ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందిన సంఘటన వికారాబాద్‌లో చోటుచేసుకొన్నది. సోమవారం ఉదయం సుమారు 07:40 గంటల సమయంలో వికారాబాద్ పట్టణ పరిధిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధారూర్ మండలం కొండాపూర్ కలాన్ గ్రామానికి చెందిన చాకలి లాలలయ్య (35), తన కుమారుడు చాకలి రిథిక్ (6)తో కలిసి మోటార్ సైకిల్‌పై వికారాబాద్ వైపు వస్తున్నారు. అదే సమయంలో వారి వెనుక చాకలి లాలయ్య భార్య మేఘన, తన కుమార్తె రిషికతో కలిసి స్కూటీపై వస్తున్నారు. ఈక్రమంలో వికారాబాద్ నుంచి తాండూర్ వైపు లారీ (ట్రక్కు) క్రేన్ లోడ్‌తో వెళ్తోంది. ట్రక్కు డ్రైవర్ అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న లాలయ్యా మోటార్ సైకిల్‌ను ఢీకొట్టాడు. అనంతరం స్కూటీని ఢీకొట్టాడు.
దీంతో ట్రక్కు(లారీ) నియంత్రణ కోల్పోయి, ట్రక్కు, క్రేన్ రెండూ చాకలి లాలయ్య, అతని కుమారుడు రిథిక్‌పై పడ్డాయి. భార్య మేఘనకు స్వల్ప గాయాలయ్యాయి. వీరు పరిగిలో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఆదివారం సెలవురోజు కావడంతో కొండాపూర్ కలాన్ గ్రామంలో ఉంటున్న తల్లిని చూసేందుకు లాలయ్య కుటుంబంతోసహా వచ్చాడు. యథావిధిగా మళ్లీ వారి వారి ప్రైవేట్ ఉద్యోగాల్లో విధులు నిర్వహించేందుకు సోమవారం ఉదయమే కొండాపూర్ కలాన్ గ్రామంనుంచి బయలు దేరారు. ఇంతలోనే ప్రమాదం ట్రక్కు రూపంలో వచ్చి తండ్రికొడుకును మృత్యు ఒడిలోకి తీసుకెళ్లింది. ఈ ఘటనతో స్వగ్రామం కొండాపూర్ కలాన్‌లో విషాదఛ్చాయలు అలుముకున్నాయి.
కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రమాదం గురించి వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, గాయపడిన వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరిశీలించిన అనంతరం, రిథిక్ బాలుడు ఉదయం 08:38 గంటలకు మృతి చెందినట్లు ప్రకటించారు. చికిత్స పొందుతూ చాకలి లాలయ్య ఉదయం 10:37 గంటలకు మృతి చెందారు. విచారణలో, లారీ డ్రైవర్ ఎమ్.డి. షకీర్ (తండ్రి రుస్తం, నివాసం: హర్యానా రాష్ట్రం) మద్యం సేవించి వాహనం నడిపినట్లు ప్రాథమికంగా తేలింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్ సీఐ తెలిపారు.





