ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025 కప్ ను ఈసారి సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ ను తృటిలో చేజార్చుకున్న సఫారి జట్టు.. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ను సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. తొలిసారి డబ్ల్యూటిసి విజేతగా సౌతాఫ్రికా జట్టు నిలిచింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ సమరంలో ఆస్ట్రేలియా విధించిన 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారి జట్టు 83.4 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. అద్భుత సెంచరీతో చెలరేగిన ఓపెనర్ మార్ క్రమ్(136), కెప్టెన్ బావుమా(66)లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత సౌతాఫ్రికా జట్టు తొలి ఐసిసి ట్రోఫీని గెలిచింది. ఈ క్రమంలో మర్ క్రమ్ కూడా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐసిసి ఫైనల్ మ్యాచ్ లో సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు.
కాగా, ఈ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 212 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో 207 పరుగులకే పరిమితమైంది. ఇక, తన తొలి ఇన్నింగ్స్ లో 138 రన్స్ కే కుప్పకూలిన సౌతాఫ్రికాకు ఆసీస్ 282 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హజల్ హుడ్ లు చెలరేగుతున్న క్రమంలో అందరూ సఫారి జట్టు గెలవడం కష్టమే అనుకున్నారు. అయితే, ఓపెనర్ మర్ క్రమ్ అద్భుత ఇన్నింగ్స్ తో అందరీ అంచనాలను తలకిందులు చేశాడు. కెప్టెన్ బావుమాతో కలిసి మూడో వికెట్ కు అత్యధికంగా 143 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో సఫారి జట్టు విజయం దాదాపు ఖాయమైన నేపథ్యంలో భారీ షాట్ కు ప్రయత్నించిన మర్ క్రమ్ ఔట్ అయ్యాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన మరో బ్యాట్స్ మెన్ డేవిడ్ బెడింగ్హామ్(21) మిగతా పని పూర్తి చేశాడు. దీంతో 27 ఏళ్లుగా ఊరిస్తున్న ఐసిసి ట్రోఫీని సఫారీ జట్టు సొంతం చేసుకుంది.
Leave a Reply