోట్లతో రోడ్డు.. కానీ, మధ్యలో చెట్లను అలాగే వదిలేసి..

Bihar Road

జెహానాబాద్: కొత్తగా నిర్మించిన రోడ్డుపై ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి గుంతలు లేకుండా రోడ్డుకు ఇరువైపుల ప్రకృతిని ఆస్వాదిస్తూ చేసే ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ, ఆవే చెట్లు రోడ్డు మధ్యలో ఉంటే.. ఆ ప్రయాణం గందరగోళంగా మారుతుంది. బిహార్ రాజధాని పాట్నాకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెహానాబాద్‌లో ఇలాంటి రోడ్డునే (Bihar Road) నిర్మించారు. పాట్నా నుంచి గయాకు వెళ్లే మార్గంలో 100 కోట్లతో 7.48 కిలోమీటర్ల మేర జరిగిన రోడ్డు నిర్మాణంలో చెట్లను అలాగే వదిలేశారు.

అసలు కారణం ఏంటంటే.. జిల్లా యంత్రాంగం ఈ రోడ్డు (Bihar Road) నిర్మాణ బాధ్యతలను తీసుకుంది. అయితే చెట్లను తొలగించడానికి అటవీ శాఖను వాళ్లు సంప్రదించారు. కానీ అటవీ శాఖ అందుకు ఒప్పుకోలేదు. ఒకవేళ చెట్లు తొలగిస్తే.. 14 హెక్టార్ల భూమిని పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో ఆ డిమాండ్‌ను పూర్తి చేయలేకపోయిన అధికారులు ఈ విచిత్రమైన పనికి పూనుకున్నారు. రోడ్డుపై ఉన్న చెట్లు ఒక వరుసలో ఉన్నా బాగుండేది.. కానీ, అవి గజిబిజిగా ఉన్నాయి. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే.. ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడంగా మారింది. ఇప్పటికే ఈ రోడ్డులో పలు ప్రమాదాలు జరిగాయని ఓ వ్యక్తి తెలిపారు. అయితే ఈ రోడ్డును పునరుద్దరించకపోతే పెను ప్రమాదం జరిగి ఎవరి ప్రాణాలైనా పోతే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *